Wednesday, September 9, 2015

ఇయేష

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
సుందరకాండ పారాయణ చెయ్యాలనుకునే వారికి కలిగే మొదటి ఆటంకి - సమయాభావం. అరవై ఎనిమిది సర్గలు, సంపుటీకరణ శ్లోకాలతో, మొదటిరోజూ, చివరి రోజూ మరిన్ని సర్గలతో పారాయణ చెయ్యాలనే ఆలోచనే అసలు పారాయణ చెయ్యాలా వద్దా అని సందేహం కలిగేలా  చేస్తుంది. అలాంటి దానికి సమాధానమే సుందరకాండలోని మొదటి శ్లోకంలోని ఇయేష అనే పదం. సంకల్పం అనేమాట ఇన్నాళ్ళూ చాలా చిన్నదిగా కనపడ్డది గానీ దాన్ని పారాయణలో వచ్చే సమస్యలతో కలిపి చూస్తే అది ఎంత పెద్దమాటో తెలుస్తుంది.
ఏ పారాయణ పద్దతైనా కానివ్వండి.
రోజుకి ఒకసర్గ చొప్పున అరవై ఎనిమిదిరోజులు చెయ్యి; అమ్మో అరవై ఎనిమిది రోజులా  అనిపిస్తుంది.
రోజుకు ఏదు సర్గలు చెయ్యి తొమ్మిది రోజులు; అమ్మో రోజూ ఏడు సర్గలా మొదటిరోజు పారాయణే కనీసం గంటన్నర పడుతుంది కదా, సముద్ర లంఘనమే అన్నిటికన్న పెద్ద సర్గ కదా అనిపిస్తుంది.
సరే రెండురోజులు పారాయణ చెయ్యి, ఇంకేమన్నా ఉందా నాలుగైదు గంటలు కూర్చోవడం సాధ్యమా అనిపిస్తుంది.
 
అందుకే ముందు సంకల్పించుకో అని చెప్తున్నారా వాల్మీకి మహర్షి  అనిపిస్తుంది. ఆ సంకల్పం కలగాలంటే ముందు దాని మీద ఇష్టం పెరగాలి. స్వామి అనుగ్రహం సరే సరి  కావాలనుకోండి. అంటే అసలు సుందరకాండ మన కళ్ళ ముందు ఉండాలి. అప్పుడు ఒకనాటికి కాకపోతే ఒకనాటికైనా ప్రయత్నిద్దాం అనిపిస్తుంది. అందులోనుండి పుడుతుంది సంకల్పం. దానికి స్వామి అనుగ్రహం తోడైతే పారాయణ జరుగుతుంది. ఒకవేళ చెయ్యలేకపోతే ఎందుకు చెయ్యలేదు, ఎందుకు చెయ్యలేను అన్న ప్రశ్న పుడుతుంది. దానిలోనుండి మొండి తనం పుడుతుంది. అప్పుడు, అలాంటి మొండిపట్టుదల కలిగినప్పుడు స్వామి వివశుడవుతాడు.
 
అలా వివశుడైన స్వామి   
చెయ్యి పట్టుకుని తనతో పాటు సముద్రాన్ని దాటిస్తారు,
మైనాకాన్ని ఎలా నిరసించాలో నేర్పిస్తారు.
సురసని ఎలా గెలవాలో నేర్పిస్తారు.
సింహికని ఎలా భంజించాలో చెప్తారు. 
లంకని ఎలా పడగొట్టాలో చెప్తారు.
ఆత్మాన్వేషణలో ఎలా ముందుకెళ్ళాలో చెప్తారు. 
"న తు సా జనకనందినీ " అంటూ జీవితంలో దేనికీ లొంగకుండా ఎలా బతకాలో నేర్పిస్తారు.
సీతమ్మనీ, రాముడినీ చూపిస్తారు.
మనజీవితాల్లో, మన ప్రవృత్తుల్లో, మన ప్రవర్తనల్లో రావణుడు ఎక్కడ దాక్కుని ఉంటాడో చూపిస్తారు.
ఆ పరాశక్తికి ఆత్మారాముని పరిస్థితిని ఎలా నివేదించాలో చెప్తారు.
సకల శక్తి స్వరూపమైన ఆ తల్లి శిరోమణిని మనకి అభయప్రదానంగా ఇస్తారు.
అరిష్టాన్ని (లంక నుండి స్వామి ఎగిరిన పర్వతం) నేలమట్టం చేసి మళ్ళీ తీసుకువస్తారు.
 
