నా స్నేహితుడు:
ఎవరికి వారు నిజాయితీగా ఉంటే చాలు...అవినీతి ఉండదు అంటున్నారు. అది నిజం కూడా. కానీ, చుట్టూ ఉన్న ప్రజానీకానికి నిజాయితీగా బ్రతికేందుకు కావల్సిన పరిస్థితులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎవరిమీద ఉంది?
ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకుని మీదనా?
లేదా ఆ సమాజం వల్ల బాగుపడి కడుపు నిండిన వాడి మీదనా?
లేక ఇద్దరి మీదనా?
వీరిద్దరూ కాక ఇంకా ఎవరైనా ఉన్నారా?
manohar chenekala -
ఎవరైనా కాదు, ఏదైనా ఉందా అని అడిగితే సరైన సమాధానం దొరుకుతుందేమో! అదే మనస్సాక్షి. ఎన్నుకోబడ్డ నాయకులకి ప్రజా ప్రతినిధులుగా ఉన్నాం. మన భాధ్యత వారికి మంచి జీవితాన్ని అందించడం అన్న భావం ఖచ్చితంగా ఉండాలి.నాయకులంటే ఎవరు? ఒకప్పుడు మనలాగే అమ్మపాలు తాగుతూ, తాతయ్యలూ , అమ్మమ్మలూ చెప్పే కధలు వింటూ పెరిగిన వారే కదా! ఆ సమయంలో ఆత్మసాక్షి అనేది ఒకటుందనీ, అది ఆస్తిక,నాస్తిక వాదానికి అందకుండా మనం తప్పు చేసినప్పుడు , ఒప్పు చేసినప్పుడు మన వెంట వుండి తన అభిప్రాయాన్ని చెప్తుందనీ , దాని నోరు నొక్కెయ్యడం ప్రాణాన్ని అమ్ముకుని శరీరాన్ని బతికించుకోవడంలాంటిదనీ అర్ధం అయ్యేలా చెప్పగలగాలి.అప్పుదు ఆ పిల్లవాడు ఏ పనైనా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు, సరైన నిర్ణయం తీసుకుంటాడు, లేదా తీసుకోవడం నేర్చుకుంటాడు. ఇప్పటికైనా మన పిల్లలను ఆ దిశగా తీర్చిదిద్దుకోవడం మన చేతిలోనే ఉంది.
చట్టానికి దొరకకుండా తప్పించుకోవడమ్ కొంత తెలివైన వాడికి సాధ్యమే, కానీ ఆత్మసాక్షి నుండి తప్పించుకోవడం అనేది అంత సులభంకాదు. అది అలవాటైనవాడు ఎవరికీ భయపడడు, ఎంతటివారి ముందైనా నిర్భయంగా తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతాడు. నిజాయితీ ఒకరకమైన ధైర్యాన్నిస్తుంది.
ఇద్దరు స్నేహితులున్నారనుకోండి. ఒకర దగ్గ్గర చాక్లెట్లు ఉన్నాయి, ఒకరి దగ్గర గోళీలు ఉన్నాయి. ఇద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, గోళీలున్నవాడు ఒక గోళీ దాచుకుని ఇచ్చాడు, చాక్లెట్లు ఉన్నపిల్లవాడు మొత్తం ఇచ్చేసాడనుకోండి. అప్పుడు ఎవరు మనశ్శాంతిగా ఉంటారు. తనని అవతలివాడు మోసం చేసినా మొదటివాడు నిర్భయంగా ఉంటాడు, అనుమానించడు, కానీ రెండవవాడు? తాను మోసం చేసాడు కాబట్టి, అవతలివాడు కూడా తనను మోసం చేసాడేమో అని అనుమానం ఉంటుంది, నిద్ర పట్టదు. మనశ్శాంతి ఉండదు. అది నిజాయితీ ఇచ్చే నిర్భయత్వం.Edit11:10 am
నా స్నేహితుడు:
సరే మనోహర్, నేను మరో విధంగా ఆలోచిస్తా... అప్పుడేమంటావు. నిజాయితీని పక్కన పెట్టి, అవతలోడికి నేను ఒక గోళీ తక్కువిచ్చినా నమ్మేశాడు..వెర్రోడు అనుకుంటా... అదే ఆలోచనలో ఉంటాను. వేరే విధంగా ఆలోచించను. నాదే పై చేయ్యి, నేను పక్కోడిని బురిడీ కొట్టించాను అని ఫీలవుతాను. నా దృష్టిలో అవతలోడు ఎప్పుడూ వేస్ట్ గాడే అనుకుంటాను అనుకో... అప్పుడేమంటావ్... ఈ ప్రపంచంలో మనస్సాక్షికి ఈ విధంగా కూడా సమాధానం చెప్పుకోవడం సాధ్యమే.
