Friday, May 2, 2014

హనుమద్రక్షాయాగం - 6

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
 
హనుమాన్ చాలీసా. తులసీదాసు గారు ప్రపంచానికి అందించిన సంజీవని. రాముని మీద తనకున్న నమ్మకాన్ని భక్తిని  పరిహసించి కేవల వినోదంగా భావించిన పాదుషాలను కోట వదిలి పారిపోయేలా చేసిన మహా మంత్రం. స్వామి మహిమనీ, చరిత్రనీ, భక్తినీ, వినయాన్నీ, శక్తినీ అన్నింటిని నలభై లైన్లలో చెప్పిన మహా మంత్రం. బాపు గారు తీసిన శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. రాముని భక్తుడైన యయాతి రాముని పూజ చేస్తూ ఉండగా పార్వతీదేవి పంపిన మాయ ఆ నగరం మీదకు రాబోతుంది. అప్పుడు ముకులిత హస్తాలతో రామ చంద్ర స్వామి ముందు కూర్చుని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం లోనుండి ఒక జ్యోతి వెలువడి గోపురం మీదకి చేరుతుంది. ఆ జ్యోతి హనుమగా మారి మాయని గదతో తరిమేస్తుంది. పసిపిల్లలు శ్రీకరమౌ శ్రీరామ నామం  అని పాడుతూ ఉండగా స్వామి ముందు కూర్చుని ఉన్న హనుమయ్య విగ్రహం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది. కోతి నైన జ్ఞానిని చేసే నీ దివ్యనామం అని హనుమ పాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. హనుమ ఉండగా రామభక్తులని కొనగోటితోనైనా అశుభం స్పృశించలేదు.
 
అలా హనుమ రక్షణ, కరుణ పొందిన వారిలో తులసీదాసు ఒకరు. స్వామి దయచేత రాములవారి దర్శనం చేసారు తులసీదాసు. ఆయన మహిమ చేత నిండు పేరోలగంలో రక్షింపబడ్డారు. అప్పుడు తులసీదాసు గారు చేసినదే హనుమాన్ చాలీసా. నేటికీ భక్తుల కొంగు బంగారమై కాపాడుతున్నది. నా అదృష్టం చేత ఐదు సార్లు హనుమద్రక్షాయాగంలో పాల్గొన్నాను. నా చేతులతో స్వామిని అభిషేకించాను. నా చేతులతో స్వామిని తాకుతూ ఆయనకు గజమాల వెయ్యగలిగాను. అభిషేకం సమయంలో సుందరకాండలో స్వామి చెట్లచాటున ఎలా దాక్కున్నారో అలానే మామిడాకుల కింద కనపడ్డారు. అశోకవనంలో వెతికేటప్పుడు పూలతో నిండిన కొండా  అన్నట్టు ఉన్నారు హనుమ అంటే ఓహో అనుకున్నాను. స్వయంగా అలాగే దర్శనమిచ్చారు హనుమ అభిషేకం చేసాక. పచ్చటి పసుపు, ఎర్రటి కుంకుమ, రంగు రంగుల పూలు, తెల్లటి కొబ్బరి చిప్పలు మధ్యలో సింధూర వర్ణంలో స్వామి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఎంత అందంగా ఉన్నారో. ఎంత చెప్పినా తనివితీరదు చూసి తీరవలసిందే.  అలాగే ఆ చాలీసా పుణ్యమా అని తమ కష్టాల నుండి బయటపడ్డ ఎంతో మంది చాలా దగ్గరగా చూసాను. నా స్నేహితులు కొంతమంది నా మీద నమ్మకంతో మొదలుపెట్టి చాలీసా పారాయణ చేసి కొన్ని గడ్డు సమస్యలనుండి బయటపడి స్వామి అనుగ్రహాన్ని స్వయంగా పొందారు. 
 

ఈ సారి మే ఇరవై మూడు హనుమజ్జయంతి. శుక్రవారం రావడం చేత ఇరవైనాలుగు పూర్ణాహుతి జరుగుతోంది. ఈ ఇరవై రోజులూ ఎంత త్వరగా అయిపోతాయా అని ఆత్రంగా చూస్తున్నాను. రాదలచుకున్న వారు దుర్గేశ్వరమాస్టరుగారిని (durgeswara@gmail.com cell 9948235641, durgeswara.blogspot.in ) గానీ, నన్ను కానీ సంప్రదింఛగలరు.
 
