Saturday, October 2, 2010

వృద్ధులా, వారధులా?

జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
జీవితమంతా గొడ్డుచాకిరీ చేసి, పిల్లలని పెంచి, కుటుంబ భాద్యతలను నెరవేర్చి నలభై,నలభయ్యైదు వచ్చేసరికి సమాజం వారికిచ్చేది ముసలాడు, ముసలిది అనే బిరుదు. అప్పటిదాకా పులి లా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఇంట్లో,బయటా దేనికి పనికి రాని వారిగా తయారవుతున్నారు(పరిగణింపబడుతున్నారు). ఏదన్నా మంచి మాటలు చెపితే వినకపోగా మాట్లాడితే పురాణం మొదలుపెడతావంటూ చిన్నవాళ్ళు విసుక్కుంటారు. కంప్యూటర్ లకే జరిగినవి గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు పని చేసే సామర్ధ్యం పెంచుకోవడం నేర్పిస్తున్నాం. "Artificial Intellegence" అని పిలుచుకుని మురిసిపోతున్నాం. అలాంటిది ఒక జీవిత కాలాన్ని చూసి వాళ్ళు చూసినది, తెలుసుకున్నదీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా?

మా తాత గారు వ్యాపారాలు చేస్తూ దాదాపుగా దేశంలోని సగం రాష్ట్రాలు తిరిగారు,బ్రాహ్మణుడు కాకపోయినా ఆసక్తి కొద్దీ జాతకాలు చూడడం,ముహూర్తాలు చూడడం నేర్చుకున్నారు. ఆయన ముహూర్తం పెట్టారంటే మా వరికుంటపాడు మండలం లో ఏ అయ్యవారయినా ఒప్పుకుని తీరేవారు. ఆయన పెట్టినంత మంచి ముహూర్తం మేము కూడా పెట్టలేమనేవారు. మా మేనత్త ఊరు కొత్తపేట అయ్యోరు అంజయ్యగారైతే మా కుటుంబం లో జరిగే శుభకార్యాలకి ఆయన పెట్టిన ముహూర్తం కళ్ళు మూసుకుని ok చేసేవారు. ఆఖరికి కొత్త gas stove కొనుక్కున్నా ఎవరిపేరు తో బాగుందో ఆయన్నే అడిగేవాళ్ళు. "ఎప్పటికయినా నీకొక్కడికి మాత్రం ఇవన్నీ నేర్పిస్తాన్రా,నేను నేర్పకపోయినా నువ్వు నేర్చుకుంటావు" అనేవారు. కానీ నా చదువులు నన్ను దూరంగా తీసుకెళ్ళాయి, ఎంత దూరంగా అంటే ఆయన శరీరాన్ని వదిలి పెట్టి వెళ్ళినప్పుడు చూడడానికి కూడా కుదరనంత. అలాంటివాడు నలుగురు కొడుకులూ,ముగ్గురు కూతుళ్ళూ ఉన్నా ఎవరింట్లోనూ ఉంచుకోలేదు. ఒక కొడుక్కి పేరూ, ప్రేమా ఉన్నాయి కానీ ఆస్తి లేదు,ఒక కొడుకేమో మా ఇంట్లో తిని మిగతా కొడుకుల తరపున మాట్లాడతావన్నాడు. ఇంకో కొడుకేమో నాకే ముగ్గురు కూతుళ్ళున్నారు ,ఇంకా ఈయనకి ఎక్కడ పెట్టేదని ఆయన సర్దుకున్నాడు. ఇలాగే ఏవో కారణాలు చూపించి ఇంకో అయనా సర్దుకున్నాడు. మా ఇంటికి రమ్మంటే ఆయన రాలేదు. చివరి రోజుల్లో లాడ్జిలో ఉంటూ మా నాగేశ్వరపెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తింటూ గడిపేశాడు. ఎన్ని విషయాలు తెలుసో ఆయనకి, ఏం లాభం! ఆ జ్ఞానం అంతా ఎవరికీ అవసరం లేకపోయింది.అమ్మా నాన్నల పైతరం వాళ్ళు ఒకరు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పిల్లల ఆలోచనాక్రమాన్ని సరిదిద్దే కౌన్సెలర్లు ఉన్నట్టే.