మరెందుకాలశ్యం, మొండి పట్టుదలతో నేను చేస్తాను స్వామీ అని చెప్పండి. మీ ధృతిని చూసి, అందుకు కావలసిన దృష్టిని, మతినీ, దాక్ష్యాన్నీ ఆయనే ప్రసాదిస్తాడు.
 
ఇక కామ్యాలంటారా అవి అనుషంగికాలు, మీరు అవసరం లేదన్నా అవి జరుగి తీరుతాయి. మీరు అవే కావాలనుకుంటే అంతవరకే దొరుకుతాయి. అంతకు మించి కావాలనుకుంటే, సుందరకాండలోని రత్నాలని ఏరడం మొదలుపెడితే కాలచక్రానికి ఉన్న పరిమితులని దాటాల్సి వస్తుంది. కొన్ని లక్షల యుగాలు ఆలోచించినా "పృషదంశకమాత్రస్సన్ భభూవద్భుతదర్శనః:" లాంటి అతి సామాన్య కధా పరమైన శ్లోకంలా అనిపించే శ్లోకాలు కూడ అర్ధం కావు.
ఎవరీ పిల్లి?
ఎందుకు అది రాత్రి పూట తిరుగుతుంది?
దానికి అద్భుతానికి సంబంధం ఏమిటి?
దాని అద్భుతాన్ని దర్శించే సామర్ధ్యంతో మనకేమిటి పని?
అసలు అద్భుతం అంటే ఏమిటి?
ఏమిటీ అద్భుతం?
ఎవరీ అద్భుతం?
ఎందుకీ అద్భుతాన్ని దర్శించాలి?
ఏమిటా అద్భుతంలో గొప్పదనం?
అందుకు పిల్లిలా మారాల్సిన అవసరం ఏమిటి? 
ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు బాణపరంపరలా చుట్టుముడతాయి. మామూలు బాణం గుచ్చుకుంటే రక్తం పోతుంది, తద్వారా మరణం ప్రాప్తమౌతుంది. కానీ ఈ బాణాలు గుచ్చుకుంటే  రక్తం పోదు, శుద్ధమౌతుంది , మరణం రాదు, పైగా మరణం పట్ల లక్ష్యం ఉండదు.
ఇక అరవై ఎనిమిది సర్గల్లో రమారమి నాలుగు వేల శ్లోకాల్లో ఎన్ని ప్రశ్నలొస్తాయో, ఎంత సమయం కావాలో చెప్పండి. ఇక సాటి మనిషి మీద కోప్పడే సమయం, ఇంకొకరిని నాశనం చెయ్యాలనే దుర్మార్గపు ఆలోచనలు కలగడానికి సమయమేది.   
అందుకే షోడశి లో శేషేంద్ర శర్మ గారు అంటారు. రామాయణంలోని ఒక్కొక్క అక్షరమూ, ఒక్కొక్క పదమూ, ఒక్కొక్క వాక్యమూ, ఒక్కొక్క శ్లోకమూ, ఒక జీవిత కాలం పరిశోధన చేసి తెలుసుకోవాలి. నేను చెయ్యగలిగినది ఇది. ముందు తరాలవాళ్ళు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి" అని.  
మహా మహోపాధ్యాయ శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు ఒక మాట అంటారు. ప్రతి మనిషి రోజూ విష్ణు సహస్రం,ఆదిత్యహృదయం, సుందరకాండ, భగవద్గీత తప్పకుండా చదవాలి అని
పుజ్య గురువులు చాగంటి గారు కూడా ఇదే అనేవారు " సుందరకాండ, భగవద్గీతలు కృపా సింధువులు, సముద్రం దగ్గరికి ఎంత పాత్ర పట్టుకు వెడితే అంత నీరే దొరుకుతుంది" అని.

