Tuesday, April 21, 2009

రెండున్నరేళ్ళుగా అందని ద్రాక్షగా మిగిలిన ఆ స్వామి దర్శనం.

శ్రీ రామదూతం శిరసా నమామి
నేనుండేది లింగంపల్లిలో, ఉద్యోగం ఐఐఐటి దగ్గర. ఆటో లో పావుగంట ప్రయాణం. ఎప్పుడైనా స్నేహితులుంటే బైక్ మీద వెళ్ళేవాడిని. గుల్ మొహర్ పార్క్ దాటిన తర్వాత అలిండ్ కి ముందు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. కొంచెం ఎత్తులో ఉండేదేమో దారిన పోతుంటే మూల విరాట్టు స్పష్టంగా కనపడేది. 2006 ఆగస్ట్ నుండి ఆ గుడి కి వెళ్దామని ఉండేది. కాని ఎపుడూ కుదరలేదు. మధ్యలో ఆటొ దిగి మల్లీ ఇంకొక ఆటో పట్టుకొని రావాలి. దానికి తోడు షూ విప్పాలి. ఇవన్నీ పెద్ద ప్రతిబందకాలు గా అనిపించేవి. దాంతో మనసులోనే "అతులిత బలదామం "అనుకుంటూ ఉండేవాడిని. దానికి తోడు తారక మంత్రం ఉండనే ఉంది "దేవుడు అని మనసులో ఉంటే చాలు చూపించక్కరలేదు అని". అదేంటో నగా నట్రా చూపించాలి కానీ భక్తి మాత్రం ఎవరన్నా ఉంటే బయటికి రాకూడదు ఎందుకో . సీరియస్ గా అనుకునేవాడిని, బండి కొనుక్కున్నాక రోజూ వెళ్ళాలి అని అనుకునేవాడిని. కానీ కొన్నదీ లేదు వెళ్ళిందీ లేదు. కొన్నాళ్ళు మా శశాంక్ తో కలిసి బైక్ మీద ఆఫీస్ కి వచ్చాను కాని ఎప్పుడూ గుడికి వెల్దాం అని అడగలేదు. కొన్నిసార్లు ఇంటి దగ్గర తొందరగా బయలుదేరి గుడి దగ్గర దిగుదాం అనుకున్నా. కానీ అలా అనుకున్న ప్రతిసారి ఇంకా లేటయ్యేది. కొన్నాళ్ళు ఏదేమైనా ఈరోజు మర్చిపోకుండా దిగాలి అనుకునేవాడిని. ఆ రోజు ఆటోలో ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ రావడమో లెదా నేనే ఎవరికైనా ఫోన్ చెయ్యాల్సి రావడమో జరిగేది.ఇంకొన్ని సార్లు ఆటోలో నిద్రపోయేవాడిని, లేచి చూస్తే ఏ యూనివర్సిటీ దగ్గరో తేలేవాడిని.
కానీ ఈ రోజు అర్ఢమైంది. స్వామి కావాలనే నన్ను అక్కడికి దూరంగా ఉంచారని. విషయం ఏంటంటే బి.టెక్ లో ఉన్నప్పుడు నేను సుందరకాండ పారాయణ పుస్తకం కొన్నాను కాని ఎప్పుడూ తెరిచిన పాపాన పోలేదు. కాలగమనంలో నాహం కర్తా హరిః కర్తా పుస్తకం చదవడం, వేయిపడగలు చదవడం జరిగింది కానీ సుందరకాండ మాత్రం తెరవలేదు. అలాగే నాతో పాటు ఉద్యోగం కోసం నా వేయి పడగలు, సుందరకాండ , భగవద్గీత హైదరాబాద్ చేరాయి. వేయి పడగలు మళ్ళీ రెండు సార్లు చదివాను కానీ సుందరకాండ మాత్రం చదవలేక పోయాను. ఇలా కాదని ఎం.స్. రామారావు గారి తెలుగు సుందరకాండ ఆడియో సంపాదించాను. కాని అదేంటో నా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి పాటల్లో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వినకుండా ఉన్నది అదొక్కటే . దానితో ఇక సుందరకాండ గురించి మనకు తెలియడం ఈ జన్మలో జరగదేమో అనుకుంటున్న తరుణంలొ తెలుగు డివోషనల్ స్వరాంజలి బ్లాగు చూసాను . అక్కడ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి "హనుమధ్వైభవం" ప్రవచనం వినడం జరిగింది. ఆ తర్వాత సురస సైట్ గురించి తెలిసింది. అక్కడ ఉషశ్రీ గారి రామాయణం విన్నాను. దాని తర్వాత హనుమజ్జయంతి సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచ్చిన ఒక ప్రవచనం ఇంటర్నెట్లో విన్నాను. ఆ తర్వాత వారిచ్చిన రామాయణాంతర్గత