Saturday, June 26, 2010

వేయి పడగల నీడలో నేను - ౩

జై శ్రీ రామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
చాలారోజుల తర్వాత వేయి పడగల జ్ఞాపకాల దొంతరను కౌటిల్య గారు కదిలించారు. సరే వేయి పడగలతో నా అనుబంధాన్ని గుర్తు చేసుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను.

అసలు గ్రాంధికం మనం చదవగలమా లేదా అని ఉన్నరోజుల్లో ఈ పుస్తకం చదవడం జరిగింది. మొదట భావం కోసం చదివాను.రెండోసారి భాష కోసం చదివాను. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణంతో చదివాను. అన్నింటికన్నా నాకు చాలానచ్చినవి కళ్యాణోత్సవాలే. అందులో గోపికయై తల్లి గిరిక వెతుకుతూ చెట్టునూ పుట్టనూ అడగడం , ఆ పద్యాలు నాకెంతో ఇష్టం అప్పట్లో. అందులో ఒకగద్యం ఉండేది. అన్ని పూల చెట్లు,పళ్ళ చెట్ల పేర్లు ఉండేవి. అలాగే "పున్నాగ కానవే, పున్నాగవందితు! తిలకంబ కానవే తిలకనిటులు" అనేపద్యం చాలా బాగుండేది. భాగవతంలోనివని అప్పుడు తెలియదు కానీ ఏదో సంబరంగా ఉండేది ఆ పదాలూ అవీ చదువుతూ ఉంటే. "..సఖీజన వంచితమహం..." అనే అష్టపది కూడా ఉండేది. ఇక అసలు పద్యం "నల్లని వాడు పద్మ నయనమ్ములవాడు" అప్పటికి పాత సాహిత్యంలో పేర్లే గాని విషయం తెలియదాయె. ఆయనేమో ఎప్పుడు చెప్పినా మొదటి పాదం చెప్పి ఊరుకునేవాడు. ఇక చూస్కోండి. ఎవరినైనా అడుగుదామంటే నా సర్కిల్ లో ఎవరికీ తెలియదాయె. అలా రెండుసంవత్సరాలు గడిపేసాక బ్లాగుల పుణ్యమా అని తెలుసుకున్నాను. అసలు ఆ పదబంధాలే వింతగా ఉండేవి. అలాగే "శాస్త్ర ద్రష్టయే గాని శాస్త్ర స్రష్ట గాడు" లాంటి వాక్యాలు కొత్తగా ఉండేవి.
మూడు వందలు యేళ్ళు వేయి పడగలకింద సురక్షితం గా భూమ్యాకాశాలకూ,మంచీ చెడులకూ , మర్త్యామర్త్యాలకూ మధ్య స్థిరంగా నిలిచిన నాలుగు స్థంబాల మంటపం ,చివరికి రెండు పడగల కింద,రెండు స్థంబాలమీద నిల్చున్న స్థితికి సాక్షీభూతం గా నిల్చోబెట్టేస్తారు విశ్వనాథ గారు మనలని. మనలనే నిర్ణయించుకోమన్నట్టుండేది ఆ రెండు పడగలనన్నా స్వామి ఉపసంహరించుకోకుండా కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో.
మనం చదివే ప్రతీ పుస్తకం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మీద ప్రభావం చూపుతుందన్నది నిజం. ఏదో ఒక సిద్ధాంతం మీదనో , విషయం మీదనో అది మన మనసును ప్రభావితం చేస్తుంది. కానీ అన్ని మానవీయ సంబంధాల పట్ల పాఠకుడి దృక్కోణాన్ని మార్చగల శక్తి రామాయణం తర్వాత వేయిపడగలకుందని నా నమ్మకం. ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి.
అలాగే మనం చదివే ప్రతి పుస్తకం, తర్వాత మనం ఎలాంటి సాహిత్యం చదువుతాము అనేది కూడా నిర్ణయించుకోవడానికి గీటురాయి అవుతుందని నా అభిప్రాయం. వేయి పడగలు చదివాక ఆ స్థాయి పుస్తకం కోసం చూస్తాం కానీ మామూలు పుస్తకాలు చదవాలని అనిపించదు. సహజకవి చెప్పినట్టు మందార మాధుర్యముల దేలు మధుపమ్ము పోవునే మదనములకు అన్నట్టు అయిపోతుంది.

ఇంకెందుకాలశ్యం ఎక్కడో హృదయపు అట్టడుగు పొరల్లో కూరుకుపోతున్న మీలోని పాఠకుడిని వేయి పడగలు ఊతమిచ్చి పైకి లేపండి. నా తరం లో చాలా మందికి వేయి పడగలు పేరే తప్ప కనీసం ఏముందో కూడా తెలియదు.కొంతమందికి ఎక్కడో విన్న గుర్తు. కొంతమందికి ఆ అదృష్టంకూడా లేదు. నా ఉద్దేశ్యంలో వేయి పడగల గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెయ్యి సంవత్సరాలు మనవలసిన దీపాన్ని వంద సంవత్సరాలకే కొండెక్కకుండా , ఆ దీప కాంతుల్లో జీవితాన్ని ఎలా వెలిగించుకోవచ్చో తర్వాతి తరాలకు చెప్దాం రండి.

4 comments:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

వేయి పడగలు పుస్తకం ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుందా? నేను ఒక సంవత్సరం నుంచీ ప్రయత్నిస్తున్నాను. విశాలాంధ్రలో దొరకట్లేదు. వాళ్ళని అడిగితే విశ్వనాధ వారి సాహిత్యం మొత్తం కలిపి ఒక సారి కొంటే ఇస్తామంటున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్ అన్నిచోట్లా ఒకే సమాధానం. చివరకు ఎలాగోలా కష్టపడి ఇంటర్నెట్లో ఒక పిడిఎఫ్ సంపాదించాను. కొంత వరకూ చదివాను గానీ పుస్తకాన్ని సరిగా స్కాన్ చేయకపోవడంతో కొన్ని పేజీలు సరిగా కనిపించలేదు. దాంతో వదిలేశాను. నేను ఉండేది చెన్నైలో. ఇక్కడ తెలుగు పుస్తకాలు దొరకడం కొంచెం కష్టంగా ఉంది. తెలుగు పుస్తకాల ప్రదర్శననాలు కూడా ఉండవనుకుంటా. ఎప్పటికీ వీలవుతుందో మరి!!

కొత్త పాళీ said...

వేయి పడగలతో మీ పర్సనల్ టచ్ బాగుంది. నేనింకా చదివే ధైర్యం చెయ్యలేదు.

Sasank said...

buddy veyi padagalu antey appudu daily manam bike meedha velletappudu nuvvu naaku cheppindhey kadhaa

Sasank said...

enthanna vishnu shaarma rockssssssss