నా జీవితం చివరిదశలో ఉన్నప్పుడు, సుందరకాండను చూస్తూనో, లేదంటే వింటూనో, శరీరం సహకరిస్తే పారాయణ చేస్తూనో త్యజించాలనేది నా కోరిక. అది మొండి పట్టుదలగా మారి ఆ దిశగా స్వామి ని వివశుడిని చెయ్యాలంటే ఎంత ఎక్కువ వీలైతే అంతగా సుందరకాండ వినడం, పారాయణ చెయ్యడం, చెప్పడమే మార్గం.
 

Tuesday, July 7, 2015

శ్రీమద్రామాయణ కల్ప వృక్షం.

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
Can any body help me in getting printed versions of these books. I will be so grateful to them.

చివరిసారిగా శివరాత్రికి ఏమో ఒక టపా రాసాను. మధ్యలో హనుమజ్జయంతి కి రాసాను. అంతే మళ్ళీ ఎందుకో రాయలేకపోయాను. కానీ ఈ రోజు రాయాలనిపించింది.

నేను తెలుగు రామాయణాలు, వ్యాఖ్యానాలు, పరిశొధనా పత్రాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నానని నా మిత్రులు చాలామందికి తెలుసు. ఈ రోజుకి ఆ భండాగారంలో మరో కలికితురాయి చేరింది. అదే శ్రీమద్రామాయణ కల్ప వృక్షం.
మొన్న మొన్న వరకు కల్పవృక్షం అంటే కల్పవృక్షం అనుకున్నాను. ఒక గొప్పాయన తో కలిసి బాలకాండ కొంత పారాయణ చెయ్యడం జరిగింది. అప్పుడే కొనాలన్న కోరిక పెరిగింది. అది ఈ రోజుకి తీరింది.

దీనితో నా దగ్గర
శ్రీమాన్ శ్రీభాష్యం  అప్పలాచార్య స్వామి వారి రామాయణ తత్వదీపిక
చాగంటి వారి రామాయణ ప్రవచనాలు
ఆధ్యాత్మ రామాయణం
శ్రీమద్రామాయణ కల్పవృక్షం
ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి మందరము (3 భాగాలు) - pdf
శబరి (కల్పవృక్ష శబరి మీద వ్యాసాలు) - pdf
సీతారామాంజనేయ సంవాదం ( పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారు) - pdf
ఆశ్చర్య రామాయణం సుందరకాండ (లక్కావఝ్ఝుల  వేంకట కృష్ణ శాస్త్రి గారు) -pdf
శ్రీరామావతార తత్వము (చిలుకూరు వేంకటేశ్వర్లు గారు)
షోడశి రామాయణ రహస్యాలు (గుంటూరు శేషేంద్ర శర్మ గారు)
త్రిదండి స్వామి వారి సంస్కృత వ్యాఖ్య  -pdf
రంగనాధ రామాయణం -pdf
వచన రామాయణం -2 (శ్రీ శ్రీనివాస శిరోమణి గారు) -pdf
జానకీ శపధం (హరికథ- శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయాణదాసు గారు) -pdf
వాల్మీకి రామాయణ విమర్శనము (కొడాలి లక్ష్మీ నారాయణ)  -pdf
కల్ప తరువు (ఆంధ్ర బెర్నార్డ్ షా- వేదాంత కవి) - pdf
రామాయణ రహస్యాల సమీక్ష (వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు) -pdf
వాల్మీకి రామయణం సంబంధాలు (డా. డి నరసింహా రెడ్డి) -pdf
శ్రీమద్వాల్మీకి రామయణోపన్యాసాలు (2,3,4) (నండూరు సుబ్రమణ్య శర్మ) -pdf


