హనుమద్రక్షాయాగం-౨(2)
“సకలప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతియై యుండు సూక్ష్మకళుండచ్యుతుడయ్యెడన్ విరటజా గర్భంబు దా జక్ర హస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్ధియై యడ్డమై ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్” అని పోతన గారిచే కీర్తించబడ్డ స్వామి కదా ఆయన, నా మనసులోని విషయం తెలుసుకొని ఇలా చూపించారేమో అని అనిపించింది.
http://newjings.blogspot.com/2011/04/blog-post.html
(కొనసాగింపు)
జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
దక్షిణదిశగా చూస్తూ సాక్షాత్తూ దక్షిణామూర్తిగా కనపడ్డారు స్వామి ఆ సమయంలో. ఆ తర్వాత చుట్టూ ఉన్న పరిసరాలను చూసాను. స్వామికి కొంచెం వెనక పడమర దిక్కుని చూస్తూ మహా గణాధిపతి సింహాసనారూఢుడై ఉన్నాడు.
అమ్మవారి కళలన్నింటినీ నింపుకుని మహా సుందరంగా కనపడ్డాడు. పదకొండు, పన్నెండు ఏళ్ళ పిల్లలు కొంతమంది చాలీసా చదువుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు, కొంతమంది పూలు కోస్తున్నారు. కొంతమంది పూజా సంభారాలు ఒక పళ్ళెంలో సమకూరుస్తున్నారు. ఒకరు అభిషేకానికి బిందెలతో నీరు తెచ్చారు. పిల్లలు కాషాయవస్త్రాలలో మెడలో రుద్రాక్షలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో. అప్పటికి సమయం అటూ ఇటుగా ఏడవుతోంది. వెంటనే మాస్టరుగారు స్నానాదికాలు త్వరగా పూర్తిచేసుకుని రమ్మన్నారు. అన్నీ పూర్తి చేసుకుని ప్రదక్షిణలు చేసి మాస్టరుగారిచ్చిన కాషాయవస్త్రం కట్టుకుని స్వామి ముందు కూర్చున్నాను. అప్పటికి ఇంకా నా స్నేహితుడు రాలేదు. నిలబడితే ఒకమాదిరి హైటుగా కనపడుతున్న స్వామి, కూర్చున్నాక ఇంకా ఎత్తుగా, లంకను దాటడానికి ఉద్యుక్తుడైనప్పుడు ఇంతే ఎత్తుగా పెరిగారేమో అనిపించేలా కనపడ్డారు. ఆచమనం చేసి పూజ మొదలుపెట్టాము. నాచేతే అభిషేకం చేపించారు మాస్టరుగారు. నా చేతులతో ఆ స్వామికి అభిషేకం, అసలు కలలో కూడా అనుకోలేదు.
అభిషేకజలాలు స్వామిని ఆపాదమస్తకమూ తడుపుతూ ఉంటే కిరీటం మీదుగా, పింగళాక్షుడైన స్వామి కనురెప్పలను తాకుతూ, సింధూర వర్ణంలో మెరుస్తున్న చెంపలను తడుముతూ, ఆ రామచంద్రస్వామి పాదపరిమళాన్ని ఆఘ్రాణించే స్వామి నాసాగ్రాన్ని అలా తాకుతూ, వేదవిదుడైన ఆ రామమూర్తిని నిరంతరం కీర్తించే పెదవులమీదుగా , ఆ రామనామాన్ని నింపుకున్న కంఠం మీదుగా జాలువారుతూ, గుండెల్లో ఉన్న రాముడికి ఆనంద స్నానం చేస్తూ, సంజీవని పర్వతాన్ని సునాయాసంగా ఎత్తిన చేతులమీదుగా , బలిష్టమైన పిక్కలమీదుగా, స్వామి పాదాల మీదుగా అలా నేలని చేరిపోతున్న దృశ్యం తలచుకుంటే ఇప్పటికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఆనందం ఎన్ని కోట్లు పెడితే దొరుకుతుంది చెప్పండి? తర్వాత శుభ్రమైన వస్త్రంతో స్వామిని శుభ్రపరిచి, పూలు సమర్పించాము. ఇంతలో నా స్నేహితుడు వచ్చాడు. తనని స్నానం చేసి రమ్మని మేము మళ్ళీ పూజలో పడ్డాము. దీపం వెలిగించి ధూపం వేసాము. తర్వాత గోత్రనామాలు పంపిన వారి పేర్లన్నీ అనుసంధానం చేసి, తర్వాత అష్టోత్తరం చదివాము.
