Friday, October 9, 2009

నేనూ ఒక పద్యం రాసానోచ్.

శ్రీ రామదూతం శిరసా నమామి.
గజేంద్ర మోక్షం చదివిన తర్వాత నాకు కూడా ఆంజనేయస్వామి మీద ఒక పద్యం రాయలనిపించింది. మత్తేభమో, శార్దూలమో, చంపకమో, ఉత్పలమో కొడదాం అనుకున్నా
*ఫర్ క్విక్ రిఫరెన్స్
ఉత్పలమాల-భ ర న భ భ ర వ
చంపకమాల-న జ భ జ జ జ ర
మత్తేభం-స భ ర న మ య వ
శార్దూలం- మ స జ స త త గ (ఆటవెలది,తేటగీతి, కందం- పేర్లు మాత్రమే తెలుసు చందస్సు తెలియదు.). *

సరే కాన్సెప్ట్ కావాలి కదా... తీవ్రంగా బ్రైన్ ని ఆ భగవంతుడి గుణగణాల మీద కేంద్రీకరించి అలోచించాక నాకు తట్టిన మొదటి అలోచన ఆ రామదూత కు పెద తండ్రి అయిన యముడి విషయం. తదుపరి గుర్తొచ్చింది ఎవరినైనా ముంచగలిగిన సంసారమనే మృత్యుసాగరాన్ని అవలీలగా దాటిన విషయం. దాంతో దీన్నే పద్యంగా రాద్దాం అనుకున్నా. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.యముడు హనుమ కి పెద నాన్న అయినది ద్వాపరంలో, కానీ సాగరాన్ని దాటింది త్రేతాయుగం లో. దానితో ఎలా రాయడమా అని తెగ అలోచించాను. ఏమీ తోచలేదు. నేనేమన్నా సహజ పాండితీ ప్రకర్ష ఉన్న పొతన్ననా, మామూలు పదాలతోనే పెద్ద పెద్ద పద్యాలు రాసెయ్యడానికి(జో జో కమలదలేక్షణ, జో జో మృగరాజ నయన జో జో-దశమ స్కంధం), లేకపోతె అజ్జాడ గారిలాగా సమయ స్పూర్తి ఉన్నవాడినా,(రాజుతో పేకాట ఆడుతూ రాజుకు మూడు ఆసులు , తనకు మూడు రాజులు వస్తే, పెద్ద పందెం పెట్టేసి ఆనక "ఏ ధైర్యం తో అంత పందెం పెట్టావంటే" రాజుల మీద నమ్మకంతో అని ఎస్కేప్ అయినట్టు అవ్వడానికి)
అందుచేత చివరికి నేను కూడా అర్జునుని బాణాన్నే నమ్ముకుని - పద్యం తెలిసిన వాళ్ళకి కవిత అని, తెలియని మా అశోక్, శశాంక్, అభి, కిరణ్(కిరణ్ కి కొంచెం తెలుసనుకుంటా),రెక్కల పక్షి(వింగ్ బర్డ్-వెంకట్)కి ఏ కందమో, ఆటవెలదో, తేటగీతో అని చెప్పెయ్యచ్చులే అని ఒక పద్యం రాసేసా.
ఇదుగో ---
సర్వతముడవు,సర్వోత్తముడవు
సర్వాత్ముడవు,సర్వము నీవై యుండన్
సర్వకాలములందు నమస్కరింతు
సర్వం సహా చక్రవర్తికి సరసీరుహాళికిన్
ఏంటి ఎక్కడో చదివినట్టు ఉందా (1-విశ్వకరు,విశ్వదూరుని,విశ్వాత్ము,విశ్వవేద్యు విశ్వునవిశ్వున్ శాశ్వతనజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిన్ బరమ పురుషు నే సేవింతున్ 2-లోకంబులు లోకేశులు లోకస్ధులు దెగిన దుది నలోకంబగు పెంజీకటికవ్వలనెవ్వడేకాకృతి వెలుగుచునుండునాతని సేవింతున్ ... ఇలా ), ఒక వేళ మీరెక్కడన్న చదివినా అది నా తప్పు కాదు. ఎందుకంటే ఇది నా సొంతం......(ఏంటీ స్వామి నవ్వుతున్నావా నా సొంతమన్నానని-అంతేలే ఎందుకు నవ్వవు, గ్రామర్ పెద్దగా తెలియని నాకు ఒక పద్యం రాయాలని కోరిక కలిగించి చివరికి నేను రాయలేకపోతే నిరుత్సాహ పడకూడదని ఒక చిన్న పద్యం రాసేలా చేస్తే ఇప్పుడు నేను ఈ పద్యం నాదే అంటే నవ్వు రాదా).
నాది అని అన్నందుకు క్షమించు స్వామీ కానీ అలా అనడానికి కారణం ఉంది, అలా అనుకోకపోతే నీకు నైవేద్యంగా సమర్పిన్చుకోలేనన్న చిన్న ఆలోచన . అందుకే ఈ చిన్న ధిక్కారం.
కూర్చె భాగవతమొకరు నిను సేవించి కైవల్యమొంద,
తీర్చుకొనుటకు జన్మ జన్మంబుల కర్మ పాశములు కొంద
రర్చించె శతకములతో,అల్ప జ్ఞాన వశమున నే
కూర్చిన ఈ పదమాలనర్చించనిమ్ము నీ పాద పద్మంబుల
నా మొదటి పద్యం(సర్వతముడవు...) ఆ శ్రీ రామదూతకి అంకితమిస్తూ.......
శ్రీ రామదూతం శిరసా నమామి....
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం

11 comments:

durgeswara said...