ఇంకా సంపాదించాల్సినవి
భాస్కర రామాయణము (ఆన్ లైన్ లో దొరుకుతుంది, కానీ తాత్పర్యం వుందో లేదో అని ఆగిపోయాను)
మొల్ల రామాయణం
గణపతి రామాయణ సుధ
చంపూ రామాయణం
పుల్లెల రామచంద్రుల వారి వ్యాఖ్య
పేరు తెలియదు కానీ వాల్మీకి మీద, ఆయన కవిత్వంలోని విచిత్రాల మీద, పన్నెండు సంవత్సరాల క్రితం అనంతపురం గ్రంధాలయంలో ఒక పరిశోధన గ్రంధం చదివాను. అది ఎప్పటికైనా సంపాదించాలి
విశ్వనాధ వారి నా రాముడు
ఆనంద రామాయణం
ఆశ్చర్య రామాయణం

ఎప్పటికి సంపాదిస్తానో..... చూద్దాం


Wednesday, May 13, 2015

హనుమజ్జయంతి 2015

 
జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
2009 లో అనుకుంటా మొదటిసారి వినుకొండకి హనుమద్రక్షాయాగానికి వెళ్ళడం జరిగింది.  అప్పటినుండి ప్రతి సంవత్సరం వెళ్తునే ఉన్నాను. అదొక అలౌకిక అనుభూతి. స్వామికి నా చేతులతో అభిషేకం చేసి అలంకరించే భాగ్యం కోటి జన్మలకైనా దొరకదు. రెండురోజులు మామూలు విషయాలకు దూరంగా హనుమద్వైభవాన్ని చూస్తూ గడిపే అదృష్టం స్వామి గత ఆరు సంవత్సరాలుగా ప్రసాదించారు. వెళ్తూనే తలస్నానాలు చేసి అమ్మవారికి, స్వామి వార్లకీ,  పూజ చేసి మహా నైవేద్యం చెయ్యడం, తర్వాత అల్పాహారం. తర్వాత సంవత్సరం స్వామి ఎలా చేపిస్తారో అని అనుకుంటూ గడపడం. సాయంత్రం, రక్షలు తయారు చెయ్యడం, యాగకుండాలు తయారు చెయ్యడం, అప్పటివరకూ గోత్రనామాలు పంపిన వారి పేర్లు నోట్ చేస్కోవడం ఇలా మొదటిరోజు అయిపోయేది. తర్వాత రోజు ఇక సందడి, పొద్దున్నే కరెంట్ పోయే లోపు 108 కలశాలు తయారు చెయ్యాలి. ఒకసారి మా నాగప్రసాద్ అనుకుంటా, మోటర్ వేస్తారు కదా నీళ్ళు వాడి శుభ్రం చేద్దాం అని మీన మేషాలు లెక్కెట్టించాడు, చివరికి పనీ పూర్తవ్వలేదు, కరెంటూ పోయింది. ఇక అప్పటికప్పుడు బోరింగ్ దగ్గరికి పోయి నీళ్ళు పట్టుకువచ్చి కలశాలు తయారుచేసాం. ఎవరో ఒకతల్లి కూడా సహాయం చేసింది. పూజాద్రవ్యాలకి ఎడమచెయ్యి తగలకూడదని ముందే మాష్టరు గారు హెచ్చరించేవారు.  తర్వాత స్వామికి అభిషేకాలు. ఇక అభిషేకాలప్పుడు చూడాలి. అంతెత్తు నిలబడ్డ స్వామికి స్నానం చేపించడమంటే మాటలా! పూజ్యగురువులు చాగంటివారు అంటారు విశ్వవ్యాపకుడైన స్వామికి మనం ఏం కైంకర్యం చెయ్యగలము అని. అది కళ్ళెదుట కనిపిస్తున్నట్టు ఉండేది. "యధా రాఘవ నిర్ముక్త శరశ్స్వసన విక్రమః, గచ్చేత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం" అని చెప్పి నిలబడ్డ స్వామి గుర్తొస్తారు ప్రతిసారి అభిషేకాలప్పుడు. ఇలా అభిషేకాలు జరుగుతున్నంతసేపూ విశాఖపట్నం నుంచి వచ్చిన బాబూరావుగారు ఏదో ఒక కీర్తన పాడుతునే ఉండేవారు. అసలే పొగిడితే పెరిగే స్వామి! అందులోనూ పాడుతున్నది MS Ramarao గారి దగ్గర సుందరకాండ నేర్చుకున్న వ్యక్తి. మామూలుగా ఉన్నప్పుడు ఆయన వయసు తెలిసేది కానీ, కీర్తన మొదలుపెట్టారంటే అలా వింటూ ఉండిపోవలనిపిస్తుంది. అలసటా, ఆయాసం ఏమీ అడ్డు వచ్చేవి కాదు. స్వామి హనుమ స్వయంగా సామగాన ధురంధరుడు, అలాంటిది  ఆయనకి భక్తుడు పాడితే ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. అభిషేకాలు ఇలా జరుగుతూ ఉంటే ఎంత బాగుండో కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ స్వామి కి జలుబు చేస్తుందని ఆపేసేవాళ్ళం.       
 
