Monday, July 26, 2010

ధర్మాత్మా సత్యసంధశ్చ vs వేణుగారి హీరోలు

జై శ్రీ రాం,
శ్రీ రామదూతం శిరసా నమామి!
-------------------------------------------
వేణు గారు వారి హీరోల గురించి రాసిన బ్లాగుకు కామెంట్ రాద్దామనుకుంటే సాంకేతిక సమస్యవల్ల ఎందుకో పోస్ట్ కాలేదు. అందువల్ల ఇక్కడ రాస్తున్నాను.నిజానికి సుందరకాండ వినడానికి మా పూజా గదికొచ్చిన రామచంద్ర మూర్తి గురించి రాద్దామనుకున్నాను. కానీ ఆ స్వామి ఈ విషయం మీద రాయించాడు.
-------------------------------------------

నిజానికి వాలి విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఐతే ఆ సందేహం వచ్చినప్పుడు స్వయంగా రామాయణాన్ని చదివి తెలుసుకుందామనుకునేవాళ్ళు తక్కువ. దానితో ఎవరో చెప్పిన దాన్ని ఎక్కడో చదివేసి వాళ్ళ అభిప్రాయాన్ని తమ అభిప్రాయంగా నిర్ణయించేసుకుంటారు.మీరు కూడా అలాగే అనుకున్నారు. అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఎలా అలోచిస్తున్నారో అలా చెప్పే పుస్తకాన్నే మీరు చదివారు. మీరు చెప్తున్న సదరు విషవృక్షం అలాంటిదే.
ఎందుకంటారా?
రామాయణంలో ప్రతీ ఘట్టమూ రాముని ఔన్నత్యాన్ని చెప్తుంది, నాకు బాగా నచ్చిన రెండు ఉదాహరణలు చెప్తాను వినండి.
ఒకటి, రామాయణ ఆవిర్భావం సందర్భం లో వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన ప్రశ్న.(కోన్వస్మిన్ సాంప్రతే లోకే..)
ధర్మం తప్పనివాడూ, సత్యం తప్పనివాడూ, సచ్ఛీలం కలిగిన వాడూ ఇలా అటూఇటుగా పదహారు గుణాలను చెప్పి ఇలాంటి వాడిని గురించి చెప్పమంటే, నారదుడు చెప్పింది ఆ రాముడి గురించి. అడిగింది తన నడవడికతో ఎంతటి పామరుడైనా, కౄరుడైనా మహర్షి గా మారవచ్చని నిరూపించిన వాల్మీకి. చెప్పింది బ్రహ్మ మానసపుత్రుడూ, నిరంతరహరినామ సంకీర్తనా తత్పురుషుడైన బ్రహ్మర్షి. మరి అలాంటప్పుడు నారదమహర్షి ఒక హంతకుడి గురించి, అన్నదమ్ములమధ్య వచ్చిన తగవుని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశవాదిని గురించా చెప్తాడు? చెప్పడు గాక చెప్పడు . మరి ఎందుకు చెప్పాడు ? ఈ ప్రశ్న ఏ ఒక్కసారైనా మనలని మనం వేసుకుంటే సమాధానం ఇట్టే తెలుస్తుంది.

ఇక రెండవది.
యుద్ధకాండలో లక్ష్మణస్వామి మేఘనాధున్ని సంహరించడానికి వాడిన మంత్రం.
"ధర్మాత్మా సత్యసంధశ్చ రామో ధాశరధిర్యదీ!
పౌరుషేచాప్రతిద్వంద్వం శరైనం జహి రావణిం!!
రాముడు ధశరధనందనుడూ, ధర్మాత్ముడూ, సత్యసంధుడూ, పరాక్రమంలో ఎదురులేని వాడూ అయితే ఈ బాణం మేఘనాధుణ్ణి సంహరించు గాక.
దీని తర్వాత ఇంద్రజిత్తు మరణించాడని వాల్మీకి మహర్షి రాసినదే కదా, మరి దీన్నెందుకు ఒప్పుకోరో నాకర్ధం కాదు.
ఈ రెండు విషయాలు వాలి వధ తర్వాతే జరిగాయి అన్నది గుర్తుంచుకోవాల్సిన , గమనించాల్సిన విషయం.

