ఈ రోజు పౌర్ణమి.ఎందుకో ఈ మధ్య పౌర్ణమి అంటే కొంచెం దిగులుగా ఉంటుంది. "చంద్రమా మనసో జాతః" అని ఎందుకన్నారో కానీ, రేపటినుండి ఆకాశంలో చంద్రుడు ఆలస్యంగా వస్తాడని బాధ. నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేసరికి అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చే నా కూతురుకి ఇప్పుడు ఏ చందమామని చూపించి "చందమామ రావే" అని పాటపాడాలి? ప్రతిరోజూ ఒకే టైమ్ కి చందమామ ని పరిశీలిస్తూ ఉంటాము నేను, మైథిలీ. విదియ రోజు ఏడింటికి పడమర దిక్కున చివరి మెట్టు మీద ఉన్నట్టు కనపడే ఆయన రోజులు గడిచే కొద్దీ నడినెత్తి మీదికి వస్తాడు, పౌర్ణమికి తూర్పుకి తిరుగుతాడు. అప్పుడు పైన స్లాబ్ అడ్డు వస్తుంది కదా, అప్పుడు మైథిలి చందమామని వెతకడానికి పడే పాట్లు చూడాలి. అటు తిరిగి,ఇటు తిరిగి, ఆ చివరికి పోయి, ఈ చివరికి పోయి, మెట్లు ఎక్కి, దిగి, చివరికి మెట్లు పైదాక ఎక్కి చూస్తే కనపడతాడు. అప్పుడు ఆ పసిపిల్ల ముఖంలో కనపడే ఆనందం ఎంత హాయిగా ఉంటుందో. నిండా పదహారు నెలలు లేవు, ఏమర్ధమవుతుందో, ఏమనిపిస్తుందో మరి చందమామని చూస్తే. మనవరకు ఎందుకు సుందరకాండలో ఆ స్వామికే ఉత్తేజాన్నిచ్చి, సాచిర్యం చేసాడాయన.
చెయ్యెత్తి చందమామని పిలిచినా, చేతిలో ఏమన్నా ఉంటే చందమామకి పెట్టమంటే చెయ్యి సాగదీసినా , దా దా అని చందమామని పిలిచినా, చందమామకి టాటా చెప్పమంటే చెయ్యి పదహారు వంకలు తిప్పి టాటా చెప్పినా పసిపిల్లలకే చెల్లు. అందుకేనేమో మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని దేవుడితో పోల్చారు పెద్దలు. సనక సనందాదులు, ప్రహ్లాదుడు ఐదేళ్ళవారు. మీరు పసిపిల్లలలాగునైతేనే దేవునిరాజ్యంలోకి ప్రవేశించగలరు అన్నది బైబిల్. ఒక్కసారి బయటికి వచ్చి మీ కుటుంబంతో సాయంత్రం పూట డాబా మీద కూర్చుని పున్నమి చంద్రుని వెన్నెలలని అనుభవించండి. వేలరూపాయలు తగలేసి వెలిగించే డిస్కో లైట్లు వాటిముందు దిగదుడుపే.
ఎప్పుడైనా సాయంత్రం పూట రోడ్డుమీద నడుస్తూ ఉంటే తల పైకెత్తి చందమామని చూస్తూనో, లేకుంటే వెతుకుతూనో ఉంటుంది. ఉంటే మొహం వెలిగిపోతుంది. లేకుంటే చిన్నగా అయిపోతుంది. అలా తల పైకెత్తి చందమామని వెతుకుతుంటే సుందరకాండలో స్వామి సముద్రాన్ని దాటడానికి గరుత్మంతుడిని తలచుకుని తల పైకెత్తి నిలుచున్న సన్నివేశం గుర్తు వస్తుంది.
అందుకే పౌర్ణమి అంటే నాకు దిగులు. రేపటినుండి చందమామ కనపడక మొత్తం వెతికొచ్చి చేతులు తిప్పుతూ "పొయ్,పొయ్" అని చెప్తుంది? (తన బాషలో పోయింది అని). ఏం చెయ్యాలి?