Tuesday, October 5, 2010

కాలంలో ప్రయాణం (పరమాత్మతో ఒక ఉదయం)

జై శ్రీ రామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!

తెల్లవారింది.
చూడగలిగిన కన్నున్నా, చూడడానికి కావలసిన వెలుతురునివ్వడానికి ఆ పరాత్పరుడి ఆజ్ఞతో సూర్య భగవానుడు ఉదయించాడు.
రామచంద్రమూర్తిని పూర్వజన్మ సుకృతం చేత తన గర్భంలో పన్నెండు నెలలు ఉంచిన కౌసల్య లా,కృష్ణుడిని కడుపులో మోస్తున్న దేవకిలా మా వదిన ఎదురు వచ్చింది.
చిన్ని కృష్ణుడు నందవ్రజం లో కి వచ్చిన రాక్షసులని తుడిచిపెట్టి మోక్షం ఇచ్చినట్టు, మా వదిన ఇంట్లో మాలిన్యాన్ని ఊడ్చి దాని గమ్యస్థానానికి చేర్చేసింది.
భగీరధుడి తపస్సుకి మెచ్చి వస్తున్న శివ జటాజూట నిర్గమ గంగాఝరికై అమరులూ,నరులూ,మునులూ పరువెత్తినట్టు , మంజీర నీళ్ళు పట్టుకోవడానికి పరువెత్తాము.
విశ్వామిత్రుడికే కాదు, సమస్త సైన్యానికి భోజనం సమకూర్చగల కామధేనువులా మా వదిన అల్పాహారం తయారుచేసింది.
అంతం లేని దుష్టశిక్షణను అలుపెరగకుండా చేసే ఆ పరమాత్మ లా , రోజువారీ కాలకృత్యాలను తీర్చుకున్నాను.(ఆయనకి అది తప్పదు, మనకు ఇవి తప్పవు).

తన చిరునవ్వనే లోక శుభంకర ధూపంతో జన్మాంతర వాసనలను పావనం చేసే ధూర్జటికి ధూపం వేసాను.
తన కంటివెలుగనే దీపపు కాంతిలో అజ్ఞాన తిమిరాన్ని పారదోలే దక్షిణామూర్తికి దీపం పెట్టాను.
ఆయన పెడితే తినే మనలాంటి వాళ్ళలో కొంతమంది , నేను పెడతాను ఇవ్వాళ నీకు తిను అంటే తిని మురిసిపోయి , వాళ్ళని మురిపించిన కాళహస్తీశ్వరుడికి,కృష్ణ పరమాత్మ కి నైవేద్యం సమర్పించాను.
తన ఇంటికి వడిచి వస్తే, వచ్చినందుకు పొంగిపోవడం తర్వాతి మాట, ఎంత అలసిపోయావో అని భక్తులు ఆరాటపడ్డట్టు, ఎక్కడ నా దిష్టి తగులుతుందో అని నీరాజనం ఇచ్చాను.
ఆ స్వామి అనుగ్రహ ప్రసాదంగా అల్పాహారం తిని ఆఫీస్ కి బయలుదేరాను.
చెప్పులు వేసుకుంటుంటే నిశ్శబ్దంగా అవి భరతుడిననుగ్రహించిన రామపాదుకలను మనసులో పెట్టుకోమని హెచ్చరించాయి.
ద్వాపరంలో వ్యాసుడి ద్వారా పాండవులనీ, కలియుగంలో Ms.సుబ్బలక్ష్మి ద్వారా మన లాంటి వారిని అనుగ్రహించడానికి భీష్ముడి చేత ఆ స్వామి పలికించిన విష్ణు సహస్రనామం వింటూ బయలుదేరాను.
బయట అడుగుపెట్టగానే ఆకుపచ్చని పట్టుచీర కట్టుకుని, తెల్లని పూలు కొప్పున పెట్టుకుని, బిడ్డలాంటి హనుమని చూస్తున్న శుచిస్మిత అయిన సీతమ్మ లా ఒక చెట్టు ఆశీర్వదించింది.
గజేంద్రుడిలాంటి భక్తుల్ని కాపాడడానికి పరిగెత్తే ఆర్తత్రాణపరాయణుడి వేగంతో సరిసమానంగా కలిపురుషుడి అస్తిత్వాన్ని కాపాడడానికి నా తరం అంతా పరుగులు పెడుతోంది.
లింగంపల్లి బస్ స్టాప్ కి వెళ్ళేసరికి ఇక్కడ విష్ణు సహస్రం లో మణి మౌక్తిక సైకతాలతో క్షీరోధన్వత్ప్రదేశ వర్ణనం, అక్కడ మేటలు వేసినట్టు పెట్టున్న రంగురంగుల బస్సులు.
ఇక్కడ "రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే". అక్కడ నాలాంటి వాళ్ళే ఇంకో నలుగురితో సర్దుకుని ఆ ఆటోని ఆశ్రయించుకుని నేను.
ఇక్కడ "విజ్ఞానమేతత్సర్వం జనార్ధనం". అక్కడ విజ్ఞానమే సర్వం అని గచ్చిబౌలి కూడలి లో పరుగెత్తుతున్న నా బోటి అజ్ఞానులం.
ఇక్కడ "కరోమి యద్యత్ సకలం పరస్మైః నారాయణాయేతి సమర్పయామి". అక్కడ ఎవరి కోసం, ఎందుకు పని చేస్తున్నామో , దీని వల్ల ఉత్తరజన్మల్లో ఒరిగే పుణ్యం ఏమన్నా ఉంటుందో లేదో తెలియకపోయినా, సమాజంకోసం, కుటుంబం కోసం రాజీపడి swipecard కోసం చూసుకుంటున్న నా బోటి ఉన్నత విద్యా పట్టభద్రులు.
ఏ రోజుకారోజు ఈ రోజైనా ఆ అమ్మ దర్శనం అవుతుందా అని కలవరించిన రామకృష్ణులలా , ఈ రోజైనా బగ్స్ లేని డెలివరీ చెయ్యాలని అనుకుంటూ ఆఫీస్ కి పోయాను.

