జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
2009 లో అనుకుంటా మొదటిసారి వినుకొండకి హనుమద్రక్షాయాగానికి వెళ్ళడం జరిగింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం వెళ్తునే ఉన్నాను. అదొక అలౌకిక అనుభూతి. ఆ స్వామికి నా చేతులతో అభిషేకం చేసి అలంకరించే భాగ్యం కోటి జన్మలకైనా దొరకదు. రెండురోజులు మామూలు విషయాలకు దూరంగా హనుమద్వైభవాన్ని చూస్తూ గడిపే అదృష్టం స్వామి గత ఆరు సంవత్సరాలుగా ప్రసాదించారు. వెళ్తూనే తలస్నానాలు చేసి అమ్మవారికి, స్వామి వార్లకీ, పూజ చేసి మహా నైవేద్యం చెయ్యడం, తర్వాత అల్పాహారం. ఆ తర్వాత ఈ సంవత్సరం స్వామి ఎలా చేపిస్తారో అని అనుకుంటూ గడపడం. సాయంత్రం, రక్షలు తయారు చెయ్యడం, యాగకుండాలు తయారు చెయ్యడం, అప్పటివరకూ గోత్రనామాలు పంపిన వారి పేర్లు నోట్ చేస్కోవడం ఇలా మొదటిరోజు అయిపోయేది. తర్వాత రోజు ఇక సందడి, పొద్దున్నే కరెంట్ పోయే లోపు 108 కలశాలు తయారు చెయ్యాలి. ఒకసారి మా నాగప్రసాద్ అనుకుంటా, మోటర్ వేస్తారు కదా ఆ నీళ్ళు వాడి శుభ్రం చేద్దాం అని మీన మేషాలు లెక్కెట్టించాడు, చివరికి పనీ పూర్తవ్వలేదు, కరెంటూ పోయింది. ఇక అప్పటికప్పుడు బోరింగ్ దగ్గరికి పోయి నీళ్ళు పట్టుకువచ్చి కలశాలు తయారుచేసాం. ఎవరో ఒకతల్లి కూడా సహాయం చేసింది. పూజాద్రవ్యాలకి ఎడమచెయ్యి తగలకూడదని ముందే మాష్టరు గారు హెచ్చరించేవారు. తర్వాత స్వామికి అభిషేకాలు. ఇక అభిషేకాలప్పుడు చూడాలి. అంతెత్తు నిలబడ్డ స్వామికి స్నానం చేపించడమంటే మాటలా! పూజ్యగురువులు చాగంటివారు అంటారు విశ్వవ్యాపకుడైన స్వామికి మనం ఏం కైంకర్యం చెయ్యగలము అని. అది కళ్ళెదుట కనిపిస్తున్నట్టు ఉండేది. "యధా రాఘవ నిర్ముక్త శరశ్స్వసన విక్రమః, గచ్చేత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం" అని చెప్పి నిలబడ్డ స్వామి గుర్తొస్తారు ప్రతిసారి అభిషేకాలప్పుడు. ఇలా అభిషేకాలు జరుగుతున్నంతసేపూ విశాఖపట్నం నుంచి వచ్చిన బాబూరావుగారు ఏదో ఒక కీర్తన పాడుతునే ఉండేవారు. అసలే పొగిడితే పెరిగే స్వామి! అందులోనూ పాడుతున్నది MS Ramarao గారి దగ్గర సుందరకాండ నేర్చుకున్న వ్యక్తి. మామూలుగా ఉన్నప్పుడు ఆయన వయసు తెలిసేది కానీ, కీర్తన మొదలుపెట్టారంటే అలా వింటూ ఉండిపోవలనిపిస్తుంది. అలసటా, ఆయాసం ఏమీ అడ్డు వచ్చేవి కాదు. స్వామి హనుమ స్వయంగా సామగాన ధురంధరుడు, అలాంటిది ఆయనకి భక్తుడు పాడితే ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. ఈ అభిషేకాలు ఇలా జరుగుతూ ఉంటే ఎంత బాగుండో కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ స్వామి కి జలుబు చేస్తుందని ఆపేసేవాళ్ళం.
ఇక ఆ తర్వాత పొడ లేకుండా తుడిచి సింధూరం లేపనం చేస్తుంటే చూడాలి.
పంచశీర్షామివోరగా అని కీర్తించబడ్డ చేతులు,
ఉరయాపాస జీమూతమివమారుతః అని కీర్తించబడ్డ వక్షస్థలం
బాహుభ్యాం స్థంభయామాస అని కీర్తించబడ్డ భుజాలు,
పరిఘసన్నిభౌ అని కీర్తించబడ్డ తొడలు,
పరమపావనమైన ఆయన పాదాలు.... ఇలా శుభ్రంగా తుడిచి పూలతో అలంకరించేవాళ్ళం.
తరువాత, అంత స్వామి కి అంత గజమాల ధరింప జేసేవాళ్ళం.
ఈ లోపు కళ్యాణానికి శివపార్వతుల మూర్తులని శుభ్రం చేసేవాళ్ళం. పొయిన సారి అనుకుంటా నేను చాలా సీరియస్ గా పని చేసుకుంటుంటే మైథిలి వచ్చింది. ఏం చేస్తున్నావు నాన్నా అనింది. స్వామికి స్నానం చేపిస్తున్నా అని చెప్పా. సబ్బు ఎక్కువ పుయ్యకు కళ్ళు మండుతాయి అని చెప్పి చూస్తూ కూర్చుండిపోయింది. భలే అబ్బురమనిపించింది. అందుకు కదా బెజ్జమహాదేవి కోసం ఆ పరమశివుడు పసిపిల్లాడైపోయాడు అనిపించింది.