ఇక తర్వాత పొడ లేకుండా తుడిచి సింధూరం లేపనం చేస్తుంటే చూడాలి.
 
పంచశీర్షామివోరగా అని కీర్తించబడ్డ చేతులు,
ఉరయాపాస జీమూతమివమారుతః అని కీర్తించబడ్డ వక్షస్థలం
బాహుభ్యాం స్థంభయామాస అని కీర్తించబడ్డ భుజాలు,
పరిఘసన్నిభౌ అని కీర్తించబడ్డ తొడలు,
పరమపావనమైన ఆయన పాదాలు.... ఇలా శుభ్రంగా తుడిచి పూలతో అలంకరించేవాళ్ళం.   
 
తరువాత, అంత స్వామి కి అంత గజమాల ధరింప జేసేవాళ్ళం.
 
లోపు కళ్యాణానికి శివపార్వతుల మూర్తులని శుభ్రం చేసేవాళ్ళం. పొయిన సారి అనుకుంటా నేను చాలా సీరియస్ గా  పని చేసుకుంటుంటే మైథిలి వచ్చింది. ఏం చేస్తున్నావు నాన్నా అనింది. స్వామికి స్నానం చేపిస్తున్నా అని చెప్పా. సబ్బు ఎక్కువ పుయ్యకు కళ్ళు మండుతాయి అని చెప్పి చూస్తూ కూర్చుండిపోయింది. భలే అబ్బురమనిపించింది. అందుకు కదా బెజ్జమహాదేవి కోసం పరమశివుడు పసిపిల్లాడైపోయాడు అనిపించింది. 
 
ఇక తరువాత యాగం. అన్నదానం చిదంబరశాస్త్రిగారి లాంటి హనుమదుపాసకుల ఆధ్వర్యంలో జరిగినప్పుడా యాగకీలల ఆనంద తాండవం చూడాలి. ఐదవసారి అనుకుంటా ముప్ఫైయేళ్ళు మేము కాడి మోసాము, ఇక మీ తరం ఎత్తుకోవాలి నాయనా అన్నారు. చాలా బాధనిపించింది. మధ్య నేను కార్యక్రమాలకి వెళ్ళడంలేదు, కానీ ఇక్కడికి మాత్రం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంతమంది యువత స్వామి కోసం చేస్తున్న పని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. వారు లేకుంటే ఆంధ్రలోకానికి పరాశరసంహిత ఇంత దగ్గర అయ్యుండేది కాదన్నది నిర్వివాదాంశం. వారు ఆనందించారంటే సాక్షాత్తు స్వామి ఆనందించినట్టే.
 