కొసరు:

మనం ఏదైనా ఒక అద్భుతాన్ని (ఒక కళారూపం కావచ్చు,ఒక మేధోజనిత ఆవిష్కరణ కావచ్చు) చూస్తే, దాని గురించీ, దాన్ని తయారుచేసిన వాడి గురించీ, అతడు/ఆమె తెలివితేటల గురించీ పది మార్లు ఆలోచిస్తాం. మరి అలాంటిది ౮౪ (84) లక్షల జీవజాతులని సృజించి, ప్రతిదానికి సక్రమంగా ఆహారం అందేలా చేసినవాడూ, కర్మ పరిపాకానుసారం శరీరాన్నిచ్చేవాడూ, లక్షణం కాబట్టి శరీరం జీర్ణమయ్యే స్థితి వచ్చినప్పుడు దశ వాయువుల సహకారంతో చాలా జాగ్రత్తగా శరీరాన్ని పంచభూతాల్లో కలిసేలా చేసేవాడూ ఒకాయన ఉన్నాడు కదా.
ఇన్ని ప్రజ్ఞా పాటవాలు ఉన్న మేధావి గురించి ఎందుకు మనం ఒక నిముషం ఆలోచించం? మనం కళని గుర్తించడానికి విముఖులమవుతున్నామా, లేక కళాకారుడిని గుర్తించడానికి విముఖులమవుతున్నామా?

గతానికి వారసులుగానూ, వర్తమానంలో వారధిగానూ, భవిష్యత్తుకి పునాదిగానూ ప్రతీ వ్యక్తీ తనను తాను గుర్తిస్తే కృతయుగం నుండీ కలియుగం వరకూ కాలంలో ప్రయాణించడం సాధ్యమే.

5 comments:

చిలమకూరు విజయమోహన్ said...

అనుక్షణం ప్రతిపనిలోనూ భగవంతుణ్ణి చూస్తున్న మీరు ధన్యులు.

astrojoyd said...

rendoonu/u beleive me r nt,i frequently travells to tretaa nd dwaaparas..sometimes iam in pitrulokaas also bcz iam seeing god every-where..

astrojoyd said...

మనం కళని గుర్తించడానికి విముఖులమవుతున్నామా, లేక కళాకారుడిని గుర్తించడానికి విముఖులమవుతున్నామా?

గతానికి వారసులుగానూ, వర్తమానంలో వారధిగానూ, భవిష్యత్తుకి పునాదిగానూ ప్రతీ వ్యక్తీ తనను తాను గుర్తిస్తే కృతయుగం నుండీ కలియుగం వరకూ కాలంలో ప్రయాణించడం సాధ్యమే./rendoonu/u beleive me r nt,i frequently travells to tretaa nd dwaaparas..sometimes iam in pitrulokaas also bcz iam seeing god every-where..

కొండముది సాయికిరణ్ కుమార్ said...

బయట అడుగుపెట్టగానే ఆకుపచ్చని పట్టుచీర కట్టుకుని, తెల్లని పూలు కొప్పున పెట్టుకుని, బిడ్డలాంటి హనుమని చూస్తున్న శుచిస్మిత అయిన సీతమ్మ లా ఒక చెట్టు ఆశీర్వదించింది.
===
అద్భుతంగా ఉందండి.

మనోహర్ చెనికల said...

thanks for the comments