సరే, నేను తర్వాతి తరానికి ఈ విధంగా బోధిస్తాను. రావణుడు ఉన్నన్నాళ్ళూ లైఫ్‌ని ఎంజాయ్ చేసుకోని, ఒక్క రామబాణంతో పెద్దగా కష్టంలేకుండా చచ్చాడు. అదే రాముడైతే నిజాయితీ కోసం అడవులకెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు అంటాను. మరి, తర్వాతి తరం ఏ ఆలోచనలో పెరుగుతుంది చెప్పు.
ఏనాటికైనా చచ్చేవాళ్ళమే తప్పో, ఒప్పో ఏదైతేనేం ఉన్నన్నాళ్ళూ లైఫ్‌ను ఎంజాయ్ చేసుకుంటే చాలు అనే ఆలోచనలోకి ప్రజలు మారిపోతే ఎలా ఉంటో ఆలోచించుకో..12:12 pm
manohar chenekala - అదే నేననేది,
"సరే మనోహర్, నేను మరో విధంగా ఆలోచిస్తా... అప్పుడేమంటావు. నిజాయితీని పక్కన పెట్టి, అవతలోడికి నేను ఒక గోళీ తక్కువిచ్చినా నమ్మేశాడు..వెర్రోడు అనుకుంటా.. " అనుకుంటావు, కానీ అవతలివాడు నిన్ను మోసం చెయ్యలేదని నీకు నమ్మకం ఉండదు, ఎవరినీ నమ్మవు, నమ్మలేవు. నిన్నెంతో ఇష్టప్డేవాళ్ళపై కూడా నీకు అనుమానంగానే ఉంటుంది. సంబంధాలు చెడిపోయేదాకా తీసుకెల్తుంది. మనస్సాక్షికి సమధానం చెప్పడం ఆంటే, సంజాయిషీ ఇవ్వడం కాదు, నిజాన్ని బయట ఎవరికీ చెప్పకపోయినా నీకు నువ్వు చెప్పుకోవడం. ఇక రావణుడి గురించి నువ్వు చెప్పింది. నేను చెప్పిందీ అదే. మనం వాళ్ళని ఎలా పోర్ట్రైట్ చేస్తామో మన తర్వాతి తరమూ అలాగే తీసుకుంటుంది. పుడుతూనే ఎవరూ రాముడినీ కానీ , రావణుడిని కానీ ఆదర్శంగా తీసుకోరు. మనం రామారావు సినిమాలు చూపిస్తే వాడికి కచ్చితంగా నువ్వన్న ఫీలింగే కలుగుతుంది. అదే నువ్వు రామాయణాన్ని ఉపాసన చేసిన వాళ్ళ మాటలు చెప్తే వాడికి రావణుడి దౌర్భాగ్యం అర్ధమవుతుంది.
నువ్వన్నావే ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేసాడని, కానీ రామాయణం నిజంగా అర్ధమైతే నువ్వు ఆ మాట చెప్పవు.
ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి తాను రాక్షసుడిని కాబట్టి, ఒక స్త్రీని ఎత్తుకురావడం తనకు ధర్మమే అని సమర్ధించుకున్న వాడు ఏ రకంగా సమాజానికి ధర్మప్రాయుడవుతాడొ నువ్వే చెప్పాలి.
తన తలనే ఆహుతి చేసి బ్రహ్మను మెప్పించిన ఒక గొప్ప తపశ్శాలి, కైలాసాన్ని చెణకబోతే, ఎడమకాలి బొటనవేలితో నొక్కి అణిచివేసాడు ఈశ్వరుడు, అతని సామర్ధ్యం గురించే మాట్లాడుకోవాలి మరి.
ఒక ఆడపిల్లని అల్లరి పెట్టబోతే, "ఇష్టం లేని ఆడదాని జోలికి పోతే పోతావని" బ్రహ్మ గారిచ్చిన శాపాన్ని మరుగున పెట్టి, సీతా నీ అంత నువ్వు నన్ను ప్రేమించాలి అందుకే నేను నిన్ను బలవంతం చెయ్యట్లేదు అని కారుకూతలు కూసిన వాడి సత్యసంధత గురించే మాట్లాడుకోవాలి.
