Friday, September 12, 2014

అల బెంగళూరు నగరంలో, వైట్‌ఫీల్డ్ లో, ఆ మూల సాఫ్ట్‌వేర్ ఆఫీసులో

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

అల బెంగళూరు నగరంలో, వైట్‌ఫీల్డ్ లో, ఆ మూల సాఫ్ట్‌వేర్ ఆఫీసులో
కాంక్రీటు వనాంతర మత్స్య సరః ప్రాంత అష్ట వర్ష రివాల్వింగ్ చైరాసీన (అనగా ఎనిమిదేళ్ళనుండీ అదే కుర్చీలో ఉన్నాడు అని అర్ధం)  
కంప్యూటర్ వినోది యగు ఆ ఆపన్న ఇంజినీరు విహ్వల ఫ్రెషర్
పాహీ పాహీ యన కుయ్యాలించి సంరంభుడై

మేనేజర్ కున్ జెప్పడు, ఐడికార్డును, ఫోనును చేదోయి సంధింపడే
టీమును రా రమ్మని జీరడు, లిఫ్టును జేరడు, హస్తభూషణమౌ
మూషికమును మన్నింపడు, వివాదప్రోద్ధిత  శ్రీ మేనేజరు
లాప్‌టాపునైన వీడడు ఫ్రెషరు సందేహ నివృత్త్యోత్సాహియై   

ఇట్లు క్లైంటు జన పాలిత పరాయణుండును, నిఖిలి క్లైంటుజన హృదయారవింద సదన సంస్థితుడగు ఆ ఇంజినీరు
ఫ్రెషరు విజ్ఞాపిత నానావిధ దీనాలాపములాకర్ణించి, లాప్‌టాపు వినోదంబులం దనివి సాలించి, సంభ్రమించి, దిశలు నిరీక్షించి, ఫ్రెషరు రక్షాపరత్వంబు నంగీకరించి, లిఫ్టులోనకుద్గమించి, వేంచేయునపుడు....

తనవెంటన్ మేనేజరు, నాతని వెంట టీములీడు, దానివెంకను
హెచార్ మేనేజరు, వాని పొంతను సమస్త
పాలసీ నికాయంబును, అడ్మిన్లున్ను, హౌస్ కీపింగున్నూ రావొచ్చి
రయ్యన సాఫ్ట్‌వేరాఫీసు గలుగు వారాబాలగోపాలమున్  

కరుణాసింధువౌ ఆ ఇంజినీరు నూతనోద్యోగ జనిత అజ్ఞానమును ఖండింపగ బంపె
సత్వరితా కంపిత సాఫ్ట్‌వేర్ చక్రము, మహోద్యద్విస్ఫులింగ చ్చటా
ఆగ్రహోద్గద స్వరమునన్, బహువిధ ప్రాజెక్టుల నిర్వక్ర విచ్చిన్నకరంబగు,
పాలిత అఖిల సాఫ్ట్‌వేరు లోకమున్ తన అష్టవర్షానుభవమున్

ఇట్లు తన అనుభవమ్ముచేత ఫ్రెషర్ కున్న అపోహలు దూరము జేయుచు,
        ఇది కామధేనువు గాదు, సర్వము తనలోనిమిడ్చు కాలబిలము అనిన్నూ,          
       ఇందు సత్కార చీత్కారములు నీ ప్రతిభపై గాక వారి అవసరమ్ముపై  ఆధారపడియుండుననిన్నీ
       బాగుగా కార్యనిర్వహణ చేసిన పదోన్నతులు, ఆన్‌సైటులు  వచ్చునని భ్రమింప వద్దనీ  చెప్పుచుండ

మేనేజరొకడు మీటింగురూముకు జొచ్చెను
మేనేజరు మరియొకడు క్లైంటు పిలిచెనని జారెన్
మేనేజర్ల రూమున దిరిగెడు
మేనేజర్లందరు సియివో మరువున కరిగెన్

సరదాకి రాసిందే తప్ప పోతన వంటి వారిని అవమానించే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు.


