Sunday, November 8, 2009

తాటంకా చలనమ్ముతో

శ్రీ రామదూతం శిరసా నమామి!

సముద్రాన్ని సూర్యుడు ఎండ గట్టలేడు, కానీ అదే భానుడు పిల్లకాలువను ఆనవాలు లేకుండా అలవోకగా అంబరానికెత్తుకోగలడు. అలాగే నా ఓపిక మొత్తం నేను ఇవ్వకపోయినా ఆవిరి చేసే నా కంప్యూటర్ కి హవిస్సుగా ఆహుతి చేసి(ఈ అనంత విశ్వం లో నాకు తెలిసి ఎయిర్ కండిషన్ లో ఉంటూ జనాల జవసత్వాలను ఆవిరి చేసే సూర్య సదృశం ఈ కంప్యూటర్ ఒక్కటే ), అర్ధ ప్రధానమైన ఆ నిత్య యజ్ఞకర్మకి పూర్ణాహుతి చేసి ,ఓ శనివారం నాతో నేను (అంతే కదా మరి ) కలిసి నడుచుకుంటూ వస్తున్నాను.దారిలో పూణే గోల్ఫ్ కోర్స్ లో పెన్సిల్ కూడా సరిగ్గా పట్టుకోలేని పిల్లలు గోల్ఫ్ బాల్స్ తో కుస్తీ పడుతున్నారు(గోల్ఫ్ లో వాడే బాట్ లాంటి సాధనాన్ని ఏమంటారో నాకు తెలియదు మరి). ఓ పావుగంట చూసాను,సరే అక్కడినుండి కదిలి ముందుకు పోయాను.కొంచేపు పోయేసరికి ఇక నడవలేము అనిపించింది.వందేళ్ళు భగవంతుడి గురించిన ధ్యాస కానీ,అవసరం కానీ లేకుండా గడిపెయ్యచ్చనుకుంటాం. కానీ అలసట లేకుండా పది నిముషాలు పైబడి నడవలేము కదా.సరే ఒక ఆటో పట్టుకుని రూం కి వెళ్తూ మధ్యలో మోర్ లో వారాంతం కదా ఏమన్నా కొందామని వెళ్ళ్ళాను. (ఏంటి ఈ సోది టైటిల్ కి రాడేంటి అనుకుంటున్నారా, వస్తున్నా )

మోర్ లోనుండి బయటకి వచ్చి నడుస్తున్నాను. ఇంకొక్క నూటయాభై అడుగులు నడిస్తే మా అపార్ట్ మెంట్ ద్వారం వస్తుంది.సరే నేనేదో ఆలోచించుకుంటూ నడుస్తున్నాను.అప్పుడు ఒక అమ్మాయి సడెన్ గా ధర్మ మోక్షాలను , అర్ధ కామాలు క్రాస్ చేసినట్టు నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయింది(:-)). అలా సడెన్ గా దాటిపోయేసరికి చివ్వున తలెత్తి చూసాను,
నలుపు ,తెలుపు పంజాబీ డ్రెస్ వేసుకుని వుంది, చాలా వేగంగా నడుస్తుంది, ఏం అవసరం లో పరిగెడుతుందో లే అనుకున్నాను. ఆమె నుండి చూపు తిప్పుకుంటుండగా ఆమె చెవి కమ్మలు కనబడ్డాయి. రెండు,మూడు చిన్న చైన్లు కిందకి వచ్చి కింద మరొక్క చాలా చిన్న లాకెట్ లాంటి దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఆ చెవి కమ్మలు ఆ అమ్మాయి నడుస్తున్న వేగానికి సెకండ్ల లోలకం కంటే ఎక్కువ వేగం తో(హై స్కూల్ ఫిజిక్స్- సెకండ్ల లోలకం అవధి-2 సెకండ్లు , తప్పైతే ఆదిలక్ష్మి గారు కరెక్ట్ చెయ్యాలి) ఆమె బుగ్గలనందుకోవాలని ప్రయత్నించి అందుకోలేక వెనక్కి వచ్చి జడకి చెప్పుకుంటున్నాయి.
అలా కదులుతున్న చెవి కమ్మలను చూడగానే నాకు అనుకోకుండా "తాటంకా చలనమ్ముతో,భుజ నటద్ధమ్మిల్ల బంధమ్ముతో......" అనే పద్యం గుర్తొచ్చింది.
గజేంద్రుడు పిలిచాడు బాగానే ఉంది,అయ్యవారు అన్నీ మరిచి పరిగెడుతున్నారు బాగానే ఉంది, కానీ మధ్యలో అమ్మవారి చీరచెంగు చేతిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి పరిగెడుతున్నారు స్వామి.లక్ష్మీ దేవి మాత్రం ఏమి చేస్తుంది,ఏం చెప్తుంది? ఆగమంటే అదో అపకీర్తి- భక్తులకి , భగవంతుడికి మధ్య లక్ష్మీ దేవి అడ్డొచ్చిందంటారో ఏమో ,లోకాలను కాపాడడానికి మొగుడు విషం తాగుతుంటే ఏమీ కాదని తెలిసి తాగమన్నందుకే పార్వతీ దేవిని నిందిస్తున్నారు(మింగెడిది గరళమని, మింగెడివాడు విభుండని,మింగమనె సర్వమంగళ) హవ్వ మొగుడిని విషం తాగమంటుందా ఏ భార్య ఐనా అని. అలాంటిది ఆపి "ఏమయ్య ఎక్కడికి పరిగెడుతున్నావు పెళ్ళాన్ని కూడా మర్చిపోయి " అంటే ఇంకేమన్నా ఉందా , ఇలా అలోచిస్తూ అమ్మవారు తత్తరపాటుతో ఆ లోకేశుని అనుసరిస్తున్నప్పుడు అమ్మవారి స్థితి ని వర్ణించిన పోతనామాత్య కృత పద్యరత్నం అది.పరిగెడుతున్న వేగానికి కదులుతున్న అమ్మవారి తాటంకాలు ఎలా కదిలి ఉంటాయో ఎందుకు పోతన చెవి కమ్మలు కదిలితే అంత ప్రాముఖ్యత ఇచ్చాడో అని చాలా సార్లు అనుకున్నాను గజేంద్రమోక్షణ కధ చదివిన దగ్గరనుండి. కానీ ఆ అమ్మలగన్న యమ్మ ఇలా దృశ్యరూపంగా ఆ ఘట్టాన్ని ఆవిష్కరిస్తుందనుకోలేదు.ఎవరైనా ఆడవారి మొఖం చూసినప్పుడు చాలా తొందరగా కదులుతూ చూపునాకర్షించేవి తాటంకాలే, పరుగులు పెడుతున్న అమ్మవారిని ధ్యానంలో దర్శనం చేసిన పోతన కి కూడా ఆ తాటంకాలే కనపడి ఉంటాయి ముందు. అందుకే ఆ తాటంకా చలనమే ముందుండి ఆ పద్యాన్ని నడిపించింది.(సౌందర్య లహరిలో శంకరులు కూడా పార్వతి దేవి తాటంకాలపై ఒక పద్యం రాసినట్టు గుర్తు.)