ఒక కోతి తన లంకా పట్టణలోకి వచ్చి అల్లకల్లోలం చేస్తే , ఎలాగోలా పట్టుకొచ్చి సభలో నిలబెడితే , రావణుడికి కోపం బదులు భయం వేసింది. ఇంతకుముందు వాడు చేసిన వెధవపనికి శాపమిచ్చిన నందీశ్వరుడే ఎదురుగా నిలబడ్డాడేమో అని భయపడ్డాడు. హనుమకి శత్రు స్థలం. రావణుడికి స్వస్థలం. అయినా రావణుడు భయపడ్డాడు, హనుమ చెప్పదలచుకున్నది నిర్భయంగా చెప్పారు. ఎందుకు తన ఊరైనా రావణుడు భయపడ్డాడు, ఎందుకు శత్రుస్థలమైనా హనుమ భయపడలేదు, చెప్పు?
నువ్వన్న ఆ ఎంజాయ్మెంట్ అనేదాని అర్ధాన్ని మార్చేస్తున్నారు, అది గమనించమంటున్నా, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? పక్కవాడి సొమ్ము దోచుకోవడమా, బలహీనులని చంపడమా, ఇష్టమైన వాళ్ళని ఎత్తుకొచ్చెయ్యడమా? వీటిల్లో ఏది ఎంజాయ్మెంట్ చెప్పు? రావణుడు చేసిన పనుల్లో ఇవి కాక వేరేమైనా ఉన్నాయా?
రాముడిలా ధర్మం కోసం రాజ్యాన్ని వదులుకున్నాడా? లేదే పైగా తమ్ముడి రాజ్యాన్ని లాక్కున్నాడు.
తనకోసం ప్రాణాలు వదిలిన జటాయువుకి, ఒక తండ్రికి కొడుకు చేసినట్టుగా కర్మకాండ చేసి ఊర్ధ్వలోకాలకు పంపాడు రాముడు. మరి రావణుడు, యుద్ధంలో చనిపోయిన సైనికుల సంఖ్య తెలిస్తే తర్వాతి రోజు యుద్ధానికి భయపడతారని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మొసళ్ళకు ఆహారంగా వేసాడు. ధర్మం చెప్పినందుకు తమ్ముడిని చంపుతానన్నాడు.
బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సంధ్యావందనం చేసి వేదం చదవవలసినవాడు, సీతమ్మ పట్ల కామమోహితుడై సరాసరి అశోకవనానికి వచ్చాడు రావణుడు. అడవిలో ఉన్నా, ఒకరు అడిగేవాడు లేకున్నా, పరంపరానుగంతంగా వస్తున్న ఆచార వ్యవహారాలను స్వచ్చంధంగా పాటించిన వాడు రాముడు.
ఆవేశంతో సుగ్రీవుడు రావణుడి మీదకు ద్వంద్వ యుధ్ధానికి వెల్తే, సుగ్రీవా, నీకేమైనా అయ్యుంటే ఎలా? నువ్వు చనిపోతే నేను ఎవరికోసం పోరాడటం, నా మిత్రుణ్ణి పణంగా పెట్టి నా భార్యను సాధించుకోలేను, నేను యుద్ధమే చెయ్యలేనన్నాడు రాముడు. మరి రావణుడో, వెల్తే నేను చస్తాను, నా తర్వాత నువ్వూ నీ లంకా పట్టణమూ మొత్తం సర్వనాశనమవుతుంది అని మారీచుడు చెప్పినా వినలేదు, వెల్లకపోతే ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. అన్నీ వున్నా ప్రశాంతంగా నిద్రకూడా పోలేకపోయాడు, ఏమీ లేకపోయినా సత్యాన్ని, ధర్మాన్ని తప్పకుండా ప్రయాణించాడు రాముడు,
దేన్ని సుఖజీవితం అని బోధిస్తావ్? ఒక్క రామబాణంతో చచ్చాడు అని నువ్వన్నావే, లోకాలని ఏడిపించిన రావణుడు అక్షకుమారుడు చనిపోయిన రోజున ఏడిచింది నీకు తెలుసా, చేతికందొచ్చిన కొడుకు ఇంద్రజిత్ చనిపోయిన రోజున వాడికేమనిపించి ఉంటుందో నీకు తెలుసా, చచ్చిపోయే ముందు కట్టుకున్న భార్య, ఎన్నడూ తనని అధిక్షేపించకుండా అనుగమించిన భార్య వచ్చి "రావణా! నిన్ను చంపింది రాముడనుకుంటున్నావా, నిన్ను చంపింది మితిమీరిన నీ ఇంద్రియ వ్యామోహమే అని దెప్పిపొడిచిననాడు, వాడు ఎంత కుళ్ళి కుళ్ళి ఏడిచి ఉంటాడో ఊహించు, అది చెప్పి చూడు తర్వాతి తరాలకి, అప్పుడు కూడా ఎవరైనా రావణుడే మాకాదర్శం అంటే దండేసి దండం పెడతా నీకూ,వాడికి
Thursday, April 14, 2011
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Very well said!
అద్భుతంగా చెప్పారు
Post a Comment