మనోహర్ చెనికల

Monday, September 1, 2014

బాపు

వారిమీద కధలు రాయడానికి రచయితని కాను, కనీసం నాలుగు ముక్కలు రాయడానికైనా నేను నేర్చుకున్న నాలుగు తెలుగు ముక్కలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నవే. ఏమని రాయగలం ఆ మాటల మాంత్రికుల గురించి. వాళ్ళ స్నేహం గురించి, వాళ్ళ రామభక్తి గురించి?
రమణగారు వెళ్ళిపోయినప్పుడే భయమేసింది, ఎక్కడ స్నేహితుడికోసం ఈయనా వెళ్ళిపోతారో అని. ఈ రోజు వెళ్ళిపోయారు. ఆ రామయ్య పిలిపించేసుకున్నాడు.  వారి ఆత్మశాంతి కై ఆ రాముడిని ప్రార్ధిస్తూ

Monday, July 7, 2014

రామ నామమె చాలు, రామ చింతనే మేలు.

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

ఇది ఆరవ సారి హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం. ప్రతీసారీ స్వామి చిత్రాతిచిత్రంగా దర్శనమిస్తూనే ఉన్నారు. ఓ మారు శింశుపా వృక్షశాఖల మాటున దాక్కుని చూస్తున్నట్టు, ఓమారు సుందరకాండ లో చెప్పినట్టు పూలతో నిండిన కొండా అన్నట్టు, ఓ మారు కొంచెం కోపంగా, ఓ మారు ప్రసన్నంగా ఇలా రకరకాలుగా కనిపించారు. ఈ సారి నా భార్యా బిడ్డలతో వచ్చేలా అనుగ్రహించారు. చిట్టి చిట్టి చేతులతో నాకూతురు స్వామికి పూర్ణాహుతి కలశాలు తీసుకుని అభిషేకం చేసింది. మూడు రోజులు సామి సామి అని స్వామి చుట్టూనే తిరిగింది. ఏ పని చెప్తే ఆ పని చేసింది. శివపార్వతుల కళ్యాణ విగ్రహాలను శుభ్రం చేస్తుంటే, నాన్నా స్నానం చేయించద్దు, సబ్బు రుద్దితే అమ్మకి కళ్ళు మంట పుడతాయి అని నాతో పాటే కూర్చుంది. పూర్ణాహుతి తర్వాత కలశాలు పైన పేరుస్తుంటే ఒక్కొక్కటి అందించింది. ప్రసాదాలు పాకింగ్ చేస్తుంటే ఒక్కొక్క పాకెట్ తీసి ఖర్జూరం పెట్టి ఇచ్చింది. ఇలా ఈ సారి చాలా ప్రత్యేకంగా జరిగింది.

ఇక ఈసారి జరిగిన సంకీర్తన అన్నింటికంటే ప్రత్యేకం. త్రినాధ శర్మ గారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుతూ ఉంటే ఏదో తెలియని ఉద్విగ్నత,
ఆ ప్రహ్లాదుడు,
ఆయన పడ్డ బాధలు,
ఆయనకోసం నానా జంగమ స్థావరాలలో నరసింహస్వరూపంతో నిండి పోయిన స్వామి.

వెతికితే ఎక్కడైనా కనిపిస్తాడని చెప్పిన ఐదేళ్ళ పిల్లవాడి నమ్మకం, 
చెటిల్లు చెటిల్లు, ఫెటిళ్ళు ఫెటిళ్ళు మని శబ్దాలతో స్థంబంలోనుంది వెలవడిన స్వామి,
ఇలా మనసంతా ఆయనే నిండిపోయినట్టనిపించింది. దానికితోడు, నాకు కులదైవం కూడా కావడం, ప్రతీ సంవత్సరం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం వల్లనేమో ఆ నిమిషం అలా ఆగిపోతే బాగుండనిపించింది.
మొదటి సారి ఆ స్తోత్రం అలాగే యుగాలు పాడగలంత పెద్దదై ఉంటే బాగుండనిపించింది.

