Showing posts with label హనుమద్రక్షాయాగం. Show all posts
Showing posts with label హనుమద్రక్షాయాగం. Show all posts

Wednesday, May 13, 2015

హనుమజ్జయంతి 2015

 
జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
2009 లో అనుకుంటా మొదటిసారి వినుకొండకి హనుమద్రక్షాయాగానికి వెళ్ళడం జరిగింది.  అప్పటినుండి ప్రతి సంవత్సరం వెళ్తునే ఉన్నాను. అదొక అలౌకిక అనుభూతి. ఆ స్వామికి నా చేతులతో అభిషేకం చేసి అలంకరించే భాగ్యం కోటి జన్మలకైనా దొరకదు. రెండురోజులు మామూలు విషయాలకు దూరంగా హనుమద్వైభవాన్ని చూస్తూ గడిపే అదృష్టం స్వామి గత ఆరు సంవత్సరాలుగా ప్రసాదించారు. వెళ్తూనే తలస్నానాలు చేసి అమ్మవారికి, స్వామి వార్లకీ,  పూజ చేసి మహా నైవేద్యం చెయ్యడం, తర్వాత అల్పాహారం. ఆ తర్వాత ఈ సంవత్సరం స్వామి ఎలా చేపిస్తారో అని అనుకుంటూ గడపడం. సాయంత్రం, రక్షలు తయారు చెయ్యడం, యాగకుండాలు తయారు చెయ్యడం, అప్పటివరకూ గోత్రనామాలు పంపిన వారి పేర్లు నోట్ చేస్కోవడం ఇలా మొదటిరోజు అయిపోయేది. తర్వాత రోజు ఇక సందడి, పొద్దున్నే కరెంట్ పోయే లోపు 108 కలశాలు తయారు చెయ్యాలి. ఒకసారి మా నాగప్రసాద్ అనుకుంటా, మోటర్ వేస్తారు కదా ఆ నీళ్ళు వాడి శుభ్రం చేద్దాం అని మీన మేషాలు లెక్కెట్టించాడు, చివరికి పనీ పూర్తవ్వలేదు, కరెంటూ పోయింది. ఇక అప్పటికప్పుడు బోరింగ్ దగ్గరికి పోయి నీళ్ళు పట్టుకువచ్చి కలశాలు తయారుచేసాం. ఎవరో ఒకతల్లి కూడా సహాయం చేసింది. పూజాద్రవ్యాలకి ఎడమచెయ్యి తగలకూడదని ముందే మాష్టరు గారు హెచ్చరించేవారు.  తర్వాత స్వామికి అభిషేకాలు. ఇక అభిషేకాలప్పుడు చూడాలి. అంతెత్తు నిలబడ్డ స్వామికి స్నానం చేపించడమంటే మాటలా! పూజ్యగురువులు చాగంటివారు అంటారు విశ్వవ్యాపకుడైన స్వామికి మనం ఏం కైంకర్యం చెయ్యగలము అని. అది కళ్ళెదుట కనిపిస్తున్నట్టు ఉండేది. "యధా రాఘవ నిర్ముక్త శరశ్స్వసన విక్రమః, గచ్చేత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం" అని చెప్పి నిలబడ్డ స్వామి గుర్తొస్తారు ప్రతిసారి అభిషేకాలప్పుడు. ఇలా అభిషేకాలు జరుగుతున్నంతసేపూ విశాఖపట్నం నుంచి వచ్చిన బాబూరావుగారు ఏదో ఒక కీర్తన పాడుతునే ఉండేవారు. అసలే పొగిడితే పెరిగే స్వామి! అందులోనూ పాడుతున్నది MS Ramarao గారి దగ్గర సుందరకాండ నేర్చుకున్న వ్యక్తి. మామూలుగా ఉన్నప్పుడు ఆయన వయసు తెలిసేది కానీ, కీర్తన మొదలుపెట్టారంటే అలా వింటూ ఉండిపోవలనిపిస్తుంది. అలసటా, ఆయాసం ఏమీ అడ్డు వచ్చేవి కాదు. స్వామి హనుమ స్వయంగా సామగాన ధురంధరుడు, అలాంటిది  ఆయనకి భక్తుడు పాడితే ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. ఈ అభిషేకాలు ఇలా జరుగుతూ ఉంటే ఎంత బాగుండో కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ స్వామి కి జలుబు చేస్తుందని ఆపేసేవాళ్ళం.       
 