సామూహికంగా అంతమందిమి అష్టోత్తరం చదువుతుంటే,
ఒక నామం వింటుంటే రామదర్శనానంతరం ఆనందనిమగ్నుడై రామలక్ష్మణులను భుజాలకెత్తుకున్న స్వామి గుర్తొచ్చారు. ఒక నామం వింటే శ్రీ రామ సుగ్రీవ సంధానం చేసిన ఆయన బుద్ధికుశలత గుర్తొచ్చింది. ఒక నామం వింటే ధృతితో ఆయన చేసిన సాగరలంఘనం, మరొక నామం వింటే లక్ష్యంపై దృష్టితో ఆయన చేసిన మైనాక నిరసన, ఇంకోనామం వింటే అద్భుతమైన బుద్ధిబలం(మతి)తో ఆయన సురసను గెలిచిన విధానం, మరోనామంలో అమేయ భుజబలంతో(దాక్ష్యం) సింహికను భంజించిన విషయం, ఇలా హనుమచ్ఛరిత్ర , శ్రీమద్రామాయణమనే మాలకి రత్న సదృశుడైన హనుమ వైభవం గుర్తొచ్చి మహదానందం కలిగింది.
ఏనాడైనా కలగన్నానా, ఆ స్వామి ముందు నిలబడి ఇలా చదవగలనని? ఈ రోజుకి తీరింది ఆ ఆనందం. తర్వాత స్వామికి ఇష్టమైన అరటిపళ్ళని నివేదన చేసి చాలీసా పారాయణ చేసాను. తర్వాత గుడి ముందుకి వెళ్ళాము. వేంకటేశ్వరస్వామి, అమ్మవారు, మహా శివుడు మహా దర్జాగా ఆసీనులై ఉన్నారు. బయట దత్తాత్రేయులవారు, కుమారస్వాములవారు, అయ్యప్పస్వామి వారు ఉన్నారు. వారికి నమస్కరించుకుని లోనికి వెళ్ళాము. అమ్మ, విజయవాడ దుర్గమ్మ లా చిరునవ్వుతో, కంటిచూపుతో సమస్తలోకాలనూ పోషించే మీనాక్షీ దేవిలా, తన మేని వెలుగుతో సమస్త లోకాలను దీపింపజేస్తూ, తనతాటంకాల మహిమతో మన్మధుడిని శివుడి మీద ప్రతీకారం తీర్చుకునేలా చేసిన అమ్మ దర్శనమిచ్చింది. చక్కని పట్టుపుట్టం కట్టుకుని చేత త్రిశూలం ధరించి, దుష్టులను శిక్షిస్తూ, భక్తులను రక్షించే తల్లి ఇంద్రకీలాద్రి మీద దూరంగా కనపడిన తల్లి, నేడు ఎదురుగా రెండు ఆడుగుల దూరంలో దర్శనమిచ్చింది. ఆ పక్కన వేంకటేశ్వరస్వామి, ఈ పక్కన శంకరుడూ కనపడి నా జన్మ ధన్యం చేసారు.
అంతలో మా ఫ్రెండ్ వచ్చాడు. అమ్మవారికి దణ్ణం పెట్టుకుని యాగశాలలోకి ప్రవేశించాము. యాగం పూర్తి చేసి ప్రసాదం స్వీకరించాము. చక్కటి ఉప్మా అల్పాహారం తీసుకుని కొంచెం సేపు మాట్లాడుకున్నాము. తరువాత పిల్లలగురించి అడిగితే చెప్పారు. ఈ నలభై మంది పిల్లలకి మాస్టరుగారు దీక్షనిప్పించి వారే భోజనాదులు చూసుకుంటున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. స్కూలు చూస్తే పెద్ద స్కూలేం కాదు, అక్కడ చేరిన పిల్లలలో ఇవ్వలేని వాళ్ళ దగ్గర ఫీజులు కూడా వసూలు చెయ్యరు వారు, పైన పీఠం నిర్వహణ, వీటికయ్యే ఖర్చు ఎలాగా అని ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పినమాటల్లో నాకు శరణాగతి అంటే ఏమిటో మొదటిసారి కళ్ళ ఎదుట కనిపించింది. ఏ శక్తిని నమ్ముకుని ఆయనని పదేళ్ళనుండి లాభాపేక్ష లేకుండా పిల్లలకు విద్య నేర్పిస్తున్నారో, ఏ శక్తిని నమ్ముకుని ఈ హనుమద్రక్షాయాగాన్ని మొదలుపెట్టారో, ఆ శక్తినే తలచుకుని ఈ సారి హనుమద్రక్షాయాగాన్ని మరింత నియమనిష్టలతో చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే ఎలాగైనా సుందరకాండని చదవాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మాస్టరుగారు తమదగ్గరున్న అన్నదానం చిదంబరశాస్త్రి గారి పుస్తకాలిచ్చారు. అవే మేము హిందూ ధర్మ సర్వస్వం అనే బ్లాగులో ప్రచురిస్తున్నాము.
