Wednesday, September 9, 2015

ఇయేష

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
సుందరకాండ పారాయణ చెయ్యాలనుకునే వారికి కలిగే మొదటి ఆటంకి - సమయాభావం. అరవై ఎనిమిది సర్గలు, సంపుటీకరణ శ్లోకాలతో, మొదటిరోజూ, చివరి రోజూ మరిన్ని సర్గలతో పారాయణ చెయ్యాలనే ఆలోచనే అసలు పారాయణ చెయ్యాలా వద్దా అని సందేహం కలిగేలా  చేస్తుంది. అలాంటి దానికి సమాధానమే సుందరకాండలోని మొదటి శ్లోకంలోని ఇయేష అనే పదం. సంకల్పం అనేమాట ఇన్నాళ్ళూ చాలా చిన్నదిగా కనపడ్డది గానీ దాన్ని పారాయణలో వచ్చే సమస్యలతో కలిపి చూస్తే అది ఎంత పెద్దమాటో తెలుస్తుంది.
ఏ పారాయణ పద్దతైనా కానివ్వండి.
రోజుకి ఒకసర్గ చొప్పున అరవై ఎనిమిదిరోజులు చెయ్యి; అమ్మో అరవై ఎనిమిది రోజులా  అనిపిస్తుంది.
రోజుకు ఏదు సర్గలు చెయ్యి తొమ్మిది రోజులు; అమ్మో రోజూ ఏడు సర్గలా మొదటిరోజు పారాయణే కనీసం గంటన్నర పడుతుంది కదా, సముద్ర లంఘనమే అన్నిటికన్న పెద్ద సర్గ కదా అనిపిస్తుంది.
సరే రెండురోజులు పారాయణ చెయ్యి, ఇంకేమన్నా ఉందా నాలుగైదు గంటలు కూర్చోవడం సాధ్యమా అనిపిస్తుంది.
 
అందుకే ముందు సంకల్పించుకో అని చెప్తున్నారా వాల్మీకి మహర్షి  అనిపిస్తుంది. ఆ సంకల్పం కలగాలంటే ముందు దాని మీద ఇష్టం పెరగాలి. స్వామి అనుగ్రహం సరే సరి  కావాలనుకోండి. అంటే అసలు సుందరకాండ మన కళ్ళ ముందు ఉండాలి. అప్పుడు ఒకనాటికి కాకపోతే ఒకనాటికైనా ప్రయత్నిద్దాం అనిపిస్తుంది. అందులోనుండి పుడుతుంది సంకల్పం. దానికి స్వామి అనుగ్రహం తోడైతే పారాయణ జరుగుతుంది. ఒకవేళ చెయ్యలేకపోతే ఎందుకు చెయ్యలేదు, ఎందుకు చెయ్యలేను అన్న ప్రశ్న పుడుతుంది. దానిలోనుండి మొండి తనం పుడుతుంది. అప్పుడు, అలాంటి మొండిపట్టుదల కలిగినప్పుడు స్వామి వివశుడవుతాడు.
 
అలా వివశుడైన స్వామి   
చెయ్యి పట్టుకుని తనతో పాటు సముద్రాన్ని దాటిస్తారు,
మైనాకాన్ని ఎలా నిరసించాలో నేర్పిస్తారు.
సురసని ఎలా గెలవాలో నేర్పిస్తారు.
సింహికని ఎలా భంజించాలో చెప్తారు. 
లంకని ఎలా పడగొట్టాలో చెప్తారు.
ఆత్మాన్వేషణలో ఎలా ముందుకెళ్ళాలో చెప్తారు. 
"న తు సా జనకనందినీ " అంటూ జీవితంలో దేనికీ లొంగకుండా ఎలా బతకాలో నేర్పిస్తారు.
సీతమ్మనీ, రాముడినీ చూపిస్తారు.
మనజీవితాల్లో, మన ప్రవృత్తుల్లో, మన ప్రవర్తనల్లో రావణుడు ఎక్కడ దాక్కుని ఉంటాడో చూపిస్తారు.
ఆ పరాశక్తికి ఆత్మారాముని పరిస్థితిని ఎలా నివేదించాలో చెప్తారు.
సకల శక్తి స్వరూపమైన ఆ తల్లి శిరోమణిని మనకి అభయప్రదానంగా ఇస్తారు.
అరిష్టాన్ని (లంక నుండి స్వామి ఎగిరిన పర్వతం) నేలమట్టం చేసి మళ్ళీ తీసుకువస్తారు.
 