ఇక చివరి ఘట్టం, ఇరవైనాలుగు కోట్ల రామనామాన్ని భద్రాచలం చేర్చి, ఇదిగోనయ్యా నీ భక్తుల చేత నువ్వు రాయించుకున్న రామనామం అని ఆయనకి లెక్క చెప్పడం.
వెళ్ళలేకపోయాను కానీ మనసంతా అక్కడే ఉంది. ఇప్పుడు గోశాలకి వెళ్ళుంటారు, ఆవులకి కడుపునిండా భోజనం పెట్టుంటారు, ఇక సంకీర్తనతో స్వామి వారి దగ్గరికి వెళ్ళుంటారు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ రెండు రోజులు.

ఇందాకే మాస్టరు గారు ఫోన్ చేసారు. మనోహరూ, కార్యక్రమం అద్భుతంగా జరిగింది, నువ్వుకూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అన్నారు. కార్యక్రమం మొత్తం ఇలా జరిగింది అని చెప్పారు.

ఎంతో సంతోషంగా ఉంది.

అందుకేనేమో పెద్దలు నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పారు,
పలకండీ, పలకండీ, రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము అని.....


జై శ్రీరాం.










Wednesday, July 2, 2014

రండీ పుణ్యాత్ములారా ! శ్రీరంగని భజనకు !రాండీ ధర్మాత్ములారా! రండీ! మనమందరము,.కోదండరాముల భజనచేద్దాము

భగవద్భక్తులందరకూ ! నమస్కారములు

ఈనెల ఐదవతారీఖు[శనివారం} భద్రాచలంలో శ్రీరాములవారికి భక్తులందరి తరపున రామకోటినామలేఖనప్రతులను సమర్పించు కార్యక్రమము రామదండు నిర్వహించు చున్నది. శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం [రవ్వవరం] లో ఈసంవత్సరం జరిగిన హనుమత్ రక్షాయాగ మునకు అనుసంధానంగా ఇరవై నాలుగు కోట్ల రామనామములను సామూహికంగా లిఖింపజేయు
కార్యక్రమం చేపట్టడం జరిగినది. స్వామి అనుగ్రహము వలన కార్యక్రమము చక్కగా సాగినది. లిఖిమ్చిన ప్రతులను పీఠమునకు చేరుస్తున్నారు రామభక్తులు. ఈప్రతులను తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించటం జరుగుతున్నది. శనివారంఉదయం నుండి రాత్రివరకు భద్రాచలం లో ఈకార్యక్రమం జరుగుతున్నది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొను భక్తులకొరకై అంబాసత్రంలో వసతి,భోజన సౌకర్యములను ఏర్పాటుచేయటం జరిగినది .

కార్యక్రమ వివరాలు

ఉదయం
నదీస్నానం
గోపూజ ః [గోవులకు ఆనందం కలిగించే గోవిందనామసంకీర్తనతో గోవులకు గ్రాసం,ఫలములనుతినిపించి,హారతి నివ్వటం.]

గణపతి పూజతో మొదలై స్వామివారికి అమ్మవారికి షోడశోపచార పూజ [అంబా సత్రంలో]
తదనంతరం సంకీర్తన [ధ్యానమందిరంలో]
మధ్యాహ్నం అన్నప్రసాదస్వీకరణ [అంబా సత్రంలో]
కొద్ది విశ్రాంతి అనంతరం అంబా సత్రంలో సంకీర్తన
సాయంకాలం
భద్రాగిరిప్రదక్షిణ, రామనామప్రతుల సమర్పణ. రాత్రి తొమ్మిదిన్నరవరకు భద్రగిరీశుని సన్నిధిలో సంకీర్తన.

