Friday, January 23, 2009

దశ రూపకం-ఐదవ భాగం


మందపిల్లి.
౨౭ -౧౧ -౩౮ .
అయ్యా! రసరాట్టు గారూ! తమ జాబు అందింది. మా నాన్నగారు కవిత్వం రచించగలరని మాకు తెలియదు. ఈ రచన ఆయనది కాదేమో! అయినా నమస్కారం.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౨౮-౧౧-౩౮
గోపీ! ఇహనేమ్మరీ! నేను అప్పుడే అనుకున్నాను. అందుకనే ఈ రచన రమ్యంగానూ గంభీరంగానూ మాత్రం ఉంది.శైలి మృదుమధురంగానూ, ప్రాయశః భయజనకంగానూ, సర్వత్రా నాతి కఠినపదభూయిష్ఠంగానూ ఉంది. కవి ఇటువంటి రచనలు ఇంకా మేట్లకొలది రాసి, బతికుండగానే అచ్చు కొట్టి, చచ్చో చెడో అందరికీ ఉచితరీతిని వాటిని అందజేసి ధన్యుడై తరించును గాక.
ఇట్లు,
రసరాట్

రిపబ్లిక్ డే శుబాకాంక్షలు


Thursday, January 22, 2009

దశ రూపకం -నాల్గవ బాగం

మందపిల్లి.
25-11-38.
ఆర్యా! మా నాన్న గారు గ్రామాంతరం వెళ్ళేటప్పుడు ఈ రచన మీద అభిప్రాయంకోసం ఇది మీ పేర పంపించమని నాతో చెప్పారు. అన్నట్టు, మీరు వారికి బాకీ ఉన్న లెఖ్ఖ గురించి వ్రాయమనికూడా అని వెళ్ళారు.

ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౬-౧౧-౩౮
గోపీ! అల్లా చెప్పుమరీ! అందుకనే ఈ రచన మిక్కిలి ఉత్కృష్టం. కవి కేవల ఛాందసుడు కాడు. ఒకటోరకమైన చాదస్తంలా పైకి కనిపించేది యావత్తూ ఫక్తు చేవ,గుంజు. ఇందులో అపార పాండిత్యం గంగాతరంగాలవంటి నిమ్నోన్నత భావాలలో చదువర్ని ముంచి లేవనెత్తుతుంది. పాండిత్యం ఇంత సద్వినియోగం చేసినవాళ్ళు లేరు.ప్రాచీన సంప్రదాయం ఇక్కడే నిల్చింది. మారుమూల పదాలకి ఈ రచన కాణాచి, అపురూప కారకాలకి ఈ రచన దిక్కు, పురాణేతిహాసాలకి ఈ రచన ధర్మ సత్రం. నేలబారు రోకలిబండ్లు ఎగర్లేని మహోన్నత కవితాగిరిశిఖరాలలోనే ఈ కవివాణి విహరిస్తుంది. గ్రహించే బుర్రలుండాలిగానీ, నవీన విజ్ఞానం అనబడేది కూడా చణక శాస్త్రిగారి ఈ క్రొత్త రచనలో ఉంది. నాదీ పూచీ!
ఇట్లు,
రసరాట్

Tuesday, January 13, 2009

సంక్రాంతి

ఈ భోగి మంటలు మన జీవితాలలో చీకట్లను ప్రారదోలాలని,
ఈ సంక్రాంతి మన జీవితాలను శుభమయం చెయ్యాలని,
మనస్పూర్తిగా కోరుకుంటూ...
భోగి ,మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.

Monday, January 12, 2009

దశరూపకం-మూడవ బాగం.