తర్వాత భోజనాలు చేద్దామన్నారు. అప్పుడే తెంపిన అరటిఆకులో చల్లని చెట్లకింద నలభై మంది బాలస్వాములతో కలిసి భోజనం చేసాము. ఆచమనం చేసి భోజనం స్వీకరించాము. తర్వాత హనుమ వైభవం గురించి మాట్లాడుకున్నాము. పీఠం ఎలా కట్టినదీ వివరించారు. చెప్తున్నప్పుడు ఆ తల్లి మహిమలకు సాక్షిగా నిలిచిన ఆయన ఆనందం మాకు వింతగా కనపడింది. ఇంతగా భగవంతుడితో మమేకం అవ్వడం సాధ్యమా అన్న విషయం మీద మాకు ఉన్న సందేహాలు తొలిగిపోయాయి. తర్వాత ఆ పిల్లలతో ఆడుకున్నాము. ఒకపిల్లవాడుండేవాడు గణపతి అని, మరి అతని పేరు అదేనో, లేక తనని చూసి నవ్వుతాలికి అలా పిలిచేవారో తెలియదు కానీ, మనిషి గుండులా భలే ఉండేవాడు. ఏదన్నా అడిగితే వెంటనే చేసేవాడు. ఇలాగే మిగతా పిల్లలతో కలిసి పెద్ద ఆరిందాల్లా ఖోఖో ఆడాము. పదేళ్ళ పిల్లలు వాళ్ళు, ఇరవైయైదేళ్ళు మాకు. వాళ్ళతో ఎక్కడ పోటీ పడగలం? అప్పటికీ పరిగెట్టాం, అందినట్టే అంది పాదరసంలా పారిపోతున్నారు. చివరికి ఎలానో ఒకళ్ళని పట్టుకున్నాం. తరవాత మమ్మల్ని పరిగెట్టమనేసరికి కాలు బెనికేలా పడ్డాను. అంతే, గేం ఫినిష్. కూర్చుని అడే ఆటలు ఆడదామని ప్రపోజల్ పెట్టను. ఇలా ఒకగంట , రెండు గంటలు ఆడాము, ఒకరిద్దరు తప్ప అందరూ మాతో కలిసిపోయారు.
ఇక అక్కడినుండి వాళ్ళు చెప్పే మాటలు వినడానికి అసలు సమయమే సరిపోలేదు. ఒకపిల్లవాడు అన్నయ్యా, నాకు “ఆదిశేషా,అనంతశయనా” పాటవచ్చు, పాడతాను వీడియో తియ్యవా అని అడిగాడు, ఇలా అందరూ ఎవరికి తోచిన పాటలు వాళ్ళు పాడతాం ,రికార్డ్ చెయ్యమని కూర్చున్నారు. సరే రేపు తీరిగ్గా కూర్చుని రికార్డ్ చేస్తాలే అని సాయంకాలం పూజకి తయారయ్యాము. సాయంత్రం కూడా పూజ చేసి అమ్మవారి ముందు భజన చేసారు. మాస్టరు గారే పిల్లలందరికీ భజనలు నేర్పించి వాళ్ళచేత దసరాకి భజన చేయించేవారు. వాళ్ళ ఊళ్ళో ఈ పిల్లల భజన ని చాలా ఇష్టంగా చూస్తారట. అన్నయా ఈసారి దసరాకి మా ఊరికి రండి, దసరా చాలా బాగా చేస్తారు అని అందరూ చెప్పడమే. అలా భజన పూర్తి చేసి అమ్మకి లాలి పాడి నిద్రపుచ్చి భోజనాలు చేద్దామనుకునేసరికి కరెంట్ పోయింది. సరే అని పిల్లలకి సుందరకాండ చెప్పడం మొదలుపెట్టాను. బోరు కొడుతుందేమో అనుకున్నాను. కానీ ఎంత ఆసక్తిగా విన్నారో. నాకే ముచ్చటేసింది. స్వామి పెరిగినప్పుడు, లంకలో చిన్నవాడై వెతికినప్పుడు, అమ్మ అధిక్షేపిస్తే మేరునగసమానుడై అమ్మకి ధైర్యం చెప్పినప్పుడు కళ్ళు ఇంతింత చేసుకుని ఎంత బాగా విన్నారో. తర్వాత భోజనాలు చేసి నిద్రపోయాము. తర్వాత రోజు పిల్లలు ఇక అసలు వదలలేదు మమ్మల్ని, మామిడి చెట్లకింద కూర్చుని వాళ్ళకొచ్చిన అన్ని పాటలు పాడి మా చేత రికార్డ్ చేయించారు. ఆ పిల్లలే మా ఇద్దరినీ కొండ గురునాధస్వామి దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేయించారు.
తర్వాత నేను వెళ్తుంటే అన్నయ్యా మళ్ళి వస్తావా అన్నయ్యా, దసరాకి తప్పకుండా రా అన్నయ్యా అని మరీ మరీ అడిగారు.
తర్వాత నేను పూణె వెళ్ళి వృత్తిలో నైపుణ్యాన్ని అలవర్చుకున్నాను. స్వామి దయవలన భాగవతం కొన్నాను. చదివాను. సుందరకాండ పారాయణం చేసాను, ఇంట్లో డబ్బు సమస్య వదిలి కొత్తగా మొదలుపెట్టిన ఇల్లు పూర్తయ్యింది. చాలా సందర్భాల్లో మాస్టరుగారు నాకు నైతికస్థైర్యానిచ్చారు.ఇదంతా ఆ స్వామి మహిమే అని నా నమ్మకం, వెనక్కి తిరిగి చూసుకుంటే నాలో అపనమ్మకాన్ని పోగొట్టడానికి ఆ స్వామి ఆడిన నాటకం ఈ యాగం అనిపిస్తుంటుంది ఇప్పుడు.
రెండవసారి కూడా వెళ్ళాను. వారిలో కొంతమంది పిల్లలు పాతవాళ్ళే. నన్ను గుర్తుపెట్టుకుని అన్నయ్యా అని అల్లుకుపోయారు. రెండురోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. కానీ ఈసారి నేనొక్కడినే. నా స్నేహితుడు హనుమజ్జయంతికి వస్తానన్నాడు, నాకు ఆ సమయంలో సెలవు లేని కారణంగా వెళ్ళలేకపోయాను.
విచిత్రమేమిటంటే, రెండుసార్లూ కూడా నేను హనుమజ్జంయంతికి వెళ్ళలేకపోయాను, సరే పెళ్ళయ్యాక ఇద్దరము వెల్దాం అనుకున్నా. ఏమో పైన స్వామి దయ.
ప్రభుత్వం కొత్తగా స్కూళ్ళ గుర్తింపు గురించి విధించిన నియమనిబంధన ల మూలంగా ఈ విద్యాసంవత్సరం మాస్టరుగారు స్కూల్ మూసేసారు. రేపూ మేమిద్దరం వెల్తాం. కానీ అక్కడ ఆ పిల్లలు ఉంటారా, ఇంద్రజిత్తు కొట్టిన దెబ్బలకి హనుమ ఒక్కడికే దెబ్బలు తగలలేదు అని చెప్పినప్పుడు నిజమా అన్నయ్యా, అని చెప్పి ఆ స్వామి మూర్తిని తదేకంగా చూస్తూ అలా ఉండిపోయే ఆ పిల్లలు మళ్ళీ మాకు కనపడతారా? వాళ్ళ ఊరు గురించీ, కొండగురునాధస్వామి గురించీ, ఎంత బాగా చెప్పేవాళ్ళో. అన్నయ్యా మళ్ళీ వచ్చినప్పుడు మాకు సుందరకాండ మొత్తం ఒకరోజంతా చెప్పాలని అమాయకంగా అడిగే ఆ పిల్లలు లేకుంటే ఏదో వెలితిగా ఉంటుంది. ఆ స్వామినే అడగాలి.
Thursday, April 14, 2011
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
దుర్గేశ్వరగారు ఎంత బాధపడి ఉంటారో స్కూలు మూయవలసివచ్చినప్పుడు!
మనోహర్
నిజంగా మనసుపెట్టి పూజచేస్తే ఎలా తన్మయత్వం కలిగి భగవ్త్ భావనలో లయమవుతామో నిన్నుచూసి నేర్చుకోవాలి. చిన్నవాడివయినా నిన్ను ఆదర్శంగా తీసుకోక తప్పదు.
Post a Comment