ఈకార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు శనివారం ఉదయానికల్లా భద్రాచలం చేరుకోవాలి
గురువారం నాటికి వారెంతమంది వస్తున్నారో ఫోన్ ద్వారా తెలుపవలసిఉంది

కలౌ నామస్మరణ అన్నారు పెద్దలు. మనపాపాలను,తాపాలను బాపుకొనుటకై ఈసంకీర్తనలో పాల్గొందాం , సీతాలక్ష్మణ,భరతశత్రుఘ్న,హనుమత్సమేత శ్రీరామచంద్రప్రభువుల కృపను వేడుకుందాం . జైశ్రీరాం

durgeswara@gmail.com
9948235641

Monday, June 23, 2014

భద్రాచలం లో జరిగే సంకీర్తనాయజ్ఞం శ్రీరామనామ లేఖన ప్రతులసమర్పణా కార్యం లో పాల్గొనరండి

భగవద్భక్తులందరకూ !
హనుమత్స్మరణపూర్వక నమస్కారములు.

హనుమత్ రక్షాయాగం ఆరవ ఆవృతి మే ఇరవైనాలగవతేదీ నిర్విఘ్నంగా చక్కగా జరిగినది. స్వామి అనుగ్రహప్రభావం అనుభవంలోకి వచ్చినది అందరకూ. ఇందులో ఇంకొక ఘట్టం మిగిలి యున్నది. ఇరవైనాలుగుకోట్ల శ్రీరామనామమును సామూహికంగా లిఖించుటకు పుస్తకములు ముద్రించి పంపిణీ చేసి ఉన్నాము. ఆయాగ్రామాలనుండి భక్తులు శ్రీరామనామమును లిఖించి సిద్దముగా ఉంచారు. రామనామములను శిరసుపై నిడుకుని భక్తులంతా భద్రాచలేశుని సన్నిధికివెళ్ళి స్వామికి సమర్పించవలసి ఉంది.

జూలై 5,6 తేదీలలో [శని,ఆది వారములు] భద్రాచలంలో సంకీర్తనాయజ్ఞము నిర్వహించుటకు ముహూర్తం నిర్ణయించుట జరిగినది. ఇందులో పాల్గొనువారంతా శనివారం ఉదయానికల్లా భద్రాచలం అంబసత్రమునకు చేరుకోవాలి . రాదలచుకున్నవాళ్ళు జూన్ ఇరవై ఐదవతేదీ నాటికి తమ పేర్లను తెలుపవలసినదిగా మనవి
అంబసత్రములో అందరికీ సామూహికంగా వసతి కల్పించబడుతుంది. అందరితో కలసి ఉండటం ఇబ్బంది అనుకున్నవారికి అక్కడ ధర్మసత్రములలో రూములు ఉంటాయి .వారి అనుకూలమునుబట్టి నిర్ణయించుకోవచ్చు. భగవన్నామసంకీర్తనలో పాల్గొనటం గొంతుకలపి స్వామి గుణగానాలను కీర్తించటంమనకు ప్రధానం .మిగతా సౌకర్యాలగూర్చి పట్టించుకోకండి . కావలసిన వసతి ఉన్నది అదిచాలు. శనిఆదివారాలుకనుక ఉద్యోగస్తులు,ముఖ్యంగా యువత, తరలిరావాలనికోరుతున్నాం . రామనామ రసపిపాసి హనుమత్ స్వామి కి ఇష్టపూర్వకంగా మనంఅందరం గొంతుకలపి
...రామనామ మాలా భజరే........శ్రీరామనామ మాలా .......... అంటూ పాడుకుంటూరామనామాన్ని గానం చేద్దాంతరలిరండి
. మీరు అక్కడ పాడదలచుకున్న కీర్తనను అందరితో భజనగా పలికించేలా
కొద్దిగా సాధనచేసుకుని వస్తే ఇంకా బాగుంటుంది. స్వామి గుణగానాలను ఎలుగెత్తి పాడాలని ఉన్న ప్రతిఒక్కరికి ఈసంకీర్తనాయజ్ఞంలో అవకాశం ఉంటుంది .

మీ పేర్లను తెలుపవలసిన అడ్రెస్

durgeswara@ gmail.com
9948235641

Monday, May 12, 2014

హనుమజ్జయంతి,హనుమద్రక్షాయాగంలో స్వామి అభిషేకమునకై మీతరపున ఒక అభిషేక కలశం సమర్పించండి


జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!


హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి అనంతరం నూటాఎనిమిది కలశజలములతో స్వామికి అవబృథస్నానం నిర్వహించబడుతుంది.

అందుకోసం నూటా ఎనిమిది కలశములను నూటాఎనిమిదిమంది భక్తుల తరపున సుగంధద్రవ్యములతో గంగాజలంతో నింపి గంగాది దివ్యనదులను ఆవాహనచేసి పూజించి ఋత్విక్కులు సిధ్ధపరచి ఉంచుతారు. పూర్ణాహుతి అనంతరం జాగంలో పాల్గొన్నవారు, ఎవరైతే యాగమునకు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా తమతరపున స్వామి అభిషేకమునకు కలశములఏర్పాటుచేయమని కోరుతారో వారి తరపున పురోహితులు అభిషేకం నిర్వహిస్తారు.

ఒక్కొక్క కుటుంబతరపున ఒక్కొక్క కల్శము ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో ప్రస్తుతం అన్నపూర్ణభిక్షాశాల నిర్మాణంలోనూ,ఈసంవత్స్రరం జరుగుతున్న హనుమత్ రక్షాయాగంలోనూ తమ పురుషార్ధములను సమర్పించినవారితరపున కలశస్థాపన జరుపగా మిగిలిన సంఖ్యలో కలశస్థాపనకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది. ఇందుకోసం ఒక్కో కలశస్థాపనకు 1116/- .పురుషార్థంగా సమర్పిమ్చవలసి ఉంటుంది. వారి తరపున హనుమజ్జయంతి రోజు అర్చన,పూర్ణాహుతి సమయంలో అభిషేకం నిర్వహించి స్వామి వారి రక్షలు ప్రసాదం పంపబడుతుంది. ఇతరదేశాలకు పంపుటకుమాత్రం కొరియర్ చార్జీలు వారేభరించవలసిఉంది.
ఇది కేవలం స్వామిసేవలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించి ఈ ద్రవ్యమున ఈయాగంలో అర్చనలకు,అన్నదానమునకు ఉపయోగించబడతాయి. ఇందులో భక్తిని వ్యాపారంగా మార్చే ఎటువంటి కలిప్రభావపు ఆలోచనలు లేవని తెలియపరుచుకుంటున్నాము.

తమతరపున కూడా కలశస్థాపన అర్చన జరిపించుకోదలచుకున్న వారు మెయిల్,లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తే వారికి ఎక్కౌంట్ నంబర్ తెలియపరుస్తాము.
జైశ్రీరాం


భక్తజనపాదదాసుడు
దుర్గేశ్వర
durgeswara@gmail.com
9948235641



Manohar Chenekala

Monday, May 5, 2014

హనుమత్ రక్షా యాగమునకు మీ గోత్రనామాలు పంపండి

http://durgeswara.blogspot.in/2014/05/blog-post.html

ఓం గం గణపతయే నమః

శ్రీ సీతాసమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః

ఓం హం హనుమతే నమః

ఆస్తికలోకమునకు శిరసా వందనము.

భగవద్బంధువులారా ! శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం గత ఆరుసంవత్సరములుగా హనుమత్ రక్షాయాగం అను పేరున భక్తజనావళికి ఆంజనేయస్వామి రక్షకలగాలని కోరుతూ యాగము నిర్వహించటం జరుగుతున్నది. ఇప్పటికి ఐదు ఆవృతులు పూర్తి చేసుకుని ఆరవ ఆవృతి గా భక్తజన సంరక్షణార్థం ఇరవైనాలుగు కోట్ల రామనామ లేఖన సహితంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శనివారం [,వైశాఖ బహుళదశమి ,శనివారం] యాగం పూర్ణాహుతి జరుపబడుతున్నది. ఇప్పటివరకూ జరిపిన ఐదు ఆవృతులలో నిష్ఠగా నియమానుసారంగా స్వామిని ఉపాసించినవారికి అనేక శుభములు ప్రాప్తించాయి. జీవితంలో సమస్యలు ,ఆర్ధిక ఇబ్బందులు ,సాంసారిక ఇక్కట్లు తొలగి సంతాన, .ఉద్యోగ, ఆరోగ్య, ఆథ్యాత్మిక లాభాలు ప్రాప్తింప జేసుకున్నవారు అనేకమంది స్వామి కృపకు ఉదాహరణలుగా కనపడుతున్నారు.