ఇక తరువాత యాగం. అన్నదానం చిదంబరశాస్త్రిగారి లాంటి హనుమదుపాసకుల ఆధ్వర్యంలో జరిగినప్పుడా యాగకీలల ఆనంద తాండవం చూడాలి. ఐదవసారి అనుకుంటా ముప్ఫైయేళ్ళు మేము ఈ కాడి మోసాము, ఇక మీ తరం ఎత్తుకోవాలి నాయనా అన్నారు. చాలా బాధనిపించింది. ఈ మధ్య నేను ఏ కార్యక్రమాలకి వెళ్ళడంలేదు, కానీ ఇక్కడికి మాత్రం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంతమంది యువత స్వామి కోసం చేస్తున్న పని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. వారు లేకుంటే ఆంధ్రలోకానికి పరాశరసంహిత ఇంత దగ్గర అయ్యుండేది కాదన్నది నిర్వివాదాంశం. వారు ఆనందించారంటే సాక్షాత్తు స్వామి ఆనందించినట్టే.
ఆరేళ్ళుగా జరుగుతున్న యాగమే అయినా ప్రతీసారి ఒక్కొక్కరకంగా జరిగింది.
ఒకసారి ద్వాదశకుండాలతో
ఒకసారి ఒకే కుండంలో
ఒకసారి 27 యజ్ఞ కుండాలలో 108 జంటలతో
ఒకసారి 27 యజ్ఞకుండాలలో 54 జంటలతో
ఇలా ఆయన ఇష్టం, ఎవరో ఒకరి నోట పలికిస్తాడు జరుగుతుంది.
యాగం జరుగుతున్నంతసేపూ చాలీసా పారాయణం జరుగుతూనే ఉండేది.
చివరగా బయలుదేరేముందు ఒక్కసారి ఆ స్వామి దగ్గరికి పోయి కూర్చునేవాడిని. నిన్నటి రోజున మన పక్కన తిరిగిన మనిషి ఈ రోజు హటాత్తుగా పెద్ద స్థితిమంతుడైపోతే ఎలా ఉంటుందో అలా అనిపించేది. నిన్న నిదానం గా స్నానం చేపించి, నిదానంగా సింధూరం పూసి, తక్కువపూలతో అలంకరణ చేసినా మా చేతుల్తో చేసాం అని తృప్తిగా ఉండేది. అదే ఇప్పుడు చూస్తే చుట్టూ రంగు రంగుల పూలతో, పసుపు కుంకుమలతో, తమలపాకులతో, కొబ్బరికాయలతో మామిడాకులతో మా స్వామేనా అని సందేహం వచ్చేది. అప్పుడు చూడాలి నా స్వామిని శుచిస్మిత అయిన సీతమ్మలా, సర్వసత్త్వమనోహరుడైన రాముడిలా, సత్వస్వరూపమైన శివుడిలా, మంగళరూపమైన గౌరీదేవిలా, సృష్తికర్త యైన బ్రహ్మలా, జ్ఞాననిధి యైన సరస్వతిలా సర్వదేవతా స్వరూపంగా కనపడి ప్రశాంతంగా బయలుదేరేవాడిని.
ఇక ఈసారి, ఏడవసారి మరింత బ్రహ్మాండంగా ఏడు రోజుల కార్యక్రమంగా రూపుదిద్దుకుని శనిత్రయోదశి నాడు పూర్ణాహుతి నిర్ణయించబడింది. సముద్రం దగ్గరికి చెంబు పట్టుకెడితే చెంబుడు నీళ్ళే వస్తాయి, బిందె పట్టుకెలితే బిందెడు నీళ్ళు వస్తాయి అని పూజ్యులు చాగంటి వారు చెప్పేవారు. ఆన్సైట్ కావాలో అని ఆయన్ని వేధించి, సుందరకాండ చూపించి బ్లాక్మెయిల్ చేసి చివరికి దేశం కాని దేశం లో కూర్చుని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అనిపిస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలేమో, ఏది వదులుకోవాలో తెలియక కావాల్సినదాన్ని వదులుకుని ఒక మిధ్యాప్రపంచంలో బతుకుతున్నామని తెలుసుకోడానికి నేను పెట్టిన పణం ఈ సారి జరుగుతున్న హనుమద్రక్షాయాగం. అక్కడ ఉంటే ఈపాటికి కలశాలు రెడీ చేసి ఉండేవాళ్ళం, ఈ పాటికి అభిషేకం అయిపోయేది, ఈ పాటికి భోజనాలు చేసేవాళ్ళు అందరూ, ఈ పాటికి కళ్యాణం అయిపోయేది, అని అనుకుంటూ ఉండాల్సొస్తుంది. కనీసం వచ్చే సారైనా హనుమజ్జయంతికి ఆ స్వామి పాదాల దగ్గర ఉండాలని కోరిక.
If anybody want to go on this Saturday(16th May2015) Pleasse contact durgeswara - 9948235641
No comments:
Post a Comment