Friday, December 17, 2010

ఆవును చూడరా,బొల్లావును చూడరా!


కాటమరాజుని కరుణించినాతల్లి!
కష్టాలు కడతేర్చు ఓ కల్పవల్లీ!!

అన్న అయితమరాజుని ఆదుకొనియెడి తల్లి!
అపురూపగని వమ్మ ఆనందవల్లీ!!

సాగిలపడి నీకు దండాలు పెట్టేము!
బొల్లావువై నీవుండ మాకేటి బెంగ!!

హారతూలిచ్చేము,పూజలూ చేసేము!
దయతోడ మమ్ములను చూడమ్మ చల్లంగ!!

చెనికల వారిల్ల వెలసియున్నావమ్మ!
చేటురాకుండాను కాపాడవమ్మ!!

మాతల్లితండ్రులను గాచితివి కరుణతోడ!
నీ బిడ్డలమమ్మ చూడమ్మ దయతోడ!!

నిన్ను కొలిచేటికి చేరినామమ్మ!
తప్పులెంచక మమ్ము కరుణించవమ్మ!!

నీ పూజలు చేసేము,నియతి తప్పకుండానూ
నీ సేవలూ చేసేము, నియమమ్ముగానూ
నీ పాదాలు పట్టేము, నమ్మకముగానూ
నిన్ను కొలుచుకు బతికేము, నీవే మా దిక్కంటూ......

యాదవుల వంశ చరిత్రలో బొల్లావుది ఒక విశిష్ట స్థానం. ఆ ఆవు పాలతో తయారు చేసిన పదార్ధం ఎప్పటికీ చెడిపోదు.
ఆ ఆవు పరాక్రమం ముందు ఎంతటి వారైనా నిలవలేరు, కాబట్టే

ద్వాపరమందు కృష్ణునిగ దానవవైరి జనించి తెల్పె పెన్
పాపము పెచ్చుమీరి క్షితిభారము మిక్కుటమైన ధర్మ సం
స్థాపన చేయగా తరచు తానె జనింతునటంచు ,కాన మా
గోపకులాన నొక గోవుయై పుట్టె లోకులు బొల్లియావనన్!

అంటూ కాటమరాజు కీర్తించాడు.
ఇప్పటికీ ఎప్పుడు కొలుపులు చేసినా బొల్లావులను తీసుకెళ్ళి స్నానం చేయించి పూజలు చేయించి మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు.
శివకాళ్ళందరూ బొల్లావు మూర్తులని, వృషభమూర్తులని తీసుకుని ఆనంద పరవశంతో నృత్యం చేస్తుంటే సాక్షాత్తూ విష్ణుమూర్తి ముందు పరమశివుడు తాండవం చేస్తున్నట్టుంటుంది.

అలా ఒకనాడు బస్సులో కూర్చుని, ఆరుద్ర గారు రాసిన కాటమరాజు కధ నాటకం నెమరువేసుకుంటుండగా మనసులో మెదలిన పాట ఇది. అప్పుడో చరణం, అప్పుడో చరణం కూడుకుంటూ ఇలా రాసాను. మొన్న కొలుపుల్లో పాడదామనుకున్నాను, కానీ నేను రాసుకున్నట్టు కానీ,రాయగలననీ కానీ మా నాన్నగారికి, మా అన్నయ్యకి తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ రాలేదు. అంచేత నేనే మనసా ఆ బొల్లావు మూర్తి దగ్గర కూర్చుని పాడుకున్నాను. ఇంకెవరైనా కాటమరాజు మీద, బొల్లావు మీద ఆసక్తి కలవారు ఉంటారేమో ,వారికి నచ్చుతుందేమో అని ఇక్కడ ప్రచురిస్తున్నాను.