ముందుగా భక్తులు తమ గోత్రనామాలను మెయిల్ ద్వారా తెలియపరచాలి. గోత్రనామాలు పంపినవారందరి తరపున సంకల్పాదులు చెప్పి వారి తరపున కూడా ఆహుతులివ్వబడతాయి. ఇందుకోసం ఎవరూ ఏమీ చెల్లించవలసిన పనిలేదు.

ఈ యాగంలో పాల్గొనదలచుకున్నవారు [ప్రత్యక్షంగా లేక పరోక్షంగా] యాగం పూర్ణాహుతి దాకా సాధ్యమైనంత సంఖ్యలో హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరామనామ జపము చేయాలి. యాగంలో స్వయంగా పాల్గొనదలచినవారు పదకొండు రోజులపాటు, బ్రహ్మచర్య పాలన, మాంసాహారం,మద్యం,గుడ్డు భుజించటం పొగత్రాగటం లాంటివాటికి దూరంగా ఉండాలి. వారు ఇరవై మూడు[హనుమజ్జయంతి రోజు సాయంత్రమునకల్లా పీఠానికి చేరుకోవాలి. వారికి భోజనవసతి సౌకర్యములు [మాఅందరితోపాటు] కల్పించబడతాయి. స్వయముగా యాగమునకు రాలేనివారు ఇంటివద్దనే ఈ నియమాలు పాటించవచ్చు. వారు తమ జపసంఖ్యను ఎస్. ఎమ్. ఎస్. ద్వారా తెలుపవలసి ఉంటుంది .
ఇప్పటికే రామనామ లేఖనం ప్రారంభించి పూర్తిచేస్తున్నవారు మే ఇరవై కల్లా పీఠమునకు చేరేలా కొరియర్ లేక పోస్ట్ ద్వారా పంపించగలరు.

ఎవరైనా యాగంలోను, అన్నప్రసాద వితరణలోనూ తమ వంతు పురుషార్థములు సమర్పించాలనుకుంటే ఇక్కడ మెయిల్ ద్వారాగాని లేక దిగువన ఇస్తున్న నంబర్ లోగాని సంప్రదిస్తే వారికి బాంక్ ఎక్కౌంట్ నంబర్ తెలుపబడుతుంది. దానికి సంకల్పించిన సహాయం అందజేయవచ్చును పూలు,ఆకులు,పండ్లు ప్రసాదములు,యాగద్రవ్యములు, ఇలా ఏఏ ద్రవ్యాలకగు ఖర్చును భరించాలనుకున్నా వారి తరపున ఆయాద్రవ్యాలు తెప్పించి యాగంలో ఉపయోగించటం జరుగుతుంది..[ఇది కేవలం వారి ఇచ్చానుసారం అందించవలసిన సేవ. ] ఇలాపాల్గొనేవారందరికీ వారి ఖర్చులతో యజ్ఞ ప్రసాదములు పోస్ట్ లో పంపబడతాయి.
ఇప్పడు జరుగుతున్న అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం లో ఇప్పటికే తమ సహాయాన్ని అందించినవారు ఏమీ పంపవలసిన పనిలేదు.


