Wednesday, July 4, 2012

గురువు



గురువంటే ఎవరు? శాస్త్రాలు చాలాచెప్తున్నాయి. నాకున్న శాస్త్రజ్ఞానం పరిమితం కాబట్టి వాటిని ఉటంకించడంలేదు. నాకున్న తెలివిలోనుండి గురువు గురించి నాకు తెలిసిన మాటలు రాస్తున్నాను. అయినా నాకున్న తెలివి అని మాట్లాడేవాడికి గురువు గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? అందుకే ఆ స్వామి పలికిస్తున్నారన్న నా నమ్మకం చెప్పినట్టు రాస్తున్నాను. నా ఇంట్లో, గురువు హోదాలో నన్ను చెయ్యి పట్టుకుని నడిపించిన వారి గురించి ఈ టపా!

          ఎవరికైనా ప్రపంచంలో మొదటి గురువు అమ్మ అంటారు. కానీ ఎంత ఊహ తెలిసిన తర్వాతైనా ఆ విషయాన్ని పట్టించుకోము. ప్రపంచంలో అమ్మ ఒకటే "నా ఆయుష్షు కూడా పోసుకుని బతకరా" అంటుంది. మొన్ననే గూగుల్ ప్లస్సులో ఒక పోస్ట్ చదివాను. "తినవలసిన మనుషులు నలుగురు ఉండి, ముగ్గురికి మాత్రమే సరిపడా తిండి ఉన్నప్పుడు, ఏమాత్రం ఆలోచించకుండా నాకీరోజు ఆకలిలేదని అనే వ్యక్తి ఒక్క అమ్మ మాత్రమే". నిజం కూడా. అత్తా, తోడికోడలు తిండి కూడా పెట్టకుండా మాడ్చుతుంటే, భర్త దూరదేశంలో ఉంటే, కాన్పు తర్వాత పచ్చడి మెతుకులు తినవలసి వచ్చినా, తన కొడుకుకి మాత్రం పాలపొడి డబ్బాలు తెమ్మని భర్తని సాధించింది ఒక తల్లి, పాలు లేనప్పుడు మరో తల్లి గోమాత పాలు తెచ్చి పట్టింది. నెలల పసిగుడ్డుని భుజాన వేసుకుని పొలం పనులకి వెళ్ళింది ఆ మహాతల్లి. ఆవిడ ఏమి చదుకోలేదు, స్వార్ధం, త్యాగం లాంటి మాటలు కూడా తెలియవు. ఐతేనేం, తన బిడ్డలు బాగా బతకాలన్న స్వార్ధం, తన బిడ్డలకోసం ఏమైనా వదులుకోగల త్యాగం ఆమె సొంతం.

                  అందుకే ఆమెని సనాతన ధర్మం తొలిగురువుని చేసింది. దక్షిణామూర్తి ఏ రకంగానైతే "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వమో" తల్లి కూడా అలాంటిదే, ఒక్కనాడు నోరు విప్పి జ్ఞానబోధ చెయ్యదు. కాని మనసు పెట్టి ఆ తల్లిని అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఎన్ని తెలుస్తాయో. సకలవేదస్వరూపం అమ్మ. తన బిడ్డలకోసం లోకం మొత్తంతో పోరాడగల ధనుర్వేద ధురంధరి ఆమె. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఎన్నని చెప్పగలం? ఎన్నని , ఏమని ఎన్నగలం తల్లి ప్రేమని.

అందుకే "మాతృదేవోభవ".

                           సహజంగా లోకంలో ఒక నానుడి ఉంది. తల్లి నిజం, తండ్రి నమ్మకం అని. కానీ ఆ స్థాయిని దాటి తండ్రికి గురువు స్థానం ఇచ్చింది సనాతన ధర్మం. అంటే తన బిడ్డ భాధ్యతయుతంగా పెరగాలని కోరుకోవడమే కాదు, పెరిగేలా చెయ్యాల్సిన ప్రాధమిక భాద్యతని కూడా తండ్రి మీదనే ఉంచింది ధర్మం. నివురుగప్పిన నిప్పులా ఉంటూ, ఎన్ని బాధలు ఎదురైనా గుట్టుగా ఉంటూ తినడానికి తిండి లేకపోయినా తన బిడ్డ మాత్రం మంచి చదువు చదవాలని కోరుకుంటాడు, ఉన్నతజీవితం అందాలని ఆశపడతాడు. అందుకోసం తను నిలువెల్లా కరిగిపోయినా బాధపడడు. ఒకతండ్రి తను చదవలేకపోయి మధ్యలో ఆపేసిన చదువుని తన బిడ్డలకి అందించాలని తన కోరికలన్నీ చంపుకుని ఒక యోగిలా బతికాడు. వారు ఒక ఒడ్డుకి చేరుకున్నాక తను వెనక్కి తిరిగి చూసుకుంటే వారికోసం తిన్న ఢక్కామొక్కీలే తప్ప తమకంటూ ఏమీ మిగలదు. అయినా ఆయన బాధపడడు. పైపెచ్చు ఏమీ అనుభవించకపోయినా అన్నీ తానే అనుభవించినట్టు గర్వంగా చెప్పుకుంటాడు, అన్నీ అందరికీ ఇచ్చేసి పులిచర్మం కట్టుకుని మిగిలిపోయిన పరమశివుడిలా....

అందుకే పితృదేవోభవ!

ఇక గురువు, గురువు గురించి చెప్పేటంత పెద్దవాడినికాదు కానీ, ఈ పరంపరలో కనపడకుండా పోయిన మరో గొప్పవ్యక్తి గురించి కూడా చెప్పాలి. పరంపరలో కూడా చేర్చవలసిన విషయం(అని నా అబిప్రాయం). అదే

భ్రాతృ దేవోభవ!

                 తల్లీ,తండ్రీ, గురువు, దైవం వీరికిచ్చిన గొప్పదనం నిర్ద్వంద్వంగా అంగీకరించవలసిందే, కానీ సోదరుడు కూడా అంత గొప్పవాడే అని నా అభిప్రాయం. తల్లి తర్వాత తల్లిలా, తండ్రి తర్వాత తండ్రిలా నీడలా ఉండి కాపాడేవాడు అతను. మారుమూల పల్లెటూళ్ళో తల్లితో పాటు అవమానాలను దిగమింగుతూ కూడా తన తోబుట్టువులను కంటికి రెప్పలా చూసుకున్నాడు నా అన్నయ్య. యశోదమ్మ అంటుంది భాగవతంలో, ఏ సిద్ధాశ్రములం తొక్కితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో నేటికి మన భాగ్యశేషంచేత బిడ్డ దక్కాడు కదా అని. ఎంతో భాగ్యశేషం ఉంటే తప్ప గొప్ప అన్నకూడా దొరకడు. అమ్మ పొలంపనులకి వెల్తే పసిగుడ్డుని భుజాన వేసుకుని తిరిగాడు, స్కూలుకి రానీయకపోతే స్కూలుని వదిలేశాడు కానీ నన్ను వదలలేదు. నేను విసర్జించిన అవశేషాలని పెద్దవాడైయ్యుండి కూడా కడిగాడు. నాకోసం ఎంతోమందిని ఎదిరించాడు. ఇద్దరి చదువుకి ఆర్ధికస్థోమత సరిపోదని తన చదువుని కూడా వదిలాడు, తద్వారా తను పొందవలసిన ఉన్నత జీవితాన్ని నాకు భిక్షగా వేసాడు నా అన్న. ఈ రోజున ఒక ఇంజినీర్ గా సమాజంలో నాకు గుర్తింపు ఉందంటే అది నా అన్నయ్య నాకు పెట్టిన భిక్ష. ఒక పిల్లి తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు, కోడి తనపిల్లల్ని భద్రంగా రెక్కలకింద దాచుకున్నట్టు, సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నావని అన్నా భరించి నాకు నీడై నిలబడ్డాడు. నాలో చదవడం అనే ఒక ఆసక్తికి బీజం వేసినవాడు ఆయన.



నాకు తెలిసిన ఇంకో అన్న, తల్లితండ్రులు పోయిన తర్వాత తమ్ముడిని ఉన్నత చదువులు చదివించాలని కోరుకున్నాడు, అన్నీ కుదిరినప్పుడు అలా అనుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ తనకే పూటగడవడానికి ఇబ్బందిగా ఉండి, తను చూసుకోవలసిన కుటుంబం ఉండి కూడా తమ్ముడిని ఏ కూలి పనులకో పంపకుండా దైర్యం చెప్పి చదివించాడు, అనారోగ్యకారణాలచేత పరీక్ష తప్పితే ధైర్యం చెప్పి, చదువుకోవడానికి పంపాడు. స్ఫూర్తిగా నిలిచాడు. ఈరోజున అతను ఒక గొప్ప స్థాయికి చేరిన తర్వాత అతని నుండి ఏమీ ఆశించకుండా అదే మారుమూల పల్లెటూళ్ళో ఉండిపోయాడు.

అందుకే పితృపంచకంలో అన్నని కూడా చేర్చింది సనాతన ధర్మం. అందుకే మరొక్కసారి



భ్రాతృదేవోభవ..........