Thursday, June 24, 2010

రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!

సురాసురుల మధ్య తగవు తీర్చడానికీ, సురలకు అమృతాన్ని ఇవ్వడానికి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆడిన వింత నాటకమే మోహినీ అవతారం. ఈ అవతారం మరొక ప్రయోజనం మణికంఠ స్వామి జననం. మోహినీ రూపం దాల్చిన ఆ పరంజ్యోతిని శంకరుడు అనుసరిస్తే
అదే "రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!" అయ్యింది. పరమాత్మ అనుగ్రహంతో ఒకటి రాసిన తర్వాత శంకరుడినే మోహింపజేయగల మోహినీదేవి అవతారం లోకాన్ని కదిలించదా అనిపించింది(అనిపించేది ఎవరికి, అనిపింపచేసేది ఎవరు?).అలా ఆ స్వామి రాయించినవి మిగతావి.
వీటికి చంధో బద్దత లేదు, కానీ మనో నిబద్దత ఉంది
వాక్యశుద్ధి లేకపోవచ్చు, కానీ అంతఃకరణ శుద్ధి ఉంది.
పురుషుడూ,ప్రకృతీ అన్నీ తానే అయ్యి ఆటలాడే ఆ నిర్గుణ పరబ్రహ్మ ని శబ్దం ద్వారా స్పర్శించాలనీ,దర్శించాలనీ చేసిన చిన్న ప్రయత్నం.అంతే తప్ప శారదా పుత్రుల్ని గేళి చేయడానికి మాత్రం కాదు. సలహాలిస్తే చంధస్సులు నేర్చుకొని ఆ పరమాత్మ గుణగణాలను గాన చెయ్యాలని కోరిక.

నాగారివాహన నారాయణుండు,అసు
రగణమచ్చెరువొంద,సుర రక్షణకై ముద
ముగ మోహినిగాగ,భామయైన బావనుగని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్|

గగన మండలమ్మంత కాంత మేని ఛాయ ముప్పిరిగొనంగ, సురగ
ణాంగనలంబరవీధి చేరి కన్నులింతగ చేసి లోకోత్తర సౌందర్యమున్ చూ
డగ రాగ,భువనభాండముల్ గుసగుసలాడుచుండ,భామయైన బావనుగని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్|

వజ్రముల్ విసుగెత్తి పలికె,తమకేది అంతటి వన్నె యని,
వైఢూర్యముల్ వదలక వదరుచుండె, ఇది ఎచ్చటి వెలుగని,
మౌక్తికముల్ మారు మాటాడక యుండె, మునుపెన్నడు ఇది గనమని,
నవరత్నముల్ నోరాడక యుండె, ఇక తమనెవ్వరు తలపరని,
అన్ని రత్నముల కాంతిని,
అన్ని లోకముల శాంతినపహరింపనొప్పు
వెన్నుడు మోహిని గాగ, జూచి
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

సృష్టి ధర్మముగ దివా సంధ్యా నివర్తకుండైన రవిని
వ్యష్టిపరచగ,ముల్లోకమ్ముల తిమిరమ్మును
నష్టపరచ, లోకమ్ముల దీపించుచున్న మోహిని గని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

జగత్ప్రళయమో, త్రిశంకు స్వర్గ చంద్రబింబమో యటంచు
నగరాజాధిపు యల్లుడి జటన చేరి సోముడు చాటుగ
దాగి చూడగ, చంద్రబింబ సమభాసమునొప్పు మోహిని గని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

ముక్కెరకాంతులు మూడు లోకమ్ముల ముప్పిరిగొనంగ,
ఎక్కడివీ కాంతులనుచు మూడు లోకమ్ముల జనులు మ్రాన్పడగ,
రక్కసులనుండి సుధను, మూడు లోకమ్ముల గావగ దిగిన కాంతను గని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

శుభములు దేవాళికిన్ శుభకరముగనిచ్చు విభుడు మోహిని గాగ,
శుభములు మానవాళికిచ్చు,శుభగుడు శోభనమొప్ప మోహిని గాగ,
శుభముగ సుధను,సురలకీయ ఖగరాజపతి వేగ మోహిని గాగ,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

విరిచూపుల అరివీరుల యశమును వ్యర్ధము గావించుచు,
తరగని తమకమునభినయించి తామసుల దరి జేరుచు,
కరివాహనగణమున్ అమరుల జేయ సుధనిచ్చునువిధగని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

9 comments:

కౌటిల్య said...