ఆ పద్యంలో మొదటి పదమైన "తాటంకా చలనమ్ముతో" అన్న స్థితి నా కళ్ళముందు సాక్షాత్కరించినట్లైంది. ఒక్క సారి గజేంద్రుడి పటాటోపం,
సత్వరజస్తమో గుణ సదృశమైన త్రికూటాచలమూ,
మొసలి పరాక్రమమూ
(పాద ద్వందము నేలమోపి, పవనుం బంధించి ,పంచేంద్రియోన్మాదంబుం పరిమార్చి, బుద్ధిలతకున్మారాకు హత్తించి, నిష్ఖేద బ్రహ్మపదావలంబన గతిం క్రీడించు యోగీంద్రు మర్యాద -నక్రము విక్రమించె కరి పాదాక్రాంత నిర్వక్రమై),
తీసిపోని గజరాజు పరాక్రమమూ
(జవమును,జలమును,బలమును వివిధములుగ కరటి వీరతకు భువిన్, దివి మకర మీన కర్కట నివహంబులొక్కటన మిత్ర నిలయము బొందెన్),
వెయ్యి సంవత్సరాలు జరిగిన అద్వితీయమైన పోరాటమూ(సలిపె పోరొక్క వేయి సంవత్సరముల్),
చేష్టలుడిగి శరణాగతి చేసిన ఏనుగు(లావొక్కింతయు లేదు....) ,
పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడిన శ్రీ మహా విష్ణువు(సిరికించెప్పడు...,కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె....,పూరించెన్ హరి పాంచజన్యము...),
శాపవిముక్తుడైన గందర్వుడు హూహూ,
విష్ణువులో ఐక్యత నొందిన ఇంద్రద్యుమ్న మహారాజు,
శుక బ్రహ్మ చెప్పిన ఫలశ్రుతీ,
శ్రీ మహా విష్ణువు చేసిన అభయ ప్రదానం,
పోతన చెప్పిన ఫలశ్రుతీ --ఇలా అన్నీ కళ్ళముందు గిర్రున తిరిగాయి. తేరుకుని చూస్తే అమ్మాయి లేదు, కానీ ఆ కదులుతున్న చెవి కమ్మలు మాత్రం గుర్తుండిపోయాయి.

కొని వారమైంది ,కార్తీక మాసం సగమైపోయింది వీడింకెప్పుడు మొదలుపెడతాడో భాగవతం, ఒక పక్క కార్తీక పౌర్ణమి కూడా దాటిపోతుంది అని (ఆరోజు అయ్యవారు పరిగెత్తి గజేంద్రుడిని కాపాడినట్టు) నా చేత కార్తీక పౌర్ణమి లోపు భాగవత పఠనం మొదలుపెట్టించడానికి అంతే తత్తరపాటుతో పరిగెత్తుకొచ్చిందేమొ ఆ అమ్మ అని అనిపించింది(నాటికి రెండవరోజు కార్తీక పౌర్ణమి)

ఏమిటీ దైవలీల,
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః!
సర్వైశ్చపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం

3 comments:

durgeswara said...

శ్రీరాముని దయచేతను.......

చక్రవర్తి said...

శివుని ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టకపోతే, నీ మదిలో ఆలోచన ఎలా వస్తుందో తెలుసుకో బాసు. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు, ఆపర్టునిటీ అనేది ఒక్క సారె తలుపు తడుతుంది అలాగే మిస్ ఫాట్యూన్ నాక్స్ ద డోర్ ఆల్ ద టైమ్. ఇదంతా మన విఙ్ఞతపై ఆధార పడి ఉంటుంది. కాకపోతే శివయ్య నీకు అప్పుడు పర్మిషన్ ఇచ్చాడు మనమేమో లైట్ తీసుకున్నాం. ఇదిగో ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికైనా కనులు తెఱచినందులకు నెనరులు.

ఙ్ఞాన శుద్ది ప్రాప్ర్తిరస్తు.

yukta said...

mithramaa........,
pothana kavindrulu kanipinchaaru meelo aa varusalu chaduvuthunnanthasepu