Tuesday, February 17, 2015

అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.

శివుడెక్కడున్నాడంటూ తిరిగాను,
నీలో చూసుకున్నావా అని ఆ శివుడు అడిగేవరకూ

శివుడెవరని ఎందరెందరినో అడిగాను
నిన్ను నువ్వడగవేమని ఆ శివుడు అడిగేవరకూ

శివమంటే ఏమిటని ఎవరెవరినో అడిగాను,
నువ్వెవరని లోనుండి ఆ శివుడు అడిగేవరకూ

శివుడెలా ఉంటాడని అందరినీ అడిగాను,
ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు అని ఆ శివుడు అడిగేవరకూ

శివుడెందుకని అందరినీ అడిగాను,
ఆలోచించు నువ్వుండగా నేనెందుకని ఆ శివుడు అడిగేవరకూ

మహా శివరాత్రి: చిన్నప్పుడు మహా శివరాత్రి అంటే జాగారం, అప్పుడు దూరదర్శన్ వాడు వేసే భక్తి సినిమాలు, ఎవడు ఎక్కువసేపు మేల్కొంటాడో అని పందాలు, పొద్దున్న లేచాక సన్నాయి నొక్కులు.
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది,
అదిగో అనంతమైన జ్ఞానలింగం ఆద్యంతాలు లేకుండా పెరిగిపోతుంది.
సాయంత్రం దాకా వెలుగునిచ్చిన సూర్యుడు, కోటి సూర్యుల పగిది వెలిగే ఆ మహా సూర్యుని ముందు దివిటీ అయినాడు.
సృష్టి చేసే బ్రహ్మ మరో సృష్టికోసం వలసిన తేజస్సును తీసుకుపోవడానికి వచ్చాడా అన్నట్టు భక్తి ప్రపత్తులతో నిలబడి ఉన్నాడు
ఈ మహా శక్తేనా బాణుడితో యుద్ధమొనరించినప్పుడు, లీలగా నేనోడినానని పలికినవాడు, ఈ మహా శక్తేనా తన భక్తుడైన రావణుడిని పరాభవించి సీత జాడ తెలిపినదని అబ్బురపడి చూచుచుండె విష్ణుమూర్తి
ఈ తేజస్సే కదా సమస్త విద్యలకూ ఆలవాలమైన డమరుకాన్ని ధరించేదని సరస్వతీదేవి ఆశ్చర్యముగా చూస్తూ నిలబడి పోయింది.

ఈ తేజస్సే కదా పుత్రసముడివలే నన్నూ నా స్వామిని కలిపినదని సాగర గర్భసంభూత, సలక్షణ జాత, దేవదేవ దివ్యమహిషి అప్యాయతతో అలా చూస్తూ ఉండిపోయింది.

ఇంతటి స్వామిలో, తేజస్సులో, సగభాగాన్ని కదా అని ఆ తల్లి సర్వ మంగళ మాంగళ్య, సర్వార్ధ సాధకి, గౌరి అలా రెప్పవాల్చకుండా నిలుచుందిపోయింది.

మాకోసం కదా ఇంతటి స్వామి విషాన్ని మింగి గరళ కంఠుడయ్యాడని సకల దేవగణమూ, అలా నిలిచిపోయింది

నిను సేవింపగ నాపదల్పొడమీ, నిత్యోత్సవంబబ్బనీ, జనమాత్రుండననీ, మోహంబు పైకొననీ అంటూ శివసాయుజ్యాన్ని పొందిన భక్త కోటి అంతా పరవశిస్తూ గానం చేస్తున్నారు.

అది ప్రకృతి పరమశివుడి ఆద్యంత రహితమైన అద్భుతమైన రూపాన్ని కన్నులారా చూస్తూ, చెవులారా వింటూ తానై శివుడై, శివుడే తానౌతున్న క్షణం.

అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
సూర్యుడివలె నిన్ను నువ్వు వెలిగించుకోవాలని, నలుగురికీ వెలుగునివ్వాలనీ లేదా అంటూ,
బ్రహ్మ వలె నువ్వు ఏం సృష్టించాలో చెప్పు అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నీ కోసం నేను హనుమంతుడినవ్వడానికి సిద్ధం , నువ్వు రాముడవ్వడానికి సిద్ధమేనా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
ఈ ఢమరు శబ్దమే నీలోంచి వస్తోంది విన్నావా, వినగలవా, వినడానికి సిద్ధమా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నిన్నూ నీలో ఉన్న నన్నూ కలిపేది నేనే, కలపగలిగేది నేనే, నువ్వు సిద్ధమా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నిన్ను నాలో సగం చేసుకోవడానికి నేను సిద్ధమే కానీ నీ మనసులో సగం కాదుకదా ఏ కొంచెమైనా ఖాళీ ఉందా ఉంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
సకలదేవగణాల రక్షణకోసం విషం మింగినవాడిని నీకోసం ఏమీ చెయ్యలేనా, కానీ నోరు తెరిచి అడగవెందుకని అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
శివసాయుజ్య సాధనా చతుర అశేష మునిగణమూ, అసామాన్య భక్తిగణమూ నీకు నా సులభత్వాన్ని బోధపరచడంలేదా అంటూ
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
ప్రకృతి లో నువ్వు దేన్ని చూసినా నన్ను చూసినట్టే, చూస్తున్నట్టే, కానీ ఎందుకు ఒప్పుకోవడానికి సంకోచిస్తున్నావ్ అంటూ


Friday, September 12, 2014

అల బెంగళూరు నగరంలో, వైట్‌ఫీల్డ్ లో, ఆ మూల సాఫ్ట్‌వేర్ ఆఫీసులో

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

అల బెంగళూరు నగరంలో, వైట్‌ఫీల్డ్ లో, ఆ మూల సాఫ్ట్‌వేర్ ఆఫీసులో
కాంక్రీటు వనాంతర మత్స్య సరః ప్రాంత అష్ట వర్ష రివాల్వింగ్ చైరాసీన (అనగా ఎనిమిదేళ్ళనుండీ అదే కుర్చీలో ఉన్నాడు అని అర్ధం)  
కంప్యూటర్ వినోది యగు ఆ ఆపన్న ఇంజినీరు విహ్వల ఫ్రెషర్
పాహీ పాహీ యన కుయ్యాలించి సంరంభుడై

మేనేజర్ కున్ జెప్పడు, ఐడికార్డును, ఫోనును చేదోయి సంధింపడే
టీమును రా రమ్మని జీరడు, లిఫ్టును జేరడు, హస్తభూషణమౌ
మూషికమును మన్నింపడు, వివాదప్రోద్ధిత  శ్రీ మేనేజరు
లాప్‌టాపునైన వీడడు ఫ్రెషరు సందేహ నివృత్త్యోత్సాహియై   

ఇట్లు క్లైంటు జన పాలిత పరాయణుండును, నిఖిలి క్లైంటుజన హృదయారవింద సదన సంస్థితుడగు ఆ ఇంజినీరు
ఫ్రెషరు విజ్ఞాపిత నానావిధ దీనాలాపములాకర్ణించి, లాప్‌టాపు వినోదంబులం దనివి సాలించి, సంభ్రమించి, దిశలు నిరీక్షించి, ఫ్రెషరు రక్షాపరత్వంబు నంగీకరించి, లిఫ్టులోనకుద్గమించి, వేంచేయునపుడు....

తనవెంటన్ మేనేజరు, నాతని వెంట టీములీడు, దానివెంకను
హెచార్ మేనేజరు, వాని పొంతను సమస్త
పాలసీ నికాయంబును, అడ్మిన్లున్ను, హౌస్ కీపింగున్నూ రావొచ్చి
రయ్యన సాఫ్ట్‌వేరాఫీసు గలుగు వారాబాలగోపాలమున్  

కరుణాసింధువౌ ఆ ఇంజినీరు నూతనోద్యోగ జనిత అజ్ఞానమును ఖండింపగ బంపె
సత్వరితా కంపిత సాఫ్ట్‌వేర్ చక్రము, మహోద్యద్విస్ఫులింగ చ్చటా
ఆగ్రహోద్గద స్వరమునన్, బహువిధ ప్రాజెక్టుల నిర్వక్ర విచ్చిన్నకరంబగు,
పాలిత అఖిల సాఫ్ట్‌వేరు లోకమున్ తన అష్టవర్షానుభవమున్