మందపిల్లి,
౨౩-౧౧-౩౮
రసరాట్టు గారికి వందనాలు, తమ జాబు అందింది. ఆ రచన నాది కాదు. సలాం.
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౪-౧౧-౩౮
గోపీ! నువ్వింకా ఏముటో అనుకున్నాను. తగ్గవాడివే.మొత్తం మీద చణక శాస్త్రుల్లుగారి అబ్బాయి ననిపిస్తున్నావ్. ఆ రచన చెయ్యడంపాటి తెలివితేటలు నీ దగ్గిర లేకపోతే పోనీ అది ఎవరు రాశారో ఆ సంగతేనా నాకు రాయవలిసి ఉంటుందనేనా నీకు ఇంగితజ్ఞానం ఉండకూడదూ ! ఇదుగో:
ఈ రచన మంచిది. భాష చక్కనిది. వస్తువు అందమైనది. రీతి కులాసాగా ఉంది. వృత్తి గౌరవము కలది. ఈ కవికి హిందూస్తానీ కూడా తెలుసు. వెల స్వల్పం. ఫలమధికం,చక్కని సైజు.
ఇట్లు,
రసరాట్.

దశరూపకం-రెండవ బాగం.

మందపిల్లి.
౨౧-౧౧-౩౮
రసరాట్టు గారికి సమస్కౄతులు-------
ఆర్యా! తమ జాబు చేరింది. క్షమించవలె. మొన్న నేను తమకు రాసిన ఉత్తరం పొరపాటు. తమకు ఆ రచన పంపినట్టు జ్ఞాపకముండి అట్లా రాసాను. ఈవేళ తీరా చాకలి తెచ్చిన కోటు తొడుక్కోగా, నా కోటు జేబులోనే ఆ రచన కూడా ఇస్త్రీ అయి ఉండిపోయింది. ఇప్పుడే వేరొక కవర్లో పెట్టి ఆ రచన మీకు పంపాను. ఆ కాగితాలు విప్పేటప్పుడు జాగ్రత్త. నామీద దయ ఉంచి మంచి అభిప్రాయం పంపండి .
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౨-౧౧-౩౮
గోపీ! మరొకరికి పంపవలసిన ఉత్తరం నీకు వేసాను. నువ్వు కొంచెం అసాధ్యపు పిల్లకాయలా ఉన్నావు. నువ్వు కవిత్వం గూడా రాస్తావని లోగడ నేనెరగను. ఇదిగో:
ఈ కవి సుప్రసిద్ధ పండితపుత్రుడు. ఇతివృత్తం ఒక మహా పురాణంలో అసలైన పట్టు. కాని, ఈ రచనలో అనుభవం తక్కువ. ఆవేశానికి తుల్యమైన ఆరిందా లేకపోవడం సహజం గనక, లేదు. ఉంటే అడిగారూ! ఉన్న తప్పులు కుర్ర తప్పులు గనక క్షమించవచ్చు. ఈ కవికి భవిష్యంలో మంచి విలవ వస్తుంది. ఇప్పుడైనా, రచన నవనవోన్మేహం, మహామెత్తని శయ్య, పరిశుభ్రమైన ధార. పాండిత్యంలో కనబడే లోటు కూడా కాలక్రమాన్ని, అన్నీ సర్దుకున్నట్టే, సర్దుకుంటుంది. మాంచి అక్కరకొచ్చే చెయ్యి, సవ్య సాచి. భరతమాతకి ఇల్లాంటి సంతానం అవసరం.
ఇట్లు,
రసరాట్.