ఆరేళ్ళుగా జరుగుతున్న యాగమే అయినా ప్రతీసారి ఒక్కొక్కరకంగా జరిగింది.
ఒకసారి ద్వాదశకుండాలతో
ఒకసారి ఒకే కుండంలో
ఒకసారి 27 యజ్ఞ కుండాలలో 108 జంటలతో
ఒకసారి 27 యజ్ఞకుండాలలో 54 జంటలతో
ఇలా ఆయన ఇష్టం, ఎవరో ఒకరి నోట పలికిస్తాడు జరుగుతుంది.
యాగం జరుగుతున్నంతసేపూ చాలీసా పారాయణం జరుగుతూనే ఉండేది.
 
చివరగా బయలుదేరేముందు ఒక్కసారి స్వామి దగ్గరికి పోయి కూర్చునేవాడిని. నిన్నటి రోజున మన పక్కన తిరిగిన మనిషి రోజు హటాత్తుగా పెద్ద స్థితిమంతుడైపోతే ఎలా ఉంటుందో అలా అనిపించేది. నిన్న నిదానం గా స్నానం చేపించి, నిదానంగా సింధూరం పూసి, తక్కువపూలతో అలంకరణ చేసినా మా చేతుల్తో చేసాం అని తృప్తిగా ఉండేది.  అదే ఇప్పుడు చూస్తే చుట్టూ రంగు రంగుల పూలతో, పసుపు కుంకుమలతో, తమలపాకులతో, కొబ్బరికాయలతో మామిడాకులతో మా స్వామేనా అని సందేహం వచ్చేది. అప్పుడు చూడాలి నా స్వామిని శుచిస్మిత అయిన సీతమ్మలా, సర్వసత్త్వమనోహరుడైన రాముడిలా, సత్వస్వరూపమైన శివుడిలా, మంగళరూపమైన గౌరీదేవిలా, సృష్తికర్త యైన బ్రహ్మలా, జ్ఞాననిధి యైన సరస్వతిలా సర్వదేవతా స్వరూపంగా కనపడి ప్రశాంతంగా బయలుదేరేవాడిని.

 

 

 
 
 
ఇక ఈసారి, ఏడవసారి మరింత బ్రహ్మాండంగా ఏడు రోజుల కార్యక్రమంగా రూపుదిద్దుకుని శనిత్రయోదశి నాడు పూర్ణాహుతి నిర్ణయించబడింది. సముద్రం దగ్గరికి చెంబు పట్టుకెడితే చెంబుడు నీళ్ళే వస్తాయి, బిందె పట్టుకెలితే బిందెడు నీళ్ళు వస్తాయి అని పూజ్యులు చాగంటి వారు చెప్పేవారు. ఆన్సైట్ కావాలో అని ఆయన్ని వేధించి, సుందరకాండ చూపించి బ్లాక్మెయిల్ చేసి చివరికి దేశం కాని దేశం లో కూర్చుని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అనిపిస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలేమో, ఏది వదులుకోవాలో తెలియక కావాల్సినదాన్ని వదులుకుని ఒక మిధ్యాప్రపంచంలో బతుకుతున్నామని తెలుసుకోడానికి నేను పెట్టిన పణం సారి జరుగుతున్న హనుమద్రక్షాయాగం. అక్కడ ఉంటే ఈపాటికి కలశాలు రెడీ చేసి ఉండేవాళ్ళం, పాటికి అభిషేకం అయిపోయేది, ఈ పాటికి భోజనాలు చేసేవాళ్ళు అందరూ, పాటికి కళ్యాణం అయిపోయేది, అని అనుకుంటూ ఉండాల్సొస్తుంది. కనీసం వచ్చే సారైనా హనుమజ్జయంతికి స్వామి పాదాల దగ్గర ఉండాలని కోరిక.
 
If anybody want to go on this Saturday(16th May2015) Pleasse contact durgeswara - 9948235641