ఇక ఆ తర్వాత పొడ లేకుండా తుడిచి సింధూరం లేపనం చేస్తుంటే చూడాలి.
 
పంచశీర్షామివోరగా అని కీర్తించబడ్డ చేతులు,
ఉరయాపాస జీమూతమివమారుతః అని కీర్తించబడ్డ వక్షస్థలం
బాహుభ్యాం స్థంభయామాస అని కీర్తించబడ్డ భుజాలు,
పరిఘసన్నిభౌ అని కీర్తించబడ్డ తొడలు,
పరమపావనమైన ఆయన పాదాలు.... ఇలా శుభ్రంగా తుడిచి పూలతో అలంకరించేవాళ్ళం.   
 
తరువాత, అంత స్వామి కి అంత గజమాల ధరింప జేసేవాళ్ళం.
 
ఈ లోపు కళ్యాణానికి శివపార్వతుల మూర్తులని శుభ్రం చేసేవాళ్ళం. పొయిన సారి అనుకుంటా నేను చాలా సీరియస్ గా  పని చేసుకుంటుంటే మైథిలి వచ్చింది. ఏం చేస్తున్నావు నాన్నా అనింది. స్వామికి స్నానం చేపిస్తున్నా అని చెప్పా. సబ్బు ఎక్కువ పుయ్యకు కళ్ళు మండుతాయి అని చెప్పి చూస్తూ కూర్చుండిపోయింది. భలే అబ్బురమనిపించింది. అందుకు కదా బెజ్జమహాదేవి కోసం ఆ పరమశివుడు పసిపిల్లాడైపోయాడు అనిపించింది. 
 
ఇక తరువాత యాగం. అన్నదానం చిదంబరశాస్త్రిగారి లాంటి హనుమదుపాసకుల ఆధ్వర్యంలో జరిగినప్పుడా యాగకీలల ఆనంద తాండవం చూడాలి. ఐదవసారి అనుకుంటా ముప్ఫైయేళ్ళు మేము ఈ కాడి మోసాము, ఇక మీ తరం ఎత్తుకోవాలి నాయనా అన్నారు. చాలా బాధనిపించింది. ఈ మధ్య నేను ఏ కార్యక్రమాలకి వెళ్ళడంలేదు, కానీ ఇక్కడికి మాత్రం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంతమంది యువత స్వామి కోసం చేస్తున్న పని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. వారు లేకుంటే ఆంధ్రలోకానికి పరాశరసంహిత ఇంత దగ్గర అయ్యుండేది కాదన్నది నిర్వివాదాంశం. వారు ఆనందించారంటే సాక్షాత్తు స్వామి ఆనందించినట్టే.
 
ఆరేళ్ళుగా జరుగుతున్న యాగమే అయినా ప్రతీసారి ఒక్కొక్కరకంగా జరిగింది.
ఒకసారి ద్వాదశకుండాలతో
ఒకసారి ఒకే కుండంలో
ఒకసారి 27 యజ్ఞ కుండాలలో 108 జంటలతో
ఒకసారి 27 యజ్ఞకుండాలలో 54 జంటలతో
ఇలా ఆయన ఇష్టం, ఎవరో ఒకరి నోట పలికిస్తాడు జరుగుతుంది.
యాగం జరుగుతున్నంతసేపూ చాలీసా పారాయణం జరుగుతూనే ఉండేది.
 
చివరగా బయలుదేరేముందు ఒక్కసారి ఆ స్వామి దగ్గరికి పోయి కూర్చునేవాడిని. నిన్నటి రోజున మన పక్కన తిరిగిన మనిషి ఈ రోజు హటాత్తుగా పెద్ద స్థితిమంతుడైపోతే ఎలా ఉంటుందో అలా అనిపించేది. నిన్న నిదానం గా స్నానం చేపించి, నిదానంగా సింధూరం పూసి, తక్కువపూలతో అలంకరణ చేసినా మా చేతుల్తో చేసాం అని తృప్తిగా ఉండేది.  అదే ఇప్పుడు చూస్తే చుట్టూ రంగు రంగుల పూలతో, పసుపు కుంకుమలతో, తమలపాకులతో, కొబ్బరికాయలతో మామిడాకులతో మా స్వామేనా అని సందేహం వచ్చేది. అప్పుడు చూడాలి నా స్వామిని శుచిస్మిత అయిన సీతమ్మలా, సర్వసత్త్వమనోహరుడైన రాముడిలా, సత్వస్వరూపమైన శివుడిలా, మంగళరూపమైన గౌరీదేవిలా, సృష్తికర్త యైన బ్రహ్మలా, జ్ఞాననిధి యైన సరస్వతిలా సర్వదేవతా స్వరూపంగా కనపడి ప్రశాంతంగా బయలుదేరేవాడిని.