గోత్రనామాలు పంపవలసిన చిరునామా

durgeswara@gmail.com


9948235641

శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం [పో]
నూజండ్ల మండలం
గుంటూరు జిల్లా
పిన్ 522660

rute హైదరాబాద్ టు ఒంగోలు వయా వినుకొండ _ ఉల్లగల్లు బస్ తెల్లవారు జామున నాలుగు గంటలకల్లా పీఠం దగ్గర దింపుతుంది [టిక్కెట్ మాత్రం ఉల్లగల్లువరకు తీసుకోవాలి]
స్వంతవాహనాలలో వచ్చేవారు హైదరాబాద్_ నాగార్జునసాగర్_ మాచర్ల- కారంపూడి- వినుకొండ- రవ్వవరం
మొత్తం ఆరుగంటల ప్రయాణం [ వినుకొండ దాకా బస్సులలో వచ్చి అక్కడనుండి పీఠానుకి వేరే బస్సులో చేరవచ్చు]

ఇక విశాఖ,విజయవాడ వైపునుండి వచ్చేవారు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో నేరుగా వినుకొండలో దిగవచ్చు
విజయవాడనుండి గుంటూరు మీదుగా హైవే లో వినుకొండ చేరవచ్చు.

రాయలసీమ వైపునుండి వచ్చేవారు కర్నూల్- విజయవాడ హైవే పైన వినుకొండ లోనే దిగవచ్చు.
బెంగళూర్ నుండి ,వచ్చే ప్రశాంతి, యస్వంతపూర్ ట్రైన్ లు వినుకొండలో ఆగుతాయి .
నెల్లూరు ఒంగోలు వైపునుండి వచ్చేవారు ఒంగోలునుండి అద్దంకి చేరుకుని అక్కడ నుండి దరిశి రూట్ లో ఉల్లగల్లు స్టేజ్ లో దిగి రవ్వవరం చేరుకోవచ్చు.

ప్రయాణంలో ఏ అనుమానం వచ్చినా ఫోన్ లలో సంప్రదించండిః యాగంలో పాల్గొనేవారంతా కలసి ఉంటాము, కలసి భుజిస్తాము , కనుక విలువైన ఆభరణములను ,వస్తువులను తెచ్చుకోవద్దని మనవి.
ఇక ఆహారవిషయంలో ఎవరి నిష్ఠకూ భగం కలుగని రీతిలో ఏర్పాటు చూస్తాము కనుక ముందుగా తెలిపితే వారి ఆచారానికనుగుణంగా భోజన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది.
contact no.
9948235641
9180204554
9010402119
 
భక్తజనుల సేవలో
దాసుడు
దుర్గేశ్వర


జైశ్రీరాం

Friday, May 2, 2014

హనుమద్రక్షాయాగం - 6

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
 
హనుమాన్ చాలీసా. తులసీదాసు గారు ప్రపంచానికి అందించిన సంజీవని. రాముని మీద తనకున్న నమ్మకాన్ని భక్తిని  పరిహసించి కేవల వినోదంగా భావించిన పాదుషాలను కోట వదిలి పారిపోయేలా చేసిన మహా మంత్రం. స్వామి మహిమనీ, చరిత్రనీ, భక్తినీ, వినయాన్నీ, శక్తినీ అన్నింటిని నలభై లైన్లలో చెప్పిన మహా మంత్రం. బాపు గారు తీసిన శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. రాముని భక్తుడైన యయాతి రాముని పూజ చేస్తూ ఉండగా పార్వతీదేవి పంపిన మాయ ఆ నగరం మీదకు రాబోతుంది. అప్పుడు ముకులిత హస్తాలతో రామ చంద్ర స్వామి ముందు కూర్చుని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం లోనుండి ఒక జ్యోతి వెలువడి గోపురం మీదకి చేరుతుంది. ఆ జ్యోతి హనుమగా మారి మాయని గదతో తరిమేస్తుంది. పసిపిల్లలు శ్రీకరమౌ శ్రీరామ నామం  అని పాడుతూ ఉండగా స్వామి ముందు కూర్చుని ఉన్న హనుమయ్య విగ్రహం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది. కోతి నైన జ్ఞానిని చేసే నీ దివ్యనామం అని హనుమ పాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. హనుమ ఉండగా రామభక్తులని కొనగోటితోనైనా అశుభం స్పృశించలేదు.
 
