Thursday, February 12, 2009

దశ రూపకం - ౮(ఎనిమిదో) వ భాగం

మందపిల్లి.
03-12-38.
రసరాట్టుగారూ! శాస్త్రం చెప్పిన తరవాయిగా వచ్చింది. ఎప్పటికప్పుడు మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం కట్టేద్దాం అనుకుంటూండడం,ఏదో పిల్లసమ్మేరీ వస్తూండడం జరుగుతోంది.మీరేమన్నా అనుకుంటారేమో అని ఇదవుతున్నాను కుడానూ! ఈవేళ మరో ఆయన వచ్చాడు. ఇతగాడిపేరు కేతయ్యట. ఆయనకూడా మా నాన్న గారి చేతికి అభిప్రాయం నిమిత్తం తన రచన ఇచ్చాట్ట. మా నాన్న ఊళ్ళో లేరని చెప్పేసి మెల్లిగా ఆయన్ని వొదిలించుగున్నాను. ఘంటారావురచనమీద అభిప్రాయం నిన్న మరొకరి దగ్గర్నించి నాకు వచ్చేసింది.మీదగ్గిరున్న రచన కేతయ్యదే. ఏదో ప్రసంగం వచ్చి , మీకూ తనకీ పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందని కేతయ్య అన్నాడు.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౪-౧౨-౩౮

గోపీ! ఈ సంగతి రాశావు నయమే. ఇంకాదాచుగుని ఊరుకున్నావుకావు,చచ్చిపోదుం. నాకూ అనిపించింది,'ఏమిరా! కొన్ని లక్షణాలు ప్రశంసార్హంగా కనిపిస్తూఉన్నా, ఈ రచన మొత్తంమీద ఏడిసినట్టుందేమిటీ అని. అల్లా అనిపించడానికి కారణం ఇప్పుడు భోదపడ్డది.
ఇంత దరిద్రగొట్టురచన భూమిమీదగాని,అంగారకుడులో గాని లేదు. బుద్ధిగల వాడెవడూ ఇది చివరంటా చదవడు. అందుకనే నే చదవలేదు. ఇందులో, గాఢంగా చూస్తే, అర్ధం వ్యర్ధం,భావం అభావం,రసం నీరసం,శైలిగాలి,భాషఘోష ,రీతి కోతి, వృత్తి మిత్తి,శయ్య కొయ్య,ధార నార. కొన్ని పట్ల కవి ఏడవబోయాడు. ఆ ఏడుపు ఉచితరీతిగా-అనగా ఏడుపు ఏ రీతిగా ఊండాలో అల్లా లేదు. నన్నడిగితే నేనేనా చెబుదును. చాలా బేస్ధలాల్లో కూడా నవ్వు తెప్పించడానికి ప్రయత్నించి రచయిత చచ్చి చెడ్డాడు.నేనెంత బిగపట్టుగుని కూర్చున్నా ప్రాణంమీది కొచ్చింది గాని నవ్వు రాలేదు. సహజమైన మాటపొందికా సమయస్ఫూర్తీ ఇందులోమృగ్యం. రచననీ , రచయితనీ వేరువేరుగా పుఠాలేసినా ఈ రచన ఇంతే. నుడికారం సుడిలో పడింది, కారకం మారకం చెందింది. నాబోటి గొప్పవాళ్ళనీ కొన్ని గొప్పసంస్ధల్నీ నిరసించడం తప్ప ఇతరం ఏమీ ఇందులో లేదు. ఈ రచనలో కొంత-చిరవదాకా అసలే చదవలేకపోయాను!-చదివి నేను చాలా పాడైపోయాను. నే కాక తక్కినవాళ్లు చదివితే ఎక్కడ చెడిపోతారో అని బెంగతో తీసుగుంటున్నాను. ఇది ఎవరేనా చదివితే పెద్ధ ఒట్టు; జాగ్రత్త!

ఇట్లు,
రసరాట్

No comments: