Thursday, February 3, 2011

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు



ముందు ఇది చదవండి
http://durgeswara.blogspot.com/2011/02/blog-post_02.html
తర్వాత...
న్యాయ మార్గంలో నడిచే వాళ్ళందరికీ శుభం కలగాలి అని చెప్పే శ్లోకం అర్ధాన్ని ఇలా విరిచి కూడా చెప్పొచ్చని ఇవ్వాలే తెలిసింది. నవ్వాలో ఏడవాలో కూడా తెలియడంలేదు. దాని తర్వాత పదం "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" దీనర్దం ఏమిటో వారికే తెలియాలి. కేవలం ఆవులను,బ్రాహ్మణులను మాత్రమే పట్టించుకునే వారైతే ఈ లోకం మాత్రమే కాకుండా సమస్త లోకాల శుభాలను కూడా కోరుకోవాల్సిన అవసరం ఏముంది. అదే కాదు, నేను చేసే ఈ కార్యం వల్ల వానలు పడాలనీ , పృధ్వీ తలమంతా సస్యశ్యామలంగా ఉండాలని,దేశం క్షోభరహితంగా ఉండాలనీ చెప్పినది కనపడదేమో. బ్రాహ్మణులు నిర్భయంగా ఉండాలని చెప్పడం, లోకానికి హితవు చెప్పేవారు స్వతంత్రంగా ఉండవలసిన అవసరం గురించి చెప్పడం కాదా? ఈనాడు మన కోర్టులకున్న స్వయం ప్రతిపత్తి అనాడు వారికుండవలసిన అవసరం గురించి చెప్పడమే అది. ఎందుకంటే లోకానికి వారు రుగ్మతలనుండి కాపాడే వైద్యులు,మంత్రాంగాన్ని నడిపించే ప్రధానులు,మెరుగైన తరాన్ని తయారుచేసే ఉపాధ్యాయులు. అలాంటి వారు ఎవరో ఒకరి ప్రాబల్యానికి లొంగిపోతే ఆ సమాజం పాడైపోతుంది, అందుకే వారు నిర్భయంగా ఉండాలని చెప్పడం. ఇక శుభం ఆవులకూ, బ్రాహ్మణులకూ మాత్రమేనా అని అడిగితే నాకు ఒక శ్లోకం గుర్తు వస్తోంది.
రోజూ ఆదిత్య హృదయం చివరలో పారాయణసమాపన క్రియలో పటించే శ్లోకం.
"అపుత్రాః సంతు పుత్రిణః, పుత్రిణః సంతు పౌత్రిణః!
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాం శతం.!!"
ఇక దీని అర్ధం చెప్పవలసిన ఆవసరం కూడా లేదు.
నా ఇంట్లో నేను పూజ చేసుకుని లోకంలో పిల్లలు లేని వాల్లందరికీ పిల్లలు కలగాలి, పిల్లలున్న వాళ్ళకి మనవళ్ళు,మనవరాళ్ళు కలగాలి, అందరూ నిండు నూరేళ్ళూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకోవడానికి నాకేమవసరం, కానీ అలాగే ప్రార్ధిస్తాం, ఎందుకంటే నా ధర్మం అందరి గురించి ఆలోచించమని చెప్పింది, సైన్స్ లో chaos theory అనేది ఒకటుంది. ప్రకృతి లో జరిగే ప్రతి చిన్న మార్పు, మరొక మార్పుకి కారణభూతం అవుతుంది అని. రీసెంట్ గా జరిపిన పరిశోధనలలో ఆలోచనకి కూడా శక్తి ఉంటుంది అని ఋజువు చెయ్యడం జరిగింది. (రెండు చెట్లు మొలకెత్తే దశలో ఉన్నప్పుడు ఒక చెట్టుని మంచి మాటలతో, మరొక చెట్టుని తిట్లతో పెంచినప్పుడు రెండు చెట్లు రెండు రకాలుగా పెరిగాయు. )మరి అలాంటిది మనం రోజూ అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటే అది ప్రకృతిని అలా శాసించదా? అలా జరిగేలా ప్రకృతిని నిభంధించదా? అదే సనాతనధర్మం లో గొప్పదనం. తోటివారి పతనాన్నో,లేక వారి బలహీనతల మీదనో జీవితాన్ని నిర్మించుకోవడాన్ని ఈ ధర్మం ఎన్నటికీ ఒప్పుకోదు, ఈ ధర్మాచరణలో మనకు అడుగడుగడుగునా మార్గదర్శకంగా నిలిచే బ్రాహ్మణులని స్వయం ప్రతిపత్తితో, నిర్భయంగా ఉండాలని కోరుకోవడం మన కర్తవ్యం కాదా? మనం ఒక పూజ ఇంట్లో చేస్తే మనకు తెలిసిన వారు, మన క్షేమం కోరేవారు బాగుండాలని కోరుకుంటాము, అలాంటిది లోకం క్షేమం కోరే బ్రాహ్మణుడు, లోక క్షేమం కోసం పాలిచ్చే ఆవులు బాగుండాలని కోరుకోవడం కుల పక్షపాతమో, ఇంకోటో ఎలా అవుతుందో నాకు అర్ధం కావడంలేదు. వాళ్ళు బాగుంటే లోకం బాగుంటుంది అని పెద్దల ఉద్దేశ్యం. అర్ధం చేసుకునే దృష్టికోణం బట్టి ఉంటుంది. మన దృష్టికోణం ఆ వైపుకి పోకుండా ఉండేందుకు మీడియా,కలిశక్తులూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఎదురీదాల్సిన అవసరం మనదే. మంచిమనసుతో చూసినప్పుడు అన్నీ మంచిగానే కనపడతాయి.