Friday, February 6, 2009

వేయి పడగల నీడలో నేను-2(గిరిక)

"ఒక పుస్తకంపై సమీక్ష రాయడానికి కావలసిన అర్హత ఏంటి? " ఈ ప్రశ్న ఏప్పటినుండో నా మనసుని తొలచేస్తుంది.నా వరకైతే ఆ పుస్తకాన్ని ఆమూలాగ్రంగా చదవడమే ఆ అర్హత . అలా అయితే వేయి పడగలు మీద నేను సమీక్ష రాయవచ్చు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది.
వేయి పడగలు నన్ను రెండు విధాలుగా మార్చింది.ఒకటి-ఆధ్యాత్మికంగా,రెండు -వ్యక్తిగా .
వ్యక్తిగతమైన అభివృద్ధిని ఇంకొక టపాలో వివరిస్తాను.
మొదట ఆధ్యాత్మికంగా -
దైవానికి నాకు దూరం పెరుగుతోంది అని మొట్టమొదటి సారి బి.టెక్ లో ఉన్నప్పుడు అనిపించింది.ఎందుకు,ఎవరి వల్ల అని చాలా ఆలోచించాను.నా వల్లైతే కాదు అని ఒక సారి, ఏం జరిగినా నా వల్లే జరిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి అనిపించేది. ఆ సమయంలోనే వేయి పడగలు చదివాను.
మహాతల్లి గిరిక నా మనసును కదిలించింది.నాకు మళ్ళీ మార్గనిర్దేశం చేసింది.అప్పుడే మహాతల్లి గిరికతో పాటు ధర్మరావు గారిని నేను కూడా గురువుగా మనసా స్ధాపించుకొన్నాను.నేను కూడా కళ్యాణోత్సవాలకోసం వేయి కన్నులతో ఎదురుచూశాను.వేయిపడగలు పుస్తకం అంతా ఒక ఎత్తు వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలు ఒక ఎత్తు.సుబ్బన్నపేటలో నాగేశ్వర స్వామిని మొదటసారి చూసినప్పుడు అరుంధతికి కలిగిన అనుభూతి లాంటిది కలిగింది ఆ కళ్యాణోత్సవాలు చదువుతుంటే. ఎన్ని సార్లు చదివినా జరిగిన పెళ్ళిని మళ్ళీ వీడియో లో చూస్తున్న అనుభూతే కలిగేది.పదకొండు రోజుల కళ్యాణోత్సవాలు, దశావతారాలు . ఉత్సవాలు పూర్తయ్యేసరికి స్వామి అన్ని అవతరాలను నా కళ్ళ ముందే ధరించినట్లనిపించింది. మనకు ఒక కల్పం బ్రహ్మ కు ఒక రోజు ఎలా అవుతుందో అనుభవపూర్వకంగా తెలిసింది. ఎందుకంటే సుబ్బన్నపేటలో పదకొండు రోజులు అనంతపురంలో మూడు రోజులే అయ్యాయి కదా.

గిరికాదేవి మత్స్యరూపిణి అయినపుడు ఆమెతో కలిసి స్వామి కోసం సాగరగర్భాన్ని శోధించాను. గిరికా దేవి కూర్మరూపిణి అయినపుడు స్వామి ఎక్కడ మంధర పర్వతాన్ని మోయలేక కందిపోతాడో అని ఆమెతో పాటు నేను తల్లడిల్లాను. ఇలా ప్రతి అవతారంలోనూ గిరిక తోపాటు నేను ఆ స్వామికోసం ఎదురుచూసాను.
కళ్యాణోత్సవాల ముగింపురోజున స్వామి గిరికతోపాటే నన్ను అనుగ్రహించాడు.నా చర్మచక్షువులకి ఙ్ఞాన దృష్ఠిని ప్రసాదించాడా అనిపించింది.

నేను నీకెప్పుడూ దూరంగా వెళ్ళలేదు, "యతోభావ: తతో దృష్టి:" -అన్న స్పష్టమైన సందేశం క(వి)నిపించింది.


అనుభవైక వైద్యమైన ఈ అనుభవాన్ని అక్షరరూపంలో పెట్టాలని నేను ఎంత ప్రయత్నించినా చేయలేకపోయాను.నాచేతనైనంత ప్రయత్నించాను ఏమైనా ఉంటే విఙ్ఞులు సరిదిద్దగలరు.

7 comments:

బుజ్జి said...

