విజయవాడ లో సత్యనారాయణ పురంలో ఒక గ్రంధాలయం ఉండేది రైల్వే స్టేషన్ దగ్గర (ఇప్పుడు లేదు లెండి. లేనిది రైల్వే స్టేషన్ , గ్రంధాలయం కాదు ). అక్కడ చాలా పుస్తకాలు చదివాను. వాటిలో నా దశ తిరిగి ఒక రోజు చలం గారి "మ్యూజింగ్స్" చదవడం తటస్తించింది. తరువాత నేను అనంతపూర్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి మామూలు పుస్తకాలు చదవలేదు. ఏది చదివినా ఆ పుస్తకంతో పోల్చేవాడిని. తక్కువే అనిపించేది. ఇక ఇలా లాభం లేదని విశ్వనాధ గారిని తగులుకొందాం అనుకొన్నా. అదృష్టం కలిసొచ్చి అనంతపూర్ లో బుక్ ఎగ్జిబిషన్ లో "వేయి పడగలు" దొరికింది. వినడం ఐతే చాలా విన్నాం ఆ పుస్తకం గురించి , కాని ఎలా వుంటుందో తెలియదు. తీరా కొన్నాక చదవలేదంటే(అసలు భయం చదవలేమేమో అని) అవమానం. కొందామంటే ౪౦౦ (400). సరే ఏదైతే అదే అవుతుందని కొన్నాను. కాలేజ్ లేదు, కాంటిన్ లేదు, చదువు లేదు, సంధ్య లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఉదయం లేదు, సాయంత్రం లేదు, నాలుగు రోజుల తర్వాత యజ్ఞం పూర్తి అయ్యింది.
అప్పటి దాకా ఒక అలౌకిక లోకంలో తిరిగిన నన్ను అక్కడి వాళ్ళు తరిమేసారా అనిపించింది. వేణుగోపాల స్వామి కల్యాణం జరిగి సంవత్సరం ఆయినా కాలేదు, అప్పుడే నన్ను పంపించేసారే అనిపించింది. ఇక్కడే గుండేటిలో పడి చావనయినా చస్తాను కాని నేను వెళ్ళాను అని అరవాలనిపించింది. కాని ఊరిలోఎవరు లేరు, అందరు ధర్మారావు గారి పెళ్ళికి బెజవాడ వెళ్ళారు.
అలా వదలలేక , వదిలి వెళ్ళలేక, అశ్రు నయనాలతో సుబ్బన్న పేట ని వదిలి అనంతపూర్ JNTU హాస్టల్ లో వాలాను.
(ఇంకా ఉంది. )కొసమెరుపు :
"మ్యూజింగ్స్" నేను రండు చాప్టర్ లే చదవడం జరిగింది. ఎందుకంటే అది మనది కాదు. రెండవ రోజు కి లైబ్రరి లో మరి దొరకలేదు. అందుకే వేయి పడగలు కొనుక్కున్నధైనా ఏక బిగిన చదివేసాను.
7 comments:
మనోహర్,
అనంతపూర్ కాదు "అనంతపురం"/అనంతపురము.
అమీర్ పేట - అమీర్ పేట్.
హైదరాబాదు - హైదరాబాద్.
ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళతో వచ్చిన తిప్పలే ఇది.
తెలుగులో పదాలు ఎప్పుడూ అచ్చుతో అంతమవుతాయి. హల్లుతో కాదు.
thank you naga,
will remembder this one....
నేనూ అదే ప్రదర్శనలో చాటుపద్య మణిమాల అన్న పుస్తకం కొన్నాను.
విశ్వనాథ వేయి పడగలు చిన్నప్పుడు మా వూరు (అనంతపురం) లైబ్రరీ కి, రోజూ ౪ కిలో మీటర్లు నడిచెళ్ళి చదివాను. దాదాపు నెల రోజులు.. ఇంకా ఆ ఘుమఘుమలు వీడలేదు నన్ను.
నా అదృష్టం కొద్దీ మా లైబ్రరీలో (బనారస్ హిందూ యూనివర్శిటీ!) విశ్వనాథ వారివి చాలా పుస్తకాలు ఉన్నాయి. పురాణవైరగ్రంథమాల (కొన్ని మాత్రమే దొరికాయి), వేయి పడగలు (మా బావగారి దగ్గర ఉండేది - నాలుగయిదు సార్లయినా చదివి ఉంటాను), పునర్జన్మ (ఆ నవలలో టాపిక్ అది - పుస్తకం పేరు అది అవునో కాదో గుర్తు లేదు), అలాగే అడివి బాపిరాజు గారి నవలలు, అలాగే శ్రీపాద వారి వడ్లగింజలు ఇతర నవలికలు, కథలు. ఓహ్ ఎన్నని రాయను. ఈ పుస్తకాలు చదవకపోతే తెలుగు వాడిగా పుట్టిన జన్మ వేస్టు!
ఎవరేనా ఈ పుస్తకాలకు ఎబ్రిజ్డ్ వెర్శన్స్ వేస్తే బాగుండు - ఎందు కంటే చాలా మందికి అంతలావు పుస్తకాలు చదవడానికి సమయం లేదు. ఆ - మాలతీ చందూర్ గారు స్పాతి మంత్లీలో పాతకెరటాలని వ్రాస్తారు. వీటిల్లో వేయి పడగలను కూడా పరిచయం చేసారు.
మా కాలేజి లో మొత్తం నలుగురం మాత్రమే ఆ పుస్తకం చదివాము. దానితో ఆ పుస్తకం చదివే వాళ్లు , దాని గురించి తెలిసిన వాళ్లు తక్కువమందేమో అని ఇన్నాళ్ళు రాయలేదు. కాని నా అభిప్రాయంమార్చుకోవలసి వచ్చినందుకు ఆనందంగా వుంది. నా పోస్ట్ కి వ్యాఖ్యానాలు అందించిన వారికి , ముఖ్యంగా తెలుగు లో నేను మర్చిపోయిన వ్యాకరణాన్ని గుర్తు చేసిన నాగ ప్రసాద్ కి నెనర్లు.
వేయి పడగలని అలా చదివితేనే బాగుంటుందని నా అభిప్రాయం. సంక్షిప్తంగా రాస్తే వేయిపడగల గొప్పదనం తెలియదని నా అభిప్రాయం. కాని వేణు గోపాల్ గారన్నది కూడా నిజమే, ఇప్పుడు అంత పుస్తకం చదవడం కష్టమే. కాని చదివితే కనీసం మన తర్వాతి తరానికి అంతటి గొప్ప పుస్తకాల గురించి చెప్పగలం. వెయ్యి సంవత్సరాలు మనవలసిన పుస్తకాన్ని , వంద సంవత్సరాలకే మర్చిపోవలసి వస్తుందేమోనని భయం.
వేయి పడగల నీడలో నేను. -1 ఇంకా ఉంది అంటూ ముగించారు. దీని తరువాతి భాగం లింక్ ఇవ్వ కోరుతాను.
Post a Comment