 

 

 
 
 
ఇక ఈసారి, ఏడవసారి మరింత బ్రహ్మాండంగా ఏడు రోజుల కార్యక్రమంగా రూపుదిద్దుకుని శనిత్రయోదశి నాడు పూర్ణాహుతి నిర్ణయించబడింది. సముద్రం దగ్గరికి చెంబు పట్టుకెడితే చెంబుడు నీళ్ళే వస్తాయి, బిందె పట్టుకెలితే బిందెడు నీళ్ళు వస్తాయి అని పూజ్యులు చాగంటి వారు చెప్పేవారు. ఆన్‌సైట్ కావాలో అని ఆయన్ని వేధించి, సుందరకాండ చూపించి బ్లాక్‌మెయిల్ చేసి చివరికి దేశం కాని దేశం లో కూర్చుని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అనిపిస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలేమో, ఏది వదులుకోవాలో తెలియక కావాల్సినదాన్ని వదులుకుని ఒక మిధ్యాప్రపంచంలో బతుకుతున్నామని తెలుసుకోడానికి నేను పెట్టిన పణం ఈ సారి జరుగుతున్న హనుమద్రక్షాయాగం. అక్కడ ఉంటే ఈపాటికి కలశాలు రెడీ చేసి ఉండేవాళ్ళం, ఈ పాటికి అభిషేకం అయిపోయేది, ఈ పాటికి భోజనాలు చేసేవాళ్ళు అందరూ, ఈ పాటికి కళ్యాణం అయిపోయేది, అని అనుకుంటూ ఉండాల్సొస్తుంది. కనీసం వచ్చే సారైనా హనుమజ్జయంతికి ఆ స్వామి పాదాల దగ్గర ఉండాలని కోరిక.
 
If anybody want to go on this Saturday(16th May2015) Pleasse contact durgeswara - 9948235641

Monday, July 7, 2014

రామ నామమె చాలు, రామ చింతనే మేలు.

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

ఇది ఆరవ సారి హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం. ప్రతీసారీ స్వామి చిత్రాతిచిత్రంగా దర్శనమిస్తూనే ఉన్నారు. ఓ మారు శింశుపా వృక్షశాఖల మాటున దాక్కుని చూస్తున్నట్టు, ఓమారు సుందరకాండ లో చెప్పినట్టు పూలతో నిండిన కొండా అన్నట్టు, ఓ మారు కొంచెం కోపంగా, ఓ మారు ప్రసన్నంగా ఇలా రకరకాలుగా కనిపించారు. ఈ సారి నా భార్యా బిడ్డలతో వచ్చేలా అనుగ్రహించారు. చిట్టి చిట్టి చేతులతో నాకూతురు స్వామికి పూర్ణాహుతి కలశాలు తీసుకుని అభిషేకం చేసింది. మూడు రోజులు సామి సామి అని స్వామి చుట్టూనే తిరిగింది. ఏ పని చెప్తే ఆ పని చేసింది. శివపార్వతుల కళ్యాణ విగ్రహాలను శుభ్రం చేస్తుంటే, నాన్నా స్నానం చేయించద్దు, సబ్బు రుద్దితే అమ్మకి కళ్ళు మంట పుడతాయి అని నాతో పాటే కూర్చుంది. పూర్ణాహుతి తర్వాత కలశాలు పైన పేరుస్తుంటే ఒక్కొక్కటి అందించింది. ప్రసాదాలు పాకింగ్ చేస్తుంటే ఒక్కొక్క పాకెట్ తీసి ఖర్జూరం పెట్టి ఇచ్చింది. ఇలా ఈ సారి చాలా ప్రత్యేకంగా జరిగింది.

ఇక ఈసారి జరిగిన సంకీర్తన అన్నింటికంటే ప్రత్యేకం. త్రినాధ శర్మ గారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుతూ ఉంటే ఏదో తెలియని ఉద్విగ్నత,
ఆ ప్రహ్లాదుడు,
ఆయన పడ్డ బాధలు,
ఆయనకోసం నానా జంగమ స్థావరాలలో నరసింహస్వరూపంతో నిండి పోయిన స్వామి.

