Monday, September 5, 2016

ఎప్పటినుండో పరిచయం చేద్దాం అనుకుంటున్న సైట్. - http://www.sairealattitudemanagement.org

జై శ్రీ రాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

ఎప్పటినుండో ఈ సైట్ గురించి (http://www.sairealattitudemanagement.org/)  నా బ్లాగులో రాద్దాం అనుకున్నాను. మొదట్లో archive.org లొ తెలుగు పుస్తకాలు చూసాను. ఆ తర్వాత వీలు దొరికినప్పుడల్లా పుస్తకాలు డౌన్‌లోడ్ చేసేవాడిని. అన్నీ చేసెయ్యాలన్నత ఆత్రం ఉండేది. కానీ కుదరాలి కదా. తర్వాత dli సైట్ చూసాను. అందులో ఒక్కొక్క పేజి డౌన్‌లోడ్ చెయ్యాలి. అది ఇంకా దారుణం.  అందుకని సొంతంగా ఒక టూల్ తయారు చేశాను. బుక్ లింక్ ఇస్తే అన్ని పేజీలు ఒక ఫోల్డర్ కి కాపీ చేసేలా. తర్వాత కొంచెం చాలా లింక్స్  డౌన్‌లోడ్ చేసేలా చేసాను. ఆ తర్వాత DLI Downloader దొరకడంతో అది పక్కన పెట్టాను. ఈ సైట్ (http://www.sairealattitudemanagement.org/)   పుణ్యమా అని ఇలాంటి పుస్తకాలన్నీ ఒకే చోట దొరికే అవకాశం దొరికింది. పైగా మనకి కావలసిన field తో ఫిల్టర్ చెయ్యచ్చు కూడా. భాగవతం పన్నెండు స్కంధాల టీకా దొరికింది. రామాయణం పై, భాగవతం పై చాలా పుస్తకాలు దొరికాయి.

Tuesday, August 2, 2016

జర్మనీ రాముడు

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!


నాన్నా? మరి జర్మనీ వాళ్ళకి దేవుడు ఎవరు? ఉన్నట్టుండి అడిగింది మా అమ్మాయి. దేవుడు, చేపలాగా, తాబేలులాగా, పందిలాగా ఎందుకు వస్తాడు నాన్నా? అన్న ప్రశ్నకి కొనసాగింపు మొదటి ప్రశ్న
మనము రాముడికి, సీతమ్మకి, కృష్ణుడికి, ఆంజనేయస్వామికి దణ్ణం పెట్టుకున్నట్టే వాళ్ళు యేసు క్రీస్తుకి పూజ చేస్తారమ్మా అని చెప్పాను.
ఎందుకని, వాళ్ళకి రాముడు తెలియదా?
- తెలియదమ్మా, వాళ్ళు యేసుని దేవుడిలాగా పూజ చేస్తారు.

మరి సీతమ్మ?
-తెలియదమ్మా

మరి ఆంజనెయస్వామి?
ఆయన కూడా తెలియదమ్మా!

మరి రామంసుడు?
- ఎవరూ?

రామంసుడు నాన్నా!
- రాక్షసులేమోనండీ!
-రాక్షసులా?

కాదు నాన్నా! సీతమ్మని ఎత్తుకుపోయి,
-రావణాసురుడా?

ఆ అవును.
-ఆయన కూడా తెలియదమ్మా!

ఎందుకని?
- ఎందుకంటే, ఇప్పుడు, విజయవాడలో, బెంగళూరులో దొరికేవి ఇక్కడవాళ్ళకి తెలియవుకదా, జిలేబి, జాంగ్రి ఇలాంటివి! (తటాలున ఏం చెప్పాలో తెలియక, జిలెబి చెప్పానన్నమాట).  

ఇక్కడ దొరకవుగానీ, పారిస్ లో దొరుకుతాయి.
-?????

మనం పారిస్ వెళ్ళినప్పుదు జిలేబి కొనుక్కున్నాం కదా,
-అవును జిలేబి తినడానికేగా పారిస్ వెళ్ళింది, అలాగ, ఇక్కడ దొరికేవి ఇక్కడి వాళ్ళకి తెలుస్తాయి. చైనా వాళ్ళు బుద్ధుడికి పూజ చేస్తారు, ముస్లిములు అల్లాకి పూజ చేస్తారు, మనం రాముడు, సీతమ్మ, ఇలా పూజలు చేస్తాం, అలాగే వీళ్ళు యేసు క్రీస్తుకి పూజ చేస్తారు.