మరెందుకాలశ్యం, మొండి పట్టుదలతో నేను చేస్తాను స్వామీ అని చెప్పండి. మీ ధృతిని చూసి, అందుకు కావలసిన దృష్టిని, మతినీ, దాక్ష్యాన్నీ ఆయనే ప్రసాదిస్తాడు.
 
ఇక కామ్యాలంటారా అవి అనుషంగికాలు, మీరు అవసరం లేదన్నా అవి జరుగి తీరుతాయి. మీరు అవే కావాలనుకుంటే అంతవరకే దొరుకుతాయి. అంతకు మించి కావాలనుకుంటే, సుందరకాండలోని రత్నాలని ఏరడం మొదలుపెడితే కాలచక్రానికి ఉన్న పరిమితులని దాటాల్సి వస్తుంది. కొన్ని లక్షల యుగాలు ఆలోచించినా "పృషదంశకమాత్రస్సన్ భభూవద్భుతదర్శనః:" లాంటి అతి సామాన్య కధా పరమైన శ్లోకంలా అనిపించే శ్లోకాలు కూడ అర్ధం కావు.
ఎవరీ పిల్లి?
ఎందుకు అది రాత్రి పూట తిరుగుతుంది?
దానికి అద్భుతానికి సంబంధం ఏమిటి?
దాని అద్భుతాన్ని దర్శించే సామర్ధ్యంతో మనకేమిటి పని?
అసలు అద్భుతం అంటే ఏమిటి?
ఏమిటీ అద్భుతం?
ఎవరీ అద్భుతం?
ఎందుకీ అద్భుతాన్ని దర్శించాలి?
ఏమిటా అద్భుతంలో గొప్పదనం?
అందుకు పిల్లిలా మారాల్సిన అవసరం ఏమిటి? 
ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు బాణపరంపరలా చుట్టుముడతాయి. మామూలు బాణం గుచ్చుకుంటే రక్తం పోతుంది, తద్వారా మరణం ప్రాప్తమౌతుంది. కానీ ఈ బాణాలు గుచ్చుకుంటే  రక్తం పోదు, శుద్ధమౌతుంది , మరణం రాదు, పైగా మరణం పట్ల లక్ష్యం ఉండదు.
ఇక అరవై ఎనిమిది సర్గల్లో రమారమి నాలుగు వేల శ్లోకాల్లో ఎన్ని ప్రశ్నలొస్తాయో, ఎంత సమయం కావాలో చెప్పండి. ఇక సాటి మనిషి మీద కోప్పడే సమయం, ఇంకొకరిని నాశనం చెయ్యాలనే దుర్మార్గపు ఆలోచనలు కలగడానికి సమయమేది.   
అందుకే షోడశి లో శేషేంద్ర శర్మ గారు అంటారు. రామాయణంలోని ఒక్కొక్క అక్షరమూ, ఒక్కొక్క పదమూ, ఒక్కొక్క వాక్యమూ, ఒక్కొక్క శ్లోకమూ, ఒక జీవిత కాలం పరిశోధన చేసి తెలుసుకోవాలి. నేను చెయ్యగలిగినది ఇది. ముందు తరాలవాళ్ళు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి" అని.  
మహా మహోపాధ్యాయ శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు ఒక మాట అంటారు. ప్రతి మనిషి రోజూ విష్ణు సహస్రం,ఆదిత్యహృదయం, సుందరకాండ, భగవద్గీత తప్పకుండా చదవాలి అని
పుజ్య గురువులు చాగంటి గారు కూడా ఇదే అనేవారు " సుందరకాండ, భగవద్గీతలు కృపా సింధువులు, సముద్రం దగ్గరికి ఎంత పాత్ర పట్టుకు వెడితే అంత నీరే దొరుకుతుంది" అని.

నా జీవితం చివరిదశలో ఉన్నప్పుడు, సుందరకాండను చూస్తూనో, లేదంటే వింటూనో, శరీరం సహకరిస్తే పారాయణ చేస్తూనో త్యజించాలనేది నా కోరిక. అది మొండి పట్టుదలగా మారి ఆ దిశగా స్వామి ని వివశుడిని చెయ్యాలంటే ఎంత ఎక్కువ వీలైతే అంతగా సుందరకాండ వినడం, పారాయణ చెయ్యడం, చెప్పడమే మార్గం.