Tuesday, March 1, 2011

వివేకానందుడికి కూడా మతం రంగు పులుముతున్నారు.

జై శీరామ్,
శ్రీరామదూతం శిరసా నమామి!

హైదరాబాద్, ఫిబ్రవరి 27 : ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీఓ నంబర్ 16
ద్వారా స్వామి వివేకానంద జీవితం, బోధనలను ఉపవాచకంగా ప్రవేశపెట్టాలని
ఆదేశించడం సరైన చర్య కాదని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
ఎన్.నారాయణ, ఐ.వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. దానివల్ల ఒక మత సారాన్ని
విద్యార్థులపై రుద్దినట్లవుతుందని తెలిపారు.
-----------------------------------------------------------------------------------
ఆఖరికి వివేకానందుల మీద పడ్డారు. వారి మాటలు మత ప్రచారాలా? వారి మాటలు,జీవిత విశేషాలు తెలిపే వివరాలు పిల్లలకు పాఠ్యాంశాలుగా ఉంచడం భావ్యం కాదా, భగవంతుడా! ఎటుపోతుంది నా దేశం. ఆయన ఏనాడూ అదిస్తాము మా మతంలో చేరండి, ఇదిస్తాము మా మతంలో చేరండి అని అనలేదే.ఆత్మోద్ధరణ లేని మతాచారం నిన్ను మరింత కూలదోస్తుంది అని చెప్పారు. మతాచారాలు పాటించేవారి కన్నా తమ మీద తమకు నమ్మకమున్న వారినే ఈ దేశానికి పునాదులుగా, భావితరాలకు దిశానిర్దేశం చెయ్యగల మార్గదర్శకులుగా ఆయన భావించారు.
వివేకానందుల వారి జీవితం ఒక అన్వేషణ.సత్యం కోసం,తనను తాను తెలుసుకోవడం కోసం, తనేంటో తెలుపగల గురువు కోసం చేసిన నిరంతర అన్వేషణ.అందులో ఎంతటివారినైనా ప్రశ్నించగల ధైర్యం ఉంది, గుడ్డిగా నమ్మకపోవడం అన్న ఆత్మస్థైర్యం ఉంది. వివేకానందుడి పుట్టినరోజు మాత్రం యువజన దినోత్సవంగా జరుపుతారట, కానీ ఆయన బోధనలు మాత్రం యువతరానికి మార్గదర్శకం కావట. రెండింటికీ ఏమన్నా పొంతన ఉందా?
ఆయన మహోన్నత వ్యక్తిత్వం చదివే వ్యక్తికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోగల ఆలోచనని ప్రచోదనం అయ్యేలా చెయ్యగలదు. ఒక గమ్యాన్ని చేరుకునే పధకరచన చేసుకునేలా ప్రేరేపించగలదు.అలాంటి వ్యక్తి గురించి చెప్పడం మతసారాన్ని పిల్లమీద రుద్దడం అవుతుందా? అలాంటి ఆయన్ని మతప్రచారకుడిగా మార్చే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?
మీరూ మీ ప్రతిస్పందనని utf వాళ్ళకి ( ఈ మెయిల్ ఐడి ద్వారా aputf2000@yahoo.com)తెలియచెయ్యండి, కనీసం అలా అన్నా వివేకానందుడి గొప్పతనానికి మచ్చ తెచ్చే, భావితరాలను వివేకానందుడి లాంటి గొప్ప స్ఫూర్తిదాతను మరిచిపోయేలా చేసే ఈ ప్రయత్నాన్ని అడ్డుకుందాం. ఇది మతాల సమస్య కాదు, పిల్లలకు పనికొచ్చేవాటిని కూడా మతం పేరుతో దూరం చేస్తున్నారు.మతాలకతీతంగా దీన్ని ఖండించాలి..