ఇకపోతే మీరన్న ఆ సదరు రచయితలు అన్నట్టు రాముడు అన్యాయంగా వాలిని చంపేస్తే
రాముడి పని మీద తిరుగుతున్న వానరులకి మాటసాయం చేసినంత మాత్రాన సంపాతికి కాలిపోయిన రెక్కలు ఎందుకు వచ్చాయో చెప్పరు.
రాముడి పని మీద వెల్తున్న వాడి కోసం తన రెక్కలు పోతాయని తెలిసీ మైనాకుడు ఎందుకు బయటకు వచ్చాడో చెప్పరు. రామాయణం లో ఎంతో తెలివైనదిగా,పతివ్రతగా పేరు గాంచిన తార కూడా రాముడిని పల్లెత్తు మాట ఎందుకనలేదో చెప్పరు.
నా భర్త ధర్మం తప్పని వాడైతే హనుమ తోకకు ఏమీ కాకూడదు అని సీతమ్మ అడిగితే అగ్ని హనుమను ఎందుకు దహించలేదో చెప్పరు.
పైన చెప్పిన లక్ష్మణ మూర్తి శపధం ఎందుకు విఫలం కాలేదో చెప్పరు.


కాదూ వాల్మీకి రాసినవన్నీ నమ్ముతామా , మాకు నచ్చినవీ, రామాయణంలో మాకు ఇది నచ్చలేదు అని చెప్పుకోవడానికి అనువుగా ఉండేవి మాత్రమే నమ్ముతాము అంటే చెప్పేదేమీ లేదు. వాలిని,శంభూకుడిని చంపాడు, సీతని అగ్ని ప్రవేశం చేయించాడు, అడవులకి పంపాడు ఇలాంటివి మాత్రమే నిజాలు మిగతావి కాదు అంటే ఈ వ్యాఖ్యని మీరన్నా డిలీట్ చేసెయ్యండి, లేదా నేనన్నా డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే మనం ఒకరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము అంటే దానికొక బేస్ కావాలి. ఇక్కడ ఆ బేస్ వాల్మీకి రామాయణం నిజం అనో లేదా అబద్దం అనో కావాలి. అంతే కానీ ...................

"ఈ పుస్తకం చదివేనాటికే నాకు భక్తి విశ్వాసాలు లేకపోవటం వల్ల ఆ పుస్తకాన్ని పూర్తి సానుకూల దృష్టితో చదవగలిగాను."
కానీ రెండో వైపున తమ జీవితాలకి రామయణ రహస్యాలని సామాన్య్లులకి అందించడమే పరమావధి అని త్రికరణశుద్ధిగా భావించి యేళ్ళకేళ్ళు వేదంలో , ఉపనిషత్తులలో, గీతలో పరిశోధన చేసి ప్రవచనాలు చేసి తరించిన వాళ్ళున్నారు. వాళ్ళ పుస్తకాలు కూడా చదవండి. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి.

ఎందుకంటే రేపు పొద్దున ఆ రచయిత/రచయిత్రి మనసు మారి వాల్మీకి చెప్పిందే కరెక్ట్ అన్నారనుకోండి, అప్పుడు మీరు ఎటు వైపు నిలబడతారు. అలా జరగదు అని మీరనేటట్టయితే ఒక్కసారి చలం గారిని గుర్తు చేసుకోండి. జీవితమంతా స్త్రీ స్వేచ్ఛ, నాస్తికత్వం గురించి మాట్లాడిన మనిషి అవసాన దశలో రమణాశ్రమం లో స్ఢిరపడిపోయాడు. ఎంతగా అంటే అక్కడి నుండి బయటికి రావాలంటే ప్రాణాలు గిలగిలలాడిపోయేటంతగా.

అలాగే ఒక్కసారి రామాయణాన్ని కానీ, మనసా వాచా కర్మణా రాముణ్ణే నమ్మ్ముకున్న ( గుడ్డిగా కాదు, లోకాభిరాముడని అర్ధం చేసుకుని) వాళ్ళు (శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారు ,చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు)రాసిన వ్యాఖ్యానాలను కానీ చదవండి.

అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి. అది సహేతుకం. ఇప్పుడు కూడా నేను రాముణ్ణి సమర్ధించడానికి ఇది రాయలేదు. అలా చెప్పడం నా సిద్ధాంతానికి వ్యతిరేకం. స్వయంగా తెలుసుకోండి. అప్పుడు మీ నిర్ణయం లో ఒక రకమైన సాధికారత ఉంటుంది.

సహాయక గ్రంధాలు/ఇతరాలు
రామాయణం-- తత్వదీపిక(శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి)
రామాయణ ప్రవచనం( శ్రీ భాష్యం అప్పలాచార్యస్వామి, చాగంటి కోటేశ్వరరావు గారు)
సుందర మారుతి
శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పుస్తకాలు
-------
భారతం గురించి నాకు అంతగా అవగాహన లేదు. అందువల్ల రామాయణానికి మాత్రమే పరిమితమయ్యాను.