Friday, January 9, 2009

దశరూపకం - భమిడిపాటి కామేశ్వరరావు

భమిడిపాటి కామేశ్వరరావు గారి మనతెలుగు లోని ఒక చిత్రమైన కధ ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో ఉన్న ఈ కధ ఒక వ్యక్తి మనిషిని బట్టి , స్ధాయిని బట్టి ఎలా ప్రవర్తిస్తాడో చెప్తుంది. మూల ప్రతి పిడిఎఫ్ సరిగా లేనందున పది ఎపిసోడ్లు గా దీన్ని బ్లాగ్ లో రాస్తున్నాను.
మొదటి భాగం
మందపిల్లి
౧౯-౧౧-౩౮
రస రాట్టు గారికి నమస్కారములు -------
మహాశయా! నాన్నగారు మా తోటారం భూముల మీదికి శిస్తు వాసులు వగైరాలకి వెళ్ళారు. పది రోజుల క్రితం తమ పేరట ఒక వచనరచన పంపి ఉన్నాను. మరి ఆలస్యం కానియక దానిమీద తమ సదభిప్రాయం పంపండి. తిరుగు టపాలో పంపాలి.
ఇట్లు,
గోపీనాధం.
జవాబు
పేరారం
౨౦-౧౧-౩౮
గోపినాధానికి ఆశీర్వచనాలు -----
అబ్బాయీఏదో ఆలస్యం అయ్యింది. ఏమీ అనుకోకు. నాకు మీ నాన్న గారొకటీ నువ్వొకటీ కాదు. ఇదుగో:
ఈ గ్రంథం ఆంధ్రానికి ఒక ఆస్తి. అక్కడక్కడ దీంట్లో మామూలు దోషాలు లేకపోలేదు కాని, కొన్నిపట్ల ఇది ఎంతో హృద్యంగా ఉంది. ఇటీవలి దిన్నీమాండలికమున్నూ అయిన పోతభాష వాడితే నేంపోయె , చేతభాష కుడా పాళం గానే పడింది. అతి తెలివి సంకర సమాసాలు బలే విరివిగానూ, మహా జోరుగాను, లేవని చెప్పలేం కాని, జటిలత్వం నిండుకుంది అనడానికీ వీలు లేదు. పాండిత్యంలో లోటుకీ కదలోని నీటుకీ ఉర్జీ సరిపోయింది. ఇది ఉత్తమోత్తమం అని వ్రాయజాలం కాని , దీన్నినీచ కావ్యం అని కొట్టిపారెయ్యడానికీ మనస్కరించకుండా ఉంది. మొదలు ఎట్లా ఉందో చివరంటా అంతే.
ఇట్లు
రసరాట్.
(ఇంకా ఉంది)

Wednesday, January 7, 2009

దేవుడా ఓ మంచి దేవుడా

దేవుడా ఓ మంచి దేవుడా
కాస్ట్ కటింగ్ పేరు చెప్పి
కుబేరుడి లాంటి ఐటిని కుచేలుడులాగా చేశావు
కిన్లే వాటర్ని కాస్తా కుండ నీళ్ళుగా మార్చావు
తాగడానికి డ్రింతులు తినడానికి బర్గరు లేకుండా చేశావు
సుఖమైన క్యాబ్ ప్రయాణాన్ని నిలిపివేయించావు
వీకెండ్స్ పార్టీలు లేవు, డిస్కోథెక్ లు లేవు
హౌస్ లోన్లు లేవు-పర్సనల్ లోన్లు లేవు
ఎప్పుడూ వెంటపడే బ్యాంక్ వాళ్ళు ఎటెళ్ళిపోయారో తెలియదు
ఎప్పుడు ఏం తీసేస్తారో తెలీదు
ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు
ప్రశాంతమైన జీవితాన్ని ఒక ప్రశ్నలాగా మార్చావు
చివరికి ఐటి వాళ్ళకి పిల్లని ఇవ్వాలన్నా భయపడేలా చేశావు
ఈ కొత్త సంవత్సరంలోనైనా
ఉన్న పళ్ళు ఊడిపోయేలా కాకుండా
ఉన్న ఉద్యోగం నిలబడేలాగా- ఇస్తున్న జీతం ిచ్చేలాగా
మాకు కూడా పెళ్ళి అయ్యేలాగా చూస్తావని
కాస్ట్ కటింగ్ అనేది ఐటి వాళ్ళ జీవితంలో మరియు జీతంలో లేకుండా చేస్తవని ఆశిస్తున్నాను
నాకు తెలుసు నువ్వు చేస్తావని
ఎందుకంటే బేసికల్ గా యువార్ యె గాడ్, గుడ్ గాడ్

ఐటి వాళ్ళ తరపున నీకు ౨౦౦౯ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ఇది నాకు వచ్చిన ఒక మెయిల్ నుండి, ఎవరైనా ముందే రాసుంటే క్షంతవ్యుడిని