ఇట్లు తన అనుభవమ్ముచేత ఫ్రెషర్ కున్న అపోహలు దూరము జేయుచు,
        ఇది కామధేనువు గాదు, సర్వము తనలోనిమిడ్చు కాలబిలము అనిన్నూ,          
       ఇందు సత్కార చీత్కారములు నీ ప్రతిభపై గాక వారి అవసరమ్ముపై  ఆధారపడియుండుననిన్నీ
       బాగుగా కార్యనిర్వహణ చేసిన పదోన్నతులు, ఆన్‌సైటులు  వచ్చునని భ్రమింప వద్దనీ  చెప్పుచుండ

మేనేజరొకడు మీటింగురూముకు జొచ్చెను
మేనేజరు మరియొకడు క్లైంటు పిలిచెనని జారెన్
మేనేజర్ల రూమున దిరిగెడు
మేనేజర్లందరు సియివో మరువున కరిగెన్

సరదాకి రాసిందే తప్ప పోతన వంటి వారిని అవమానించే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు.


మనోహర్ చెనికల

Monday, September 1, 2014

బాపు

వారిమీద కధలు రాయడానికి రచయితని కాను, కనీసం నాలుగు ముక్కలు రాయడానికైనా నేను నేర్చుకున్న నాలుగు తెలుగు ముక్కలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నవే. ఏమని రాయగలం ఆ మాటల మాంత్రికుల గురించి. వాళ్ళ స్నేహం గురించి, వాళ్ళ రామభక్తి గురించి?
రమణగారు వెళ్ళిపోయినప్పుడే భయమేసింది, ఎక్కడ స్నేహితుడికోసం ఈయనా వెళ్ళిపోతారో అని. ఈ రోజు వెళ్ళిపోయారు. ఆ రామయ్య పిలిపించేసుకున్నాడు.  వారి ఆత్మశాంతి కై ఆ రాముడిని ప్రార్ధిస్తూ

Monday, July 7, 2014

రామ నామమె చాలు, రామ చింతనే మేలు.

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

ఇది ఆరవ సారి హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం. ప్రతీసారీ స్వామి చిత్రాతిచిత్రంగా దర్శనమిస్తూనే ఉన్నారు. ఓ మారు శింశుపా వృక్షశాఖల మాటున దాక్కుని చూస్తున్నట్టు, ఓమారు సుందరకాండ లో చెప్పినట్టు పూలతో నిండిన కొండా అన్నట్టు, ఓ మారు కొంచెం కోపంగా, ఓ మారు ప్రసన్నంగా ఇలా రకరకాలుగా కనిపించారు. ఈ సారి నా భార్యా బిడ్డలతో వచ్చేలా అనుగ్రహించారు. చిట్టి చిట్టి చేతులతో నాకూతురు స్వామికి పూర్ణాహుతి కలశాలు తీసుకుని అభిషేకం చేసింది. మూడు రోజులు సామి సామి అని స్వామి చుట్టూనే తిరిగింది. ఏ పని చెప్తే ఆ పని చేసింది. శివపార్వతుల కళ్యాణ విగ్రహాలను శుభ్రం చేస్తుంటే, నాన్నా స్నానం చేయించద్దు, సబ్బు రుద్దితే అమ్మకి కళ్ళు మంట పుడతాయి అని నాతో పాటే కూర్చుంది. పూర్ణాహుతి తర్వాత కలశాలు పైన పేరుస్తుంటే ఒక్కొక్కటి అందించింది. ప్రసాదాలు పాకింగ్ చేస్తుంటే ఒక్కొక్క పాకెట్ తీసి ఖర్జూరం పెట్టి ఇచ్చింది. ఇలా ఈ సారి చాలా ప్రత్యేకంగా జరిగింది.

ఇక ఈసారి జరిగిన సంకీర్తన అన్నింటికంటే ప్రత్యేకం. త్రినాధ శర్మ గారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుతూ ఉంటే ఏదో తెలియని ఉద్విగ్నత,
ఆ ప్రహ్లాదుడు,
ఆయన పడ్డ బాధలు,
ఆయనకోసం నానా జంగమ స్థావరాలలో నరసింహస్వరూపంతో నిండి పోయిన స్వామి.