వెతికితే ఎక్కడైనా కనిపిస్తాడని చెప్పిన ఐదేళ్ళ పిల్లవాడి నమ్మకం, 
చెటిల్లు చెటిల్లు, ఫెటిళ్ళు ఫెటిళ్ళు మని శబ్దాలతో స్థంబంలోనుంది వెలవడిన స్వామి,
ఇలా మనసంతా ఆయనే నిండిపోయినట్టనిపించింది. దానికితోడు, నాకు కులదైవం కూడా కావడం, ప్రతీ సంవత్సరం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం వల్లనేమో ఆ నిమిషం అలా ఆగిపోతే బాగుండనిపించింది.
మొదటి సారి ఆ స్తోత్రం అలాగే యుగాలు పాడగలంత పెద్దదై ఉంటే బాగుండనిపించింది.

ఇక చివరి ఘట్టం, ఇరవైనాలుగు కోట్ల రామనామాన్ని భద్రాచలం చేర్చి, ఇదిగోనయ్యా నీ భక్తుల చేత నువ్వు రాయించుకున్న రామనామం అని ఆయనకి లెక్క చెప్పడం.
వెళ్ళలేకపోయాను కానీ మనసంతా అక్కడే ఉంది. ఇప్పుడు గోశాలకి వెళ్ళుంటారు, ఆవులకి కడుపునిండా భోజనం పెట్టుంటారు, ఇక సంకీర్తనతో స్వామి వారి దగ్గరికి వెళ్ళుంటారు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ రెండు రోజులు.

ఇందాకే మాస్టరు గారు ఫోన్ చేసారు. మనోహరూ, కార్యక్రమం అద్భుతంగా జరిగింది, నువ్వుకూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అన్నారు. కార్యక్రమం మొత్తం ఇలా జరిగింది అని చెప్పారు.

ఎంతో సంతోషంగా ఉంది.

అందుకేనేమో పెద్దలు నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పారు,
పలకండీ, పలకండీ, రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము అని.....


జై శ్రీరాం.










Wednesday, July 2, 2014

రండీ పుణ్యాత్ములారా ! శ్రీరంగని భజనకు !రాండీ ధర్మాత్ములారా! రండీ! మనమందరము,.కోదండరాముల భజనచేద్దాము

భగవద్భక్తులందరకూ ! నమస్కారములు

ఈనెల ఐదవతారీఖు[శనివారం} భద్రాచలంలో శ్రీరాములవారికి భక్తులందరి తరపున రామకోటినామలేఖనప్రతులను సమర్పించు కార్యక్రమము రామదండు నిర్వహించు చున్నది. శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం [రవ్వవరం] లో ఈసంవత్సరం జరిగిన హనుమత్ రక్షాయాగ మునకు అనుసంధానంగా ఇరవై నాలుగు కోట్ల రామనామములను సామూహికంగా లిఖింపజేయు
కార్యక్రమం చేపట్టడం జరిగినది. స్వామి అనుగ్రహము వలన కార్యక్రమము చక్కగా సాగినది. లిఖిమ్చిన ప్రతులను పీఠమునకు చేరుస్తున్నారు రామభక్తులు. ఈప్రతులను తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించటం జరుగుతున్నది. శనివారంఉదయం నుండి రాత్రివరకు భద్రాచలం లో ఈకార్యక్రమం జరుగుతున్నది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొను భక్తులకొరకై అంబాసత్రంలో వసతి,భోజన సౌకర్యములను ఏర్పాటుచేయటం జరిగినది .

కార్యక్రమ వివరాలు

ఉదయం
నదీస్నానం
గోపూజ ః [గోవులకు ఆనందం కలిగించే గోవిందనామసంకీర్తనతో గోవులకు గ్రాసం,ఫలములనుతినిపించి,హారతి నివ్వటం.]

గణపతి పూజతో మొదలై స్వామివారికి అమ్మవారికి షోడశోపచార పూజ [అంబా సత్రంలో]
తదనంతరం సంకీర్తన [ధ్యానమందిరంలో]
మధ్యాహ్నం అన్నప్రసాదస్వీకరణ [అంబా సత్రంలో]
కొద్ది విశ్రాంతి అనంతరం అంబా సత్రంలో సంకీర్తన
సాయంకాలం
భద్రాగిరిప్రదక్షిణ, రామనామప్రతుల సమర్పణ. రాత్రి తొమ్మిదిన్నరవరకు భద్రగిరీశుని సన్నిధిలో సంకీర్తన.