సుందరకాండ ప్రవచనం అంతర్జాలంలో విన్నాను. ఏడు రోజుల ప్రవచనం, రోజుకు రెండు గంటలు చొప్పున . ఇది పూర్తి గా వినడానికి కూడా లెక్కలేనన్ని అవాంతరాలు. ఒక అవాంతరం తర్వాత మళ్ళీ కొత్తగా వినడం మొదలుపెట్టడం , మళ్ళి అనుకోని విధంగా ఇంకొక అవాంతరం రావడం ఇలా ఎంతవరకు వెళ్ళిందంటే కేవలం సముద్ర లంఘనమే ఐదారు సార్లు విన్నాను. తర్వాత అలోచించుకుంటే ఆ భగవతుడే కావాలని, ఆత్మ దర్శనానికి ఎన్ని అవరోధాలుంటాయో చెప్పడానికే అలా చేశారనిపించింది. ఒక పక్క హనుమత్ రక్షా యాగం మర్చి పోయాననే బాధ , ఇంకొక పక్క నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నా సుందరకాండ ఎందుకు తెలుసుకోలేక పోతున్నానే సందేహం, ఈసారి ఎలాగైనా విని తీరాలన్న పట్టుదల , పైన ఆ పవనసుతుని కృప చేత నిన్నటికి ఆ ప్రవచనం వినడం పూర్తి చేయ గలిగాను. ఆ ప్రవచనం గురించి చెప్పాలంటే ఇంకొక పది టపాలు రాయాలి అంత అధ్భుతమైన వాగ్ధాటి,ప్రఙ్ఞ,కౌశలం ఉన్న పండితులు కోటేశ్వరరావు గారు. నిన్నటికి ప్రవచనం వినడం పూర్తి అయ్యింది, చూసుకుంటే సోమవారం. నేను మొదలుపెట్టింది ఒక మంగళవారం (చాలా మంగళవారాల క్రితం) అనుకోని విధంగా మంగళవారానికి పూర్తి అవ్వడం వెనుక ఆ స్వామి నాకు ఏమైనా చెప్పదలచుకున్నారా అనిపించింది. సరే మంగళవారం, సుందరకాండ వినడం పూర్తి అయ్యింది కదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్న. అనుకోగానే గుల్ మొహర్ పార్క్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి గుర్తొచ్చింది. సరే ఎలాగైనా మధ్యలో దిగి గుడి లోకి వెళ్ళాలి అనుకున్నా. అనుకోవడం ఐతే అనుకున్నా కానీ మనసులో భయంగానే ఉంది ఆ స్వామి అనుమతి ఉందో లేదో అని . ఎందుకంటే ఎన్నో సార్లు మనసులో గట్టిగా అనుకుని అక్కడ దిగకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఈ రెండేళ్ళలో చాలా ఉన్నాయి కదా. సరే చూద్దాం ఆ స్వామి ఏం రాసిపెట్టారో అని వేయి పడగల్లో గణాచారి పూర్వీకుడు ప్రాణాలని అప్రమత్తతకి వెలకట్టి జాగరూకతతో ఆవుని వెతకడానికి పోయినట్టు , బయలుదేరాను. ఆటో ఎక్కి బయలుదేరాను నరాలు తెగిపోయేటంత టెన్షన్ గా ఉంది- దిగుతానో దిగనో , మర్చిపోతానేమో , నిద్ర పోతానేమో, ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అని . చివరికి ఎలాగో గుడి ముందు "ఇక్కడ ఆపు బాబూ" అనగలిగాను.ఇప్పటికీ నాకు డౌటే నేనన్నానో , ఆ స్వామి అన్నారో. దిగిన తర్వాత చాలాసేపు నన్ను నేనే నమ్మలేకపోయాను. ఆ తర్వాత దర్శనం చేసుకున్నాను. అప్పుదు తెలియలేదు కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం గుర్తు తెచ్చుకుంటే ఆ స్వామి "ఇందుకే నువ్వింతవరకూ ఈ గుడికి రావడం కుదరలేదు" అని చిద్విలాసంతో అన్నట్టనిపిస్తోంది. సుందరకాండ ప్రవచనాన్ని విన్నందుకు ఆ స్వామి నాకు ఇచ్చిన బహుమానం "రెండున్నరేళ్ళుగా అందని ద్రాక్షగా మిగిలిన ఆ స్వామి దర్శనం" .
ఆ స్వామి అనుగ్రహ ప్రసాదాన్ని మీతో పంచుకుందామని చేసిన చిన్న ప్రయత్నం ఇది. మొదలు పెట్టినపుడు ఇంత రాస్తానని కానీ రాయాలని కానీ అనుకోలేదు. కానీ ఆ అంజనీ సుతుడు తోడుండి రాయిస్తుంటే రాయగలిగాను.