వెతికితే ఎక్కడైనా కనిపిస్తాడని చెప్పిన ఐదేళ్ళ పిల్లవాడి నమ్మకం, 
చెటిల్లు చెటిల్లు, ఫెటిళ్ళు ఫెటిళ్ళు మని శబ్దాలతో స్థంబంలోనుంది వెలవడిన స్వామి,
ఇలా మనసంతా ఆయనే నిండిపోయినట్టనిపించింది. దానికితోడు, నాకు కులదైవం కూడా కావడం, ప్రతీ సంవత్సరం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం వల్లనేమో ఆ నిమిషం అలా ఆగిపోతే బాగుండనిపించింది.
మొదటి సారి ఆ స్తోత్రం అలాగే యుగాలు పాడగలంత పెద్దదై ఉంటే బాగుండనిపించింది.

ఇక చివరి ఘట్టం, ఇరవైనాలుగు కోట్ల రామనామాన్ని భద్రాచలం చేర్చి, ఇదిగోనయ్యా నీ భక్తుల చేత నువ్వు రాయించుకున్న రామనామం అని ఆయనకి లెక్క చెప్పడం.
వెళ్ళలేకపోయాను కానీ మనసంతా అక్కడే ఉంది. ఇప్పుడు గోశాలకి వెళ్ళుంటారు, ఆవులకి కడుపునిండా భోజనం పెట్టుంటారు, ఇక సంకీర్తనతో స్వామి వారి దగ్గరికి వెళ్ళుంటారు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ రెండు రోజులు.

ఇందాకే మాస్టరు గారు ఫోన్ చేసారు. మనోహరూ, కార్యక్రమం అద్భుతంగా జరిగింది, నువ్వుకూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అన్నారు. కార్యక్రమం మొత్తం ఇలా జరిగింది అని చెప్పారు.

ఎంతో సంతోషంగా ఉంది.

అందుకేనేమో పెద్దలు నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పారు,
పలకండీ, పలకండీ, రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము అని.....


జై శ్రీరాం.










Wednesday, July 2, 2014

రండీ పుణ్యాత్ములారా ! శ్రీరంగని భజనకు !రాండీ ధర్మాత్ములారా! రండీ! మనమందరము,.కోదండరాముల భజనచేద్దాము

భగవద్భక్తులందరకూ ! నమస్కారములు

ఈనెల ఐదవతారీఖు[శనివారం} భద్రాచలంలో శ్రీరాములవారికి భక్తులందరి తరపున రామకోటినామలేఖనప్రతులను సమర్పించు కార్యక్రమము రామదండు నిర్వహించు చున్నది. శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం [రవ్వవరం] లో ఈసంవత్సరం జరిగిన హనుమత్ రక్షాయాగ మునకు అనుసంధానంగా ఇరవై నాలుగు కోట్ల రామనామములను సామూహికంగా లిఖింపజేయు
కార్యక్రమం చేపట్టడం జరిగినది. స్వామి అనుగ్రహము వలన కార్యక్రమము చక్కగా సాగినది. లిఖిమ్చిన ప్రతులను పీఠమునకు చేరుస్తున్నారు రామభక్తులు. ఈప్రతులను తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించటం జరుగుతున్నది. శనివారంఉదయం నుండి రాత్రివరకు భద్రాచలం లో ఈకార్యక్రమం జరుగుతున్నది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొను భక్తులకొరకై అంబాసత్రంలో వసతి,భోజన సౌకర్యములను ఏర్పాటుచేయటం జరిగినది .

కార్యక్రమ వివరాలు

ఉదయం
నదీస్నానం
గోపూజ ః [గోవులకు ఆనందం కలిగించే గోవిందనామసంకీర్తనతో గోవులకు గ్రాసం,ఫలములనుతినిపించి,హారతి నివ్వటం.]

గణపతి పూజతో మొదలై స్వామివారికి అమ్మవారికి షోడశోపచార పూజ [అంబా సత్రంలో]
తదనంతరం సంకీర్తన [ధ్యానమందిరంలో]
మధ్యాహ్నం అన్నప్రసాదస్వీకరణ [అంబా సత్రంలో]
కొద్ది విశ్రాంతి అనంతరం అంబా సత్రంలో సంకీర్తన
సాయంకాలం
భద్రాగిరిప్రదక్షిణ, రామనామప్రతుల సమర్పణ. రాత్రి తొమ్మిదిన్నరవరకు భద్రగిరీశుని సన్నిధిలో సంకీర్తన.