సరే గానీ అసలు దేవుడు ఎందుకు చేపలాగా , తాబేలు లాగా, పందిలాగా రావాలి?
-మనుషులు నీళ్ళలో ఎంతసేపు ఉండగలరు?

కొంచేపే
-మరి చేపలు?

అవి ఉండేది నీళ్ళలోనే కదా!
-అందుకే నీళ్ళొచ్చి భూమి అంతా మునిగిపోయేటప్పుడు, చేపలాగా వచ్చి కాపాడాడు.
-తాబేలు కి డిప్ప గట్టిగా ఉంటుంది కదా, అందుకే తాబేలులాగా వచ్చి కొండని మోసాడు.
-పంది నేలని తవ్వుకుంటూ కిందకి వెళ్ళగలదు కదా, అందుకే అలా వచ్చి భూమిని కోరలమీద పైకి లేపాడు.
-మనం ఎవరికైనా సాయం చెయ్యగలిగే పరిస్థితిలో ఉంటే తప్పకుండా సాయం చెయ్యాలి.
-మనకి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళు దేవుడితో సమానమే

రేపు ఏ కధ చెప్తావో ఇప్పుడే చెప్పి పడుకో, రేపు గుర్తు చేస్తా!
- రేపు స్వామి సింహం లాగా వచ్చిన కధ చెప్తా పడుకో.

సింహం అంటే నాకు భయం.
- ఏం కాదులే

సరే
గుడ్నైట్,
-గుడ్నైట్
జై శ్రీరాం,
-జై శ్రీరాం.

Wednesday, March 9, 2016

భారతం- భారతానికి వెలుపల!!!

jai శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
నేను జర్మనీకి వచ్చి ఒక సంవత్సరం దాటింది. ఇప్పటిదాకా నేను కలిసిన భారతీయులందిరిలో ఇక్కడ లైఫ్ బాగుంది కానీ ఏదో ఒక మూల మళ్ళీ వెనక్కి వెళితే బాగుంటుంది అన్న భావనని మాత్రమే చూసాను. ఎవరైనా భారతీయుడు కనిపిస్తే ఆప్యాయంగా మాట్లాడటం, చెయ్యగలిగినంత సహాయం చేసే వాళ్ళనే చూసాను. ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళినప్పుడు అక్కడి కాన్సులేట్ జనరల్ ముందు ఎగిరే మువ్వన్నెల జెండాని చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. ఎంతో మంది మేధావులు, తెలివితేటలు ఉండి కూడా మన దేశాన్ని మామూలు మనుషులు ప్రశాంతంగా బతికేలా చెయ్యలేకపోతున్నారే/మే అని బాధగా కూడా ఉండేది.

ఐతే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే, మరోవైపు బారతదేశం ఇచ్చిన డిగ్రీతో ఇక్కడ ఉన్నత చదువులు చదవడానికి వచ్చి, అవకాశం వచ్చో, అదృష్టం వల్లనో, తెలివితేటలవల్లనో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చి ఇక్కడే స్థిర పడిపోయి, దేశాన్ని "Shitty India" అని అనగలిగే మనుషులుంటారని, ఉన్నారని నిన్ననే తెలిసింది. ఇండియాలో బతకడానికి ఏమీ లేదు, Shitty politics, Shitty Traffic అని అంటుంటే, అది వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే I hate india అనేంతగా. లాగి ఒకటి పీకుదాం అనిపించింది. పైగా ఉచిత సలహా ఒకటి, ఇండియాకి వెళ్ళి ఏం చేస్తావ్? బ్లూ కార్డ్ తెచ్చుకుని పేరెంట్స్ ని, కజిన్స్ ని కూడా తెచ్చెసుకో, వాళ్ళు ఇక్కడే జాబ్ వెతుక్కోవచ్చు అని.  

ఏమి చేతకాకపోతే విజయవాడకి పోయి ఎలిమెంటరీ స్కూల్ కి పోయి పాఠాలు చెప్పుకుంటాను. కనీసం అలాగైనా నీలాంటి వాళ్ళు తయారు కాకుండా చూడగలను అని చెప్దాం అనిపించింది. కానీ చెప్పలేదు. వచ్చేసాను. చెప్పకుండా వచ్చెయ్యడం చెప్పలేక కాదు, చెప్పి కూడా ఉపయోగం లేదని.

నావరకు నా దేశం ఇప్పటికీ, ఎప్పటికీ రత్నగర్భే.