Thursday, February 5, 2009

దశ రూపకం -౭ వ భాగం


మందపిల్లి.
౦౧ -౧౨ -౩౮.

రసరాట్టుగారూ!
మీ పేర వ్రాయడం ఏ ముహూర్తాన్ని ప్రారంభించానో గాని సంగతి తెమిలేటట్టు కనపడదు. మరో చిక్కొచ్చింది. పొద్దున్న ఒకాయన నే ఉండగానే మా ఇంటికొచ్చారు. ఆయన పేరు ఘంటారవుట. ఆయనట తన రచన మా నాన్నగారికిచ్చింది. మీకు నేను పంపిన రచన తనదేనని ఆయన పట్టు పడుతున్నాడు. వెనక మీ ఎన్నికల్లో మీ తరఫున పని చేసింది ఈయనేట.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౨ -౧౨ -౩౮
అబ్బాయి, గోపీనాధం! అల్లా చెప్పు మరీ! అందుకనే తీవ్రంగా చూసిన మీదట ఈ రచన కడుంగడు ప్రౌఢంగా ఉంది. కొన్ని స్ఖాలిత్యాలున్నాయి. ఉంటే ఏం అన్నాను! కొన్ని స్ఖాలిత్యాలు ఉండాలి అని కూడా నేను వాదిస్తాను. లేకపోతే రచన మానుషమే అనిపించుకోదు.ఇది యధార్ధభావాలతోనూ, ఉన్నతాదర్శాలతోనూ నిండి ఉంది. రసం ఇందులో కేవలం ఆవకాయి ఊటలాగ ఊరిపోవడమే కాకుండా సముద్రపు పోటులాగ ఉబ్బి మీద పడిపోతోంది.భాష అతిమధురం.శైలి మనోహరం,వట్టివేళ్ల యొక్క చల్లదనం, వనసంతర్పణపోపుయొక్క ఘుమఘుమా, చలిమిడి యొక్క పాకం ఏకకాలంలో ఇక్కడ దొరుకుతాయి.వేయేల? ఈ రచనలోని మాటలు అన్న జిహ్వే జిహ్వ, విన్నచెవే చెవి,తస్కరించిన కవే కవి.
ఇట్లు,
రసరాట్.

No comments: