Tuesday, April 12, 2011

హనుమద్రక్షాయాగం:



హనుమద్రక్షాయాగం: (2009) మొట్టమొదటిసారి నేను హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం చాలా చిత్రంగా జరిగింది. నా స్నేహితుడొకడు చెన్నై లో ఉండేవాడు. తన బ్లాగులో హనుమద్రక్షాయాగం పోస్టర్ ఉంచాడు. చూసాను, పెద్దగా పట్టించుకోలేదు. నలభైరోజులపాటు, పదకొండు సార్లు చాలీసా పారాయణం చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, ఇంట్లో మా వదిన ఉంటుంది, నలభై రోజులు కంటిన్యుయస్ గా అంటే కుదరదులే అని వదిలేసాను. కానీ ఎక్కడో మనసులో ఒక మూల అవమానంగా ఉండేది. స్వయంగా హనుమే అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నానన్న బాధ ఉండేది. కొన్ని రోజులు పోయాక ఒకసారి ఆ చెన్నై స్నేహితుడికి ఫోన్ చేసాను. ఎలా సాగుతుంది నీ పారాయణం అని అడిగాను. ఏదో సాగుతుంది, హాస్టల్లో కుదరదుకదా, కుదిరినప్పుడు చేస్తున్నా అన్నాడు. దానికి నేనుండి “అలా కాదురా మన్స్ఫూర్తిగా ఆ స్వామి మీద భారం వేసి చెయ్యాలి అని సంకల్పించుకోరా, ఏ అడ్డు రాదు అని చెప్పాను. నువ్వు నేను చేస్తున్నాను అనుకుంటే పూర్తి చేసే బాధ్యత కూడా నీ మీదే పెడతాడు, అలా కాకుండా సంపూర్ణంగా శరణాగతి చేసి చూడు అప్పుడు ఏ అడ్డంకీ ఉండదు”. ఇలా ఒక అరగంట మాట్లాడి ఫోన్ పెట్టేసాను, పెట్టేసాను కానీ ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. శరణాగతి గురించి తనకి చెప్పాను కానీ నాకు ఆ శరణాగతి చేసే బుద్ధి ఉందా అని ఆలోచించాను. ఒకరికి చెప్పే ముందు చేసి ఆచరించాలి కదా అని నా మనసు వెక్కిరించింది. ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని భగవత్కార్యం తప్పించుకుంటున్నానేమో అనిపించింది. సరే అని అప్పుడు తెల్లవారగానే దుర్గేశ్వర గారికి ఫోన్ చేసాను, “స్వామీ మరి సగం దీక్షాసమయం అయిపోయింది, ఇప్పుడు చెయ్యవచ్చా, గోత్రనామాలు పంపమంటారా” అన్నాను. “అయ్యో తప్పకుండా పంపండి, మంచి పనికి ఆలస్యంలేదు, ఇప్పుడైనా మొదలుపెట్టండి, ఏ భయాలు పెట్టుకోకుండా సర్వం ఆ స్వామి మీద పెట్టి మీరు పారాయణ చెయ్యండి, “ అన్నారు.

మొదలుపెట్టాను, పెద్ద పూజ ఏమీ చెయ్యలేదు కానీ రోజూ ధూపం వేసేవాడిని, చాలీసా పారాయణం చేసేవాడిని, అంతే, ప్రదక్షిణలు చెయ్యడం మనవల్ల కాదులే అని చెయ్యలేదు. చాలీసా మాత్రం క్రమం తప్పకుండా ఆ పదిరోజులూ చేసాను. హనుమజ్జయంతికి ఇంకా నాలుగైదు రోజులుందనగా నా స్నేహితుడు ఫోన్ చేసి పూర్ణాహుతికి వెల్దామా అని అడిగాడు, జయంతి మంగళవారం రోజు. శనివారం, ఆదివారం ఉందాములే అని నేనూ వస్తాననీ చెప్పాను, పైగా తనని కూడా కలవచ్చులే, ౨౦౦౬ (2006) లో కాలేజీ అయిపోయిన తర్వాత మూడేళ్ళపాటు మళ్ళీ కలవలేదు. మేమిద్దరము, ఇంకొక నరసరావుపేట అతను ఒకే గదిలో ఉండేవాళ్ళం. చాలా సరదాగా, సన్నిహితంగా ఉండేవాళ్ళం. నాలుగేళ్ళు ఏ పొరపొచ్చాలు లేకుండా గడిపాం. అలాంటిది కాలేజీ తర్వాత మూడు సంవత్సరాలు కలవలేదు. ఎన్నో సార్లు నేను చెన్నై వెల్దామనుకున్నా కుదరలేదు, తను హైద్రాబాద్ కి వద్దామన్నా కుదరలేదు, ఒకట్రెండు సార్లు వచ్చినా కలవడం కుదరలేదు. ఇక మళ్ళీ కలవలేమేమో అని కొద్దిగా భయం వేసింది. కానీ ఈ యాగం ఫలితమా అని ఇప్పుడు కలవబోతున్నా. కొంచెం ఆశ్చర్యమనిపించింది. చదివింది చాలీసా నే కానీ అది సుందరకాండ సదృశమని చాలామంది నమ్మకం, తులసీదాసు వారే ఈ మాట అన్నారని ఎక్కడో విన్నాను. నిజానిజాలు తెలియవు.

సుందరకాండ చదివితే బంధు హిత సమాగమం జరుగుతుందని తెలుసు. కానీ ఇంత సద్యఃఫలితంగా కనపడుతున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాలేదు.ఎలాగైనా యాగానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అప్పటికప్పుడు వినుకొండ కి టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరాను, ఏమీ ప్లానింగ్ లేదు, వెళ్ళిపోయాను. నలభై రోజులూ చేసిన వాళ్ళలో చాలామందికి యాగం లో పాల్గొనే అదృష్టం దొరకదు/నిజానికి దొరకలేదని చెప్పాలి. అలాంటిది నేను చేసినది పాక్షికంగానే ఐనా స్వామి రప్పించుకుంటున్నారు అని ఒక పక్కన ఉన్నా, మరో పక్క ఎవరూ తెలియదు అక్కడ, నేను చేస్తున్నది కరెక్టేనా ముక్కూ, ముఖం తెలియని ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వెల్తున్నానపించింది (అప్పటికి మాస్టరుగారు నాకు పెద్దగా తెలియదు). అటు చెన్నై నుండి నా స్నేహితుడు కూడా బయలుదేరానని ఫోన్ చేసాడు. అంతే! ఇక ఏ సందేహం పెట్టుకోకుండా బయలుదేరమని స్వామి చెప్పినట్టనిపించింది. ఏదైతే అదే అవుతుంది పైన ఆ స్వామే ఉన్నారని బయలుదేరాను. ఆ స్వామి చెయ్యలేనిదేముంది, ఇక పీఠం గురించి నేను ఊహించింది వేరు, ఏదో చిన్న గుడి, ఒక యాగ శాల ఉంటుందేమో అనుకున్నాను.(అప్పటికి నాకు పీఠం గురించిన వివరాలు పెద్దగా తెలియవు. ) ఆ స్వామిని చూడచ్చు, నా స్నేహితుడిని కలుస్తున్నానన్న అనందంలోఉండగానే తెల్లవారుఝామున వినుకొండలో దిగాను. అక్కడినుండి ఉల్లగల్లు దరిశి బస్సు ఎక్కి రవ్వవరం అని చెప్పాను. ఏ స్టాప్ వచ్చినా ఇదేనా రవ్వవరం అని అడగడం, వాళ్ళు కాదు బాబూ, వస్తే చెప్తాములే అని అనడమూ, ఇలా ఒక అరగంట గడిచేలోపు కుడివైపు ఆంజనేయస్వామి కనపడ్డారు. మూడు నాలుగు అడుగుల మూర్తి రూపంలో ఉన్నారు.

పక్కనే ఏదో బోర్డ్ మీద రవ్వవరం అని చూసాను, వెంటనే దిగాను. సరాసరి ఆంజనేయస్వామి కనపడిన దగ్గరికి వెళ్ళాను. అడిగాను ఇక్కడ దుర్గేశ్వర గారని జగన్మాత పీఠం అని . వారుండి ఇక్కడకాదు, ముందే దిగాలి కదా అన్నారు, ఏదో అపశకునంలా అనిపించింది. వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉన్నారు వెళ్ళండి అని వాళ్ళ ఇంటికి పంపారు. ఆయన నన్ను పీఠం దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి నేనూహించుకున్న దానికి అక్కడ కనపడుతున్న పీఠానికి నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. నమ్మలేకపోయాను. పచ్చటి పంట పొలాల మధ్యలో, అడపా దడపా రోడ్డున వచ్చిపోయే వాహనాలు తప్ప మరే గోలా లేని ప్రశాంతమైన వాతావరణంలో, చుట్టూ అరటిచెట్లూ, పూలచెట్లూ, మామిడిచెట్లూ, ఇలా రకరకాల చెట్లతో చాలా అందంగా ఉంది ఆ స్థలం. ఇక హనుమ మూర్తి అయితే సాక్షాత్తూ పరాశరసంహితలో ఎలాగైతే అరటిచెట్ల మధ్యలో ఉపాసించాలన్నారో , అలాగే చుట్టూ అరటిచెట్లూ, మధ్యలో ఆకాశాన్నంటేలా ఉన్న హనుమ , పాదాల దగ్గర, అభిషేకాదులకోసం మరో చిన్న మూర్తి కొలువై ఉన్నారు. అరటి తోటలో స్వామిని ఉపాసన చెయ్యాలి అని మొదటిసారి విన్నప్పుడు , ఎవరికి కుదురుతుంది ఇల చెయ్యడం అని అనుకున్నాను. కానీ “సకలప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతియై యుండు సూక్ష్మకళుండచ్యుతుడయ్యెడన్ విరటజా గర్భంబు దా జక్ర హస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్ధియై యడ్డమై ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్” అని పోతన గారిచే కీర్తించబడ్డ స్వామి కదా ఆయన, నా మనసులోని విషయం తెలుసుకొని ఇలా చూపించారేమో అని అనిపించింది.







(మిగతాది మరికొద్దిసేపట్లో)

1 comment:

రాఘవ said...

తరువాతి భాగం కొఱకు...