ఈకార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు శనివారం ఉదయానికల్లా భద్రాచలం చేరుకోవాలి
గురువారం నాటికి వారెంతమంది వస్తున్నారో ఫోన్ ద్వారా తెలుపవలసిఉంది

కలౌ నామస్మరణ అన్నారు పెద్దలు. మనపాపాలను,తాపాలను బాపుకొనుటకై ఈసంకీర్తనలో పాల్గొందాం , సీతాలక్ష్మణ,భరతశత్రుఘ్న,హనుమత్సమేత శ్రీరామచంద్రప్రభువుల కృపను వేడుకుందాం . జైశ్రీరాం

durgeswara@gmail.com
9948235641

Monday, June 23, 2014

భద్రాచలం లో జరిగే సంకీర్తనాయజ్ఞం శ్రీరామనామ లేఖన ప్రతులసమర్పణా కార్యం లో పాల్గొనరండి

భగవద్భక్తులందరకూ !
హనుమత్స్మరణపూర్వక నమస్కారములు.

హనుమత్ రక్షాయాగం ఆరవ ఆవృతి మే ఇరవైనాలగవతేదీ నిర్విఘ్నంగా చక్కగా జరిగినది. స్వామి అనుగ్రహప్రభావం అనుభవంలోకి వచ్చినది అందరకూ. ఇందులో ఇంకొక ఘట్టం మిగిలి యున్నది. ఇరవైనాలుగుకోట్ల శ్రీరామనామమును సామూహికంగా లిఖించుటకు పుస్తకములు ముద్రించి పంపిణీ చేసి ఉన్నాము. ఆయాగ్రామాలనుండి భక్తులు శ్రీరామనామమును లిఖించి సిద్దముగా ఉంచారు. రామనామములను శిరసుపై నిడుకుని భక్తులంతా భద్రాచలేశుని సన్నిధికివెళ్ళి స్వామికి సమర్పించవలసి ఉంది.

జూలై 5,6 తేదీలలో [శని,ఆది వారములు] భద్రాచలంలో సంకీర్తనాయజ్ఞము నిర్వహించుటకు ముహూర్తం నిర్ణయించుట జరిగినది. ఇందులో పాల్గొనువారంతా శనివారం ఉదయానికల్లా భద్రాచలం అంబసత్రమునకు చేరుకోవాలి . రాదలచుకున్నవాళ్ళు జూన్ ఇరవై ఐదవతేదీ నాటికి తమ పేర్లను తెలుపవలసినదిగా మనవి
అంబసత్రములో అందరికీ సామూహికంగా వసతి కల్పించబడుతుంది. అందరితో కలసి ఉండటం ఇబ్బంది అనుకున్నవారికి అక్కడ ధర్మసత్రములలో రూములు ఉంటాయి .వారి అనుకూలమునుబట్టి నిర్ణయించుకోవచ్చు. భగవన్నామసంకీర్తనలో పాల్గొనటం గొంతుకలపి స్వామి గుణగానాలను కీర్తించటంమనకు ప్రధానం .మిగతా సౌకర్యాలగూర్చి పట్టించుకోకండి . కావలసిన వసతి ఉన్నది అదిచాలు. శనిఆదివారాలుకనుక ఉద్యోగస్తులు,ముఖ్యంగా యువత, తరలిరావాలనికోరుతున్నాం . రామనామ రసపిపాసి హనుమత్ స్వామి కి ఇష్టపూర్వకంగా మనంఅందరం గొంతుకలపి
...రామనామ మాలా భజరే........శ్రీరామనామ మాలా .......... అంటూ పాడుకుంటూరామనామాన్ని గానం చేద్దాంతరలిరండి
. మీరు అక్కడ పాడదలచుకున్న కీర్తనను అందరితో భజనగా పలికించేలా
కొద్దిగా సాధనచేసుకుని వస్తే ఇంకా బాగుంటుంది. స్వామి గుణగానాలను ఎలుగెత్తి పాడాలని ఉన్న ప్రతిఒక్కరికి ఈసంకీర్తనాయజ్ఞంలో అవకాశం ఉంటుంది .

మీ పేర్లను తెలుపవలసిన అడ్రెస్

durgeswara@ gmail.com
9948235641