ఈకార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు శనివారం ఉదయానికల్లా భద్రాచలం చేరుకోవాలి
గురువారం నాటికి వారెంతమంది వస్తున్నారో ఫోన్ ద్వారా తెలుపవలసిఉంది

కలౌ నామస్మరణ అన్నారు పెద్దలు. మనపాపాలను,తాపాలను బాపుకొనుటకై ఈసంకీర్తనలో పాల్గొందాం , సీతాలక్ష్మణ,భరతశత్రుఘ్న,హనుమత్సమేత శ్రీరామచంద్రప్రభువుల కృపను వేడుకుందాం . జైశ్రీరాం

durgeswara@gmail.com
9948235641

Monday, June 23, 2014

భద్రాచలం లో జరిగే సంకీర్తనాయజ్ఞం శ్రీరామనామ లేఖన ప్రతులసమర్పణా కార్యం లో పాల్గొనరండి

భగవద్భక్తులందరకూ !
హనుమత్స్మరణపూర్వక నమస్కారములు.

హనుమత్ రక్షాయాగం ఆరవ ఆవృతి మే ఇరవైనాలగవతేదీ నిర్విఘ్నంగా చక్కగా జరిగినది. స్వామి అనుగ్రహప్రభావం అనుభవంలోకి వచ్చినది అందరకూ. ఇందులో ఇంకొక ఘట్టం మిగిలి యున్నది. ఇరవైనాలుగుకోట్ల శ్రీరామనామమును సామూహికంగా లిఖించుటకు పుస్తకములు ముద్రించి పంపిణీ చేసి ఉన్నాము. ఆయాగ్రామాలనుండి భక్తులు శ్రీరామనామమును లిఖించి సిద్దముగా ఉంచారు. రామనామములను శిరసుపై నిడుకుని భక్తులంతా భద్రాచలేశుని సన్నిధికివెళ్ళి స్వామికి సమర్పించవలసి ఉంది.

జూలై 5,6 తేదీలలో [శని,ఆది వారములు] భద్రాచలంలో సంకీర్తనాయజ్ఞము నిర్వహించుటకు ముహూర్తం నిర్ణయించుట జరిగినది. ఇందులో పాల్గొనువారంతా శనివారం ఉదయానికల్లా భద్రాచలం అంబసత్రమునకు చేరుకోవాలి . రాదలచుకున్నవాళ్ళు జూన్ ఇరవై ఐదవతేదీ నాటికి తమ పేర్లను తెలుపవలసినదిగా మనవి
అంబసత్రములో అందరికీ సామూహికంగా వసతి కల్పించబడుతుంది. అందరితో కలసి ఉండటం ఇబ్బంది అనుకున్నవారికి అక్కడ ధర్మసత్రములలో రూములు ఉంటాయి .వారి అనుకూలమునుబట్టి నిర్ణయించుకోవచ్చు. భగవన్నామసంకీర్తనలో పాల్గొనటం గొంతుకలపి స్వామి గుణగానాలను కీర్తించటంమనకు ప్రధానం .మిగతా సౌకర్యాలగూర్చి పట్టించుకోకండి . కావలసిన వసతి ఉన్నది అదిచాలు. శనిఆదివారాలుకనుక ఉద్యోగస్తులు,ముఖ్యంగా యువత, తరలిరావాలనికోరుతున్నాం . రామనామ రసపిపాసి హనుమత్ స్వామి కి ఇష్టపూర్వకంగా మనంఅందరం గొంతుకలపి
...రామనామ మాలా భజరే........శ్రీరామనామ మాలా .......... అంటూ పాడుకుంటూరామనామాన్ని గానం చేద్దాంతరలిరండి
. మీరు అక్కడ పాడదలచుకున్న కీర్తనను అందరితో భజనగా పలికించేలా
కొద్దిగా సాధనచేసుకుని వస్తే ఇంకా బాగుంటుంది. స్వామి గుణగానాలను ఎలుగెత్తి పాడాలని ఉన్న ప్రతిఒక్కరికి ఈసంకీర్తనాయజ్ఞంలో అవకాశం ఉంటుంది .

మీ పేర్లను తెలుపవలసిన అడ్రెస్

durgeswara@ gmail.com
9948235641