7 comments:

బ్లాగాగ్ని said...

రామ లక్ష్మణ జానకీ, జై బోలో హనుమాన్ కీ. ఆలస్యంగానైనా ఆ అంజనీపుత్రుడి దయకి పాత్రులైనందుకు సంతోషం.

durgeswara said...

మరెందుకిక ఆలస్యం

హనుమత్ రక్షాయాగానికి రేపటినుండి చాలీసా పారాయణమ్ మొదలుపెట్టండి.హనుమదనుగ్రహ ప్రాప్తిరస్తు

amma odi said...

మీ అనుభూతి మాకు అర్దమయ్యిందండి. ఎందుకంటే ఇలాంటివి అనుభవించినప్పుడు మాత్రమే భగవంతుడు మనకి ఏం చెబుతున్నాడో తెలుస్తుంది. ఒకోసారి ఇతరులకివి అర్ధరహితంగానూ, ట్రాష్ గానూ అన్పించినా, వాళ్ళకి అది అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది.

Unknown said...

Good

Sasank said...

manohar, raasina vidhaanam chaala baagundhi....keep it up

మనోహర్ చెనికల said...

స్పందించిన అందరికీ కృతఙ్ఞతలు. రాయడమా వద్దా అనే సందేహంలోంచి రాయమని ప్రోత్సహించి,రాయించిన ఆ అంజనీసుతునికి, సుందరకాండలోని ఉపాసనా రహస్యాలను సులభంగా అందరికీ అర్ధమయ్యేలా ప్రవచించిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా సాష్టాంగ ప్రణామాలు. ఒక గుడికి వెళ్లడానికి ఇంత కధ , ఇంత ఇది అవసరమా అని అంటారనుకున్నాను కానీ అంతా అర్ధం చేసుకున్నారు. ధన్యవాదాలు

sree said...

మీ వలన మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న " శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అద్బుతమైన మహిమాన్వితమైన వారి చే వారి వలన నడుపపడుతున్న ఒక మంచి బ్లాగు ను చూడగలిగాము అందులకు మీకు మా ధన్యవాదాలు. మీ లో ఉండే తృష్ణ మీలో వుండే భక్తి వలన ఆ మహావీరుని దయకి పాత్రులు కాగలిగారు