భక్తితో మనసు భగవద్భావనతో నిండితే పాటటైనా పద్యమైనా మన సంకల్పం లేకుండనే బయటకు వస్తుంది.
రామదూత కృపాకటాక్షప్రాప్తిరస్తు

durgeswara said...
This comment has been removed by the author.
durgeswara said...
This comment has been removed by the author.
Unknown said...

హన్నా, పద్యం చదువుదామని వస్తే నాకే గురిపెట్టి బాణం వేసావుగా.
హాస్యం తరువాత, భావం బాగుంది. మొదటి పద్యం కన్నా రెండవ పద్యం బాగుంది.

sunita said...

చక్కటి ప్రయత్నం. మొదటి అడుగులోనే సర్వేశ్వరుణ్ణి ధ్యానించారు గదా!! జయప్రదంగా వ్రాయ గలుగుతారు. Keep it up.

చింతా రామ కృష్ణా రావు. said...

భక్తికి సాధ్యమన్నియును, భక్తికి దైవము దాసుడేయగున్.
భక్తికి శక్తి హెచ్చు. వరభావ సమృద్ధికి మూలమిద్ది, యా
భక్తిని కల్గి మీరు కడు పంతముతోడ రచించినార లా
శక్తిని దైవమిచ్చెగద. సద్గుణ శోభిత వ్రాయుచుండుమా!

మనోహర్ చెనికల said...

@ మాష్టరు గారు:
నెనర్లు.
ప్రదీప్:
నిజం చెప్పాలంటే మీరు అప్పుడు రాసిన పద్యం స్పూర్తి తోనే నేను రాసాను. చంధస్సు తర్వాత, భావమైనా బయటికి వస్తుంది కదా అని....
సునీత గారు :
నెనర్లు
రామకృష్ణ గారు:
మీ వంటి పెద్దల ఆశీస్స్లు, ఆ భగవంటుడి కరుణ ఉంటే ఏదైనా సాధ్యమే
నెనర్లు....

గిరి Giri said...

పట్టిన పట్టువీడక నుపాయము తోడ, పదమ్ములల్లుతూ
గట్టిగ యత్నముల్ సలుప, కచ్చితమే యనుమానమేటికిన్
కొట్టన పిండియౌ, తమకు కూసగు విద్దియ యౌను పద్దెముల్
చట్టున కట్టుటే, తగిన సాయము సేయుదు రిచ్చటెందరో

AVS said...

తమ్మీ, లైట్గా తీస్కో... నీ పద్యం గెట్లుందంటే,

ప్రవీణ్ శర్మ కధనంలా,
పద్మార్పిత కవితలా,
'మహిషా'షుని మేధస్సు వోలె
మరువపు మాటల మాదిరి

ఉందబ్బయా...

ఏంది సమజ్గాలేదా? సరే ఇది కూడా కలుపుకో...

జ్యోతిగారి సోత్కర్షలా
గీతచారి సమీక్షలా
ఇన్నయ ఇంగితజ్నానం
'శరత్'కాల విశృంఖలం

బొల్లోజుని అనువాదం
భాస్కరుని వెటకారం
అమ్మావొడి అనుమానం
కలగలిసెను నీ పద్యం

వామ్మో ఇప్పుడు సడేనుగా అందరికీ నా మీద పీకల్దాక అభిమానం పెరుగుద్దేమో...

సరదాగా రాసింది కనుక అందరూ లైట్గా తీస్కోవాలి మరి... :)

మనోహర్ చెనికల said...

giri garu:
thanks
bhaditudu garu:
intaki final gaa ela undO cheppaledu. I maata endukadugutunnanaMTE mIru raasina kavitalO vaadina blaagullO amma odi blaagu maatramE regular gaa chaduvutaanu.migatavi naaku antagaa parichayaM lEdu.

Seetharam said...

తేటగీతి:
సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకర ద్వయంబు తేటగీతి

ఆటవెలది:
ఇన గణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు నాటవెలది

ఇవి తేట గీతి మరియు ఆటవెలది పద్యముల ఛందస్సు వివరాలు. వీటిని గణ విభజన చేసినా ఆ లెక్కకి సరిపోతాయి.

సీతారామం