ఇలాంటి మనిషే ఇంకో ఆమె మా ఇంటి పక్కన కామాక్షి ఆంటీ వాళ్ళ అమ్మగారు. ఆమె అసలు పేరు తెలియదు. నేనూ, మా అన్నయ్యా, మా వదినా అందరం "మామ్మగారూ" అనే పిలుస్తాం. ఆమెని కదిలిస్తే ఎన్నో సంగతులు. వాళ్ళ పెద్దబ్బాయో ఎవరో ఒకాయన దేవుడి పాటలు పాడే వాడట. "నిన్ను చూస్తే అచ్చం ఆ అబ్బాయిని చూస్తున్నట్టే ఉంది" అనేవారు. గజేంద్ర మోక్షం ,సుందరకాండ ఇలాంటి వాటి గురించి చెబితే పరవశించిపోయేది . వింటూ ఆవిడ పొందే ఆనందం చూస్తే "పానీయమ్ములు తాగుచున్, కుడుచుచున్,భాషించుచున్ .... మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా " అంటూ పోతన్న గారు వర్ణించిన ప్రహ్లాదుడు కళ్ళముందు కనిపించినట్టుండేది. వింటూ ఆవిడ జ్ఞాపకాల దొంతరలోనుండి ఆ పరాత్పరుడు ఆవిడని కాపాడిన వైనం కధలుకధలుగా, కెరటాలుగా, ప్రాణికోటిని పావనం చేసే గంగా ఝరిలా, భగవంతుడిమీద అచంచల విశ్వాసాన్ని ప్రోది చేసే అచార్యవాక్యంలా చెప్పేది. ఆవిడ ఏమీ పెద్దగా చదువుకోలేదు. కానీ భగవంతుడి అనుగ్రహాన్ని వివిధ దశల్లో చవిచూడడం చేత సుస్థిరమైన విశ్వాసం ఆమెది. విశ్వాసానికి పునాది శాస్త్రజ్ఞానం అయితే అది కొంతకాలానికి బీటలు వారచ్చు. అదే అనుభవం అయితే, అది ఎన్నటికి చెక్కు చెదరదు.
అలాంటి అనుభవజనిత విశ్వాసంతో జీవితంలోని అనేక ఒడిదుడుకులని ఎదుర్కొన్న వాళ్ళ మాటలు మనకి మార్గదర్శకం గా ఉపయోగించుకోలేమా? మా ప్రదీప్ ఎప్పుడూ చెప్తుంటాడు "reinventing the wheel" అనేది అభివృద్ధికి అసలు అవరోధం అని. నాకప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది, మనం ఇప్పుడు అదే చేస్తున్నామని.

నలుగురు పెద్దవాళ్ళతో మాట్లాడితే మన జీవితంలో కనీసం నలభై సమస్యలకు సమాధానం దొరుకుతుందని నా అభిప్రాయం. ఏమంటారు?

5 comments:

కౌటిల్య said...

"విశ్వాసానికి పునాది శాస్త్రజ్ఞానం అయితే అది కొంతకాలానికి బీటలు వారచ్చు. అదే అనుభవం అయితే, అది ఎన్నటికి చెక్కు చెదరదు."

మనోహర్ గారూ, ఎంత చక్కగా చెప్పారండీ..ఈ రోజుల్లో మేం శోధించి,సాధించి తెలుసుకున్న దాన్ని తప్ప వేరే నమ్మం అనే వాళ్ళకి మంచి సమాధానం....

"వేయిపడగల నీడలో నేను" ముందుకు సాగించడం లేదేంటండీ...మీ రాతల్లో నన్ను నేను చూసుకుంటున్నాను అక్కడ...

మనోహర్ చెనికల said...

వేయి పడగలు ఇచ్చిన నీడని, ఆ చల్లదనాన్ని రాయాలంటే అయ్యేపనేనా చెప్పండి. ఐనా ప్రయత్నిస్తాను.

మీ ఆసక్తి కి,అభిమానానికి కృతజ్ఞతలు,

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

మనోహర్ గారూ,

రెండో పారా చదివే సరికి చాలా బాధ వేసింది. నేనూ అలాంటి వాళ్ళని ఒక ఇద్దరిని చూశాను. వారు జీవితాంతం సంపాదించిన జ్ఞానానికి వారసులని తయారు చేయలేకపోయారు. వారి వారసులకి వారు సంపాదించిన ఆస్తి తప్పి వారి జ్ఞానం అక్కరలేక పోయింది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మీరు చాలా చక్కటి విషయాల్ని పంచుకున్నారండీ.
ఈ రోజుల్లో వ్యష్టి కుటుంబాల వల్ల పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాల పాలు అవుతున్నారు.
వ్యక్తి స్వేచ్ఛ పేరుతో భార్యాభర్తలు, తల్లిదండ్రులు పిల్లలతోను దూరమవుతున్నారు.
ఈ విషయమే నేనూ నా ఆవేదన ఇలా వెళ్ళబోసుకున్నాను.
http://paarijatam.blogspot.com/2009/01/blog-post_9603.html

శివ చెరువు said...

పెద్దలకందాల్సిన గౌరవం .. caring ..నేడు అందడం లేదు