ఈ పుస్తకంలో ఏదో ఉంది మనల్ని కట్టి పడేసేది. ఈ పుస్తకం అయిపొయ్యే వరకు రోజూ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఈ పుస్తకం ముందేస్కుని కూర్చునేదాన్ని.సుబ్బన్న పేటలో వచ్చే మార్పులని చెప్పిన తీరు నాకు ఎక్కువగా నచ్చింది.

మనోహర్ చెనికల said...

అమ్మయ్య, చలం అంతటి వాడిని కాపీ కొట్టి ఎంతో క్రియేటివ్ గా న్యూజింగ్స్ అని పేరు పెట్టినా ఎవరూ చూడట్లేదేంటా అనుకుంటున్నా, thank god,
ఇక పుస్తకం గురించి, మీరన్నది అక్షరాలా నిజం.ఈ పుస్తకంలో మనల్ని కట్టిపడేసేది ఏదో ఉంది.

చదివిన చాలా రోజులు సుబ్బన్నపేట, గుడి, కళ్యాణోత్సవాలు నన్ను వదలలేదు.

కొత్త పాళీ said...

పత్రికల్లో రాయడానికి ఏవన్నా వేరే అర్హతలు కావాలేమో కానీ మీ బ్లాగులో రాసుకునేందుకు .. మీరన్నట్టు పుస్తకం చదవడమే అర్హత. అందులోనూ మీరు సహృదయంతో చదివినట్టున్నారు. బాగుంది మీరు రాసింది.

Anonymous said...

చాలా చక్కగా వ్రాసారు. వేయి పడగలు నాకు కూడా చాల ఇష్టమైన పుస్తకం.

cbrao said...

ఇంతకూ ఈ విలువైన (400 రూపాయలు) పుస్తకం ఇచ్చే సందేశమేమిటో వివరించి ఉండవలసినది.

కొత్త పాళీ said...

ఏ పుస్తకమైనా సందేశం ఎందుకివ్వాలి? ఒకేళ ఇచ్చినా అది ఒకే సందేశం ఎందుకవ్వాలి? ఒకే పుస్తకాన్ని చదివిన పలువురు పాఠకులు పలు రకాల అభిప్రాయాల్ని ఏర్పరుచుకోరా? అంతిమంగా ఒక రచనకి అర్ధాన్ని సృష్టించుకునేది పాఠకుడే కాదా?

మనోహర్ చెనికల said...

కొత్తపాళీ గారన్నట్టు ఒక పుస్తకం ఇచ్చే సందేశం మనం చదివే మూడ్ ని బట్టి కూడా ఉంటుంది.రావు గారూ, నేను "వేయి పడగలు " గురించి రాద్దాం అనుకున్నది కూడా ఆ పుస్తకం ఇచ్చే సందేశం గురించే, కానీ మొదలుపెట్టేసరికి దేని గురించి రాయాలో తెలియలేదు. దర్మారావు , అరుంధతి ల దాంపత్యం గురించి రాయాలా ,
రామేశ్వర శాస్త్రి, కృష్ణమ నాయుడు ల మైత్రీ భంధం గురించి రాయాలా,
కిరీటి,సూర్యపతి,రాఘవరావు ధర్మారావు ల స్నేహం గురించి రాయాలా,
కిరీటి ,శశిరేఖల ప్రణయమూ,పరిణయమూ, వారి లేఖల గురించి రాయాలా,
హరప్పనాయుని రాజసం గురించి రాయాలా,
భోగప్పశాస్త్రి కౌశలం గురించి రాయాలా,
లక్ష్మణ స్వామి ఆత్మ ఘోష గురించి రాయాలా,
గణాచారి గురించి రాయాలా,
కుమారస్వామి గురుభక్తి గురించి రాయాలా,
పసిరిక ప్రకృతిస్నేహం గురించి రాయాలా,
మంగమ్మ హ్హృదయ పరివర్తన గురించి రాయాలా,
విద్యా విధానంపై, భక్తి తత్పరతపై, చిత్రలేఖనంపై మరియు నాట్య,నాటక,కళా పరిషత్తులపై ధర్మారావు గారి అభిప్రాయాలు రాయాలా,

ఏమీ అర్ధం కాలేదు.
ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్కలాగా అనిపించేది.
అందుకే నన్ను ప్రభావితం చేసిన పాత్రల గురించి రాద్దాం అనుకున్నాను. అందులో భాగంగానే గిరిక పాత్ర గురించి రాసాను.
ఆదిలక్ష్మి గారు:
నెనర్లు
కొత్తపాళీ గారు:
నెనర్లు