మనోహర్ గారూ,
న్యూజింగ్స్ అని వింతగా కనపడినా(నాకు చలం సాహిత్యం పెద్దగా పరిచయం లేదులెండి),ఈ టపా శీర్షిక బాగా ఆకట్టుకుని అలా మీ బ్లాగులోకి వచ్చా...చూద్దునా మా గురువుగారి ఫొటో మొదట్లో.....సర్లెమ్మని మీ కొత్తటపా చదివా...చాలా బాగా రాశారు..ఇక మిగిలిన టపాలు చూద్ద్దామని మొదలెట్టా...పక్కన వరుసలో చూద్దునా,'వేయిపడగలు' దగ్గర ఠక్కున కళ్ళు,కర్సరూ రెండూ ఆగిపోయాయి....నొక్కి టపాలోకి వెళ్తే ఏముంది! మా అమ్మ గిరికమ్మని మనసులో నింపుకుని,మీ జీవితానికి మార్గనిర్దేశం చేసుకున్న తీరు! ఒళ్ళు పులకరించింది......నాన్న చెప్తూ ఉండేవారు....ఎంతో మంది జీవితగమనాల్ని మార్చిన మహా గ్రంథం అని...ఆ ఎంతో మందిలో మీరూ ఉన్నారనేసరికి,మనసు ఆనందంతో తబ్బిబ్బయ్యి, మనసులో గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేసుకున్నా.....ధన్యవాదాలు...

Unknown said...

ఛందస్సు గుఱించి తెలుసుకోవాలనే మీ ఉత్సాహానికి ఉపయోగ పడుతుందనే నా భావన. క్రింది బ్లాగులో నిన్ననే నేను మొదలు పెట్టిన కావ్యాలంకార చూడామణి ( విన్నకోట పెద్దయ మహాకవి )గారి ఛందః ప్రకరణం "నా నేర్చిన భంగి" నేను వ్రాస్తున్నది. వీలున్నప్పుడు ఓ చూపు చూడగలరు.
http://www.kasstuuritilakam.blogspot.com/

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగా రాశారు

మనోహర్ చెనికల said...

కౌటిల్య గారూ,
నిజానికి బి.టెక్ లో ఉండగా కొన్ని మంచి పుస్తకాలు చదివే అవకాశం కలిగింది. అనంతపురం గ్రంధాలయం పుణ్యమా అని "నాహం కర్తా హరిఃకర్తా","వందే వాల్మీకి కోకిలం" చదివాను. తర్వాత ఒకసారి బుక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే అందులో దొరికిందీ గ్రంధ రాజం. నిజానికి కొనడమా వద్దా చాలాసేపు ఊగిసలాడాను. ఎందుకంటె నాలుగు వందలు పెట్టి కొని చదవలేకపోతే బాధ(కాలేజీ లో ఉన్నప్పుడు నాలుగు వందలు అంటే ఎక్కువే కదా). అప్పటికి విశ్వనాథ గారి గురించి మనకు తెలిసింది ఏమీ లేదు, ఒక్క వేయి పడగలు,దాన్ని పీ.వీ గారు అనువదించారనీ తప్ప. అందులోనూ పుస్తకం సీల్‍డ్ లో ఉండడంచేత ఒక్క పేజీ కూడా చూసే అవకాశం లేదు. సరే తెగించి కొన్నా. చదివా.కాలేజీలో మొత్తం ముగ్గురుమో,నలుగురుమో మాత్రమో ఆ పుస్తకం చదివాం. కానీ చదివిన ప్రతి ఒక్కరికీ ధర్మారావు గారి పెళ్ళి చేసి సుబ్బన్నపేటని వదలలేక వదలలేక వచ్చినట్టుండేది. అది ఇది అని కాదు వేయి పడగలలోని అన్ని పాత్రలు తమ తమ పరిధిని దాటి మన మనో పరిధి లోకి అమాంతం దూసుకొస్తాయి. ఎవరివరకో ఎందుకు,కీరీటి శశిరేఖా ప్రణయ వ్యవహారం గుర్తు తెచ్చుకోండి. తపస్సుకు పరాకాష్టగా శశిరేఖ వ్రతం నడుస్తుంది. ఎంతలా అంటే కిరీటినే గుర్తు పట్టలేనంతగా .ప్రేమ అంటే ఆంత గాఢంగా ఉండాలని అనిపిస్తుంది. శశిరేఖ పాత్ర పెద్దగా ఉండదు నవలలో ఎందుకంటే ఆమె ప్రవేశించే నాటికి మనం హరప్ప చదువులో,గిరికా మాత ఆత్మ సిద్ధి ప్రయత్నం లో ఉండి పట్టించుకోం. కానీ ఒకటే మాటతో విశ్వనాథ వారు అంతటి ప్రేమను గుండెల్లో నింపుకున్న మూర్తిని కళ్ళముందు నిల్చో బెడతారు.

కానీ వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ఎవరూ లేరు.సరే అసలు నా తరం వాళ్ళు కాకపోయినా నా ముందుతరం వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు కదా అని "వేయి పడగల నీడలో నేను" మొదలుపెట్టాను.