అలా హనుమ రక్షణ, కరుణ పొందిన వారిలో తులసీదాసు ఒకరు. స్వామి దయచేత రాములవారి దర్శనం చేసారు తులసీదాసు. ఆయన మహిమ చేత నిండు పేరోలగంలో రక్షింపబడ్డారు. అప్పుడు తులసీదాసు గారు చేసినదే హనుమాన్ చాలీసా. నేటికీ భక్తుల కొంగు బంగారమై కాపాడుతున్నది. నా అదృష్టం చేత ఐదు సార్లు హనుమద్రక్షాయాగంలో పాల్గొన్నాను. నా చేతులతో స్వామిని అభిషేకించాను. నా చేతులతో స్వామిని తాకుతూ ఆయనకు గజమాల వెయ్యగలిగాను. అభిషేకం సమయంలో సుందరకాండలో స్వామి చెట్లచాటున ఎలా దాక్కున్నారో అలానే మామిడాకుల కింద కనపడ్డారు. అశోకవనంలో వెతికేటప్పుడు పూలతో నిండిన కొండా  అన్నట్టు ఉన్నారు హనుమ అంటే ఓహో అనుకున్నాను. స్వయంగా అలాగే దర్శనమిచ్చారు హనుమ అభిషేకం చేసాక. పచ్చటి పసుపు, ఎర్రటి కుంకుమ, రంగు రంగుల పూలు, తెల్లటి కొబ్బరి చిప్పలు మధ్యలో సింధూర వర్ణంలో స్వామి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఎంత అందంగా ఉన్నారో. ఎంత చెప్పినా తనివితీరదు చూసి తీరవలసిందే.  అలాగే ఆ చాలీసా పుణ్యమా అని తమ కష్టాల నుండి బయటపడ్డ ఎంతో మంది చాలా దగ్గరగా చూసాను. నా స్నేహితులు కొంతమంది నా మీద నమ్మకంతో మొదలుపెట్టి చాలీసా పారాయణ చేసి కొన్ని గడ్డు సమస్యలనుండి బయటపడి స్వామి అనుగ్రహాన్ని స్వయంగా పొందారు. 
 

ఈ సారి మే ఇరవై మూడు హనుమజ్జయంతి. శుక్రవారం రావడం చేత ఇరవైనాలుగు పూర్ణాహుతి జరుగుతోంది. ఈ ఇరవై రోజులూ ఎంత త్వరగా అయిపోతాయా అని ఆత్రంగా చూస్తున్నాను. రాదలచుకున్న వారు దుర్గేశ్వరమాస్టరుగారిని (durgeswara@gmail.com cell 9948235641, durgeswara.blogspot.in ) గానీ, నన్ను కానీ సంప్రదింఛగలరు.
 
మనోహర్ చెనికల  

Tuesday, April 22, 2014

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

చాలా రోజుల తర్వాత నా బ్లాగులో మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. స్వామి అనుగ్రహంతో ఇప్పటికి ఐదు సార్లు హనుమద్రక్షా యాగంలో పాల్గొన్నాను. ఈసారి ఇరవైనాలుగుకోట్ల రామనామ జప సహితంగా హనుమద్రక్షాయాగం జరుగుతోంది.
ఉగాది నాడు మొదలిడి హనుమజ్జయంతి వరకు చాలీసా పారాయణం, తరువాత 108 కలశాలతో స్వామికి అభిషేకం, పంచామృతాలతో, పళ్ళరసాలతో స్వామి కి జరిగిన అభిషేకం చూస్తూ ఉంటే ఆనంద పారవశ్యంతో అలా ఉండిపోవాలని అనిపిస్తుంది.   తరువాత హనుమద్‌వ్రతం, పూర్ణాహుతి యాగం.  అంతమంది చాలీసాతో హవిస్సులు సమర్పిస్తూ ఉంటే చూడటానికి ఎంత రమ్యంగా ఉంటుందో.

మరిన్ని వివరాలకి durgeswara.blogspot.com  లో చూడండి.
durgeswara mastaru gaari phone number: 9948235641

విధేయుడు,
మనోహర్ చెనికల