కానీ నా తరం లోనే ఇంతమంది విశ్వనాథ అభిమానులు ఉన్నారని తర్వాత తెలిసింది. ఇక ఆయన రామాయణ కల్పవృక్షం రాసారని , దానిగురించి తెలిసి నేనేమైపోయానో ఆ స్వామికే తెలియాలి. నాకు ఎంతో ఇష్టమైన రామాయణం, నాకెంతో ఇష్టమైన కవి నాకు ఎంతో ఇష్టమైన భాషలో రాసారనేసరికి అప్పటినుండి వెతుకుతున్నాను. కానీ పుస్తకాల షాపుల్లో దొరకలేదు. ఇంటర్నెట్‍లో కొన్ని పార్ట్స్ దొరికాయి.

మళ్ళి మీరు కదిలించారు ఇన్నాళ్ళకి వేయిపడగల గురించి , పొంగుకొచ్చిన ఆవేశం ఇంత రాయించింది. ధన్యవాదాలు చెప్దామని మొదలుపెట్టి ఇంత రాసాను. ఇక న్యూజింగ్స్ విషయానికొస్తే చలం మ్యూజింగ్స్ నాకు నచ్చిన ఇంకొక పుస్తకం, మ్యూజింగ్స్ మిగతా పుస్తకాల లాంటిది కాదు. ఒక మనిషికి ఫ్లో లో వచ్చే ఆలోచనలని పుస్తకం గా రాస్తే అదే మ్యూజింగ్స్ అయ్యింది.దురదృష్త్టవశాత్తూ పూర్తిగా చదవలేదనుకోండి, చదివిన కొన్ని పేజీలు బాగా గుర్తుండిపోయాయి.అలాగే నేనూ నా సొంత ఆలోచనలని రాయాలని మొదలుపెట్టా. అందుకే మూడు పేర్లు మార్చి చివరికి నా బ్లాగుకు న్యూజింగ్స్ అని పేరు పెట్టుకున్నా. ఇక నాకు బాగా నచ్చిన రచయితలనందరినీ కలిపి బొమ్మ నేనే తయారు చేసుకున్నాను.మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
నరసింహ గారూ,
చాలా సంతోషం. తప్పకుండా ప్రయత్నిస్తాను.
మందాకిని గారు,
నెనర్లు.

కంది శంకరయ్య said...

మనోహర్ గారూ,
మీలో మంచి భావావేశం ఉంది. ఉచిత పదసంపద ఉంది. భావ వ్యక్తీకరణలో స్పష్టత ఉంది. మీ రిలాగే సాహిత్య సేవ చేయాలని, మీ రచనలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. అవిఘ్నమస్తు!

మనోహర్ చెనికల said...

శంకరయ్య గారు:
భావం నచ్చినందుకు ధన్యవాదాలు. సహజకవి పుణ్యమా అని ఇప్పుడిప్పుడే చాలా తెలుగుపదాలు నేర్చుకుంటున్నాను. మన తోటి బ్లాగర్ల పుణ్యమా అని చందస్సు నేర్చుకుంటున్నాను.
ఆ స్వామి అనుగ్రహం, మీ వంటి పెద్దల ఆశీస్సులు ఉంటే ఏనాటికైనా చంధస్సుతో ఒకపద్యం రాయగలనని నమ్మకం,రాయాలని కోరిక.

చింతా రామ కృష్ణా రావు. said...

మీ ఉత్సుకతకి అభినందనలు. చందస్సు ఇంకా సాధన చేస్తే మంచిదని నా అభిప్రాయం.

Unknown said...

బాగుంది మనోహర్ ...
మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ఇక్కడే ఆపేయకుండా శతకం పూర్తి చెయ్యాలని ఆశిస్తున్నాను.
శతకం సంగతి తర్వాత చంధస్సో అంటావేమో!, ఇంత తెలుగు నేర్చుకున్నవాడివి, అదెంతసేపు. (పదవ తరగతి పిల్లలకు నెలలోపు పడుతుంది.)
ఇంకా భవిష్యత్తులో, మిగతా పురాణగాధలపై కూడా దృష్టి సారించు, ఒక ఘట్టమే కాకుండా.
వాటిలోని అంతరార్దాన్ని అందరికీ అర్ధమయ్యేలా రాయి.
ప్రతీ పురాణంలోనూ నిగూఢంగా దాచిన రహస్యాలు కనుక్కో, పురాణ పఠనం కాదు పురాణ మధనం కావాలి, ఎదురొస్తున్న కెరటాలను ఎదుర్కోడానికి. (సరే నన్నే అడుగుతావేమో!, నాకు తెలిస్తే నీకు చెప్పడమెందుకు)

!!విజయం పిలుస్తోంది, దూసుకుపో!!

మనోహర్ చెనికల said...

రామకృష్ణ గారు,
చంధస్సు నేర్చుకుంటున్నాను. ఉపజాతుల మీద సాధన మొదలుపెట్టాను. పైన ఆ హనుమ కృప
ప్రదీప్,
తప్పకుండా ప్రయత్నిస్తాను.