మనోహర్ చెనికల  

Tuesday, April 22, 2014

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

చాలా రోజుల తర్వాత నా బ్లాగులో మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. స్వామి అనుగ్రహంతో ఇప్పటికి ఐదు సార్లు హనుమద్రక్షా యాగంలో పాల్గొన్నాను. ఈసారి ఇరవైనాలుగుకోట్ల రామనామ జప సహితంగా హనుమద్రక్షాయాగం జరుగుతోంది.
ఉగాది నాడు మొదలిడి హనుమజ్జయంతి వరకు చాలీసా పారాయణం, తరువాత 108 కలశాలతో స్వామికి అభిషేకం, పంచామృతాలతో, పళ్ళరసాలతో స్వామి కి జరిగిన అభిషేకం చూస్తూ ఉంటే ఆనంద పారవశ్యంతో అలా ఉండిపోవాలని అనిపిస్తుంది.   తరువాత హనుమద్‌వ్రతం, పూర్ణాహుతి యాగం.  అంతమంది చాలీసాతో హవిస్సులు సమర్పిస్తూ ఉంటే చూడటానికి ఎంత రమ్యంగా ఉంటుందో.

మరిన్ని వివరాలకి durgeswara.blogspot.com  లో చూడండి.
durgeswara mastaru gaari phone number: 9948235641

విధేయుడు,
మనోహర్ చెనికల 

Friday, March 15, 2013

"సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు-1

శ్రీ గురుభ్యో నమః


శ్రీ గణేశాయ నమః

శ్రీ శరవణభవాయ నమః

శ్రీమాత్రే నమః

ఓం నమః శివాయ

శ్రీ సీతారామాభ్యాం నమః

శ్రీ హనుమతే నమః

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!

పెద్దలందరికీ నమస్కారము,



పూజ్యులు ప్రాతఃస్మరణీయులు కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతులు,నడిచే దేవుడు, పరమాచార్య, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతీ మహాస్వామి వారు తమిళంలో చేసిన ప్రవచనములలో, "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" అనే అంశముపై చేసిన ప్రవచనముల యొక్క తెలుగు అనువాదము, కామకోటి వారి సైట్ లో లభిస్తే, దానినే యథాతథంగా, మరొక సారి పునశ్చరణ చేసినట్లు అవుతుందనీ, ఇలా వ్రాయడం వల్ల, జగద్గురువుల అనుగ్రహం లభిస్తుందనీ ఆర్తితో, నేను నేర్చుకోవడం కొరకు, నా ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసమై, ఇక్కడ వ్రాసుకుంటూ, అందరితోనూ పంచుకుంటున్నాను. తప్ప ఇక్కడున్న పెద్దలకు తెలియనివి కావు.



1. గురువు - ఆచార్యుడు

మనం సాధారణంగా వాడుకలో రెండు పద ప్రయోగాలు చేస్తూ ఉంటాము. ఇవి మనం పర్యాయ పదాలుగా భావించినా, పండితులు ఈ రెండిటినీ కాస్త భిన్న దృక్పథంలోనే చూస్తారు. ఆ పదాలే "గురువు", "ఆచార్యుడు".



ఆచార్యుడు అనే పదం - ఆచరణ, ఆచార అనే పదములకు సంబంధించినది. చర అంటే నడుచుత, చరిత, చరిత్ర అంటే నడత. దేశ చరిత్ర అంటే ఒక దేశములో ఏమేమి జరిగినదో తెలిపే పుస్తకం. జీవిత చరిత్ర అంటే ఒక మనిషి పుట్టినదాది ఏమేమి చేశాడో చెప్పే కథ. ఆచారం అంటే ఒక సమూహములోని వాడుకలు, నడవడికలు.



ఆచార్యుడు అంటే మనం జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధమైన నైతిక ప్రవర్తన శిష్టాచారములను అనుసరించాలో చూపే మార్గ దర్శకుడు. అహింస, సత్యము లాంటి సామాన్య ధర్మములు మనకున్నవి. మన మతములో ఎన్నో సాంప్రదాయాలున్నాయి. ఆచారాలున్నాయి. ఒక్కో సాంప్రదాయానికి వేర్వేరు శాస్త్రాలున్నవి, వైష్ణవులది ఒక ఆచారము, మాధ్వులకు మరొక ఆచారం. ఒక్క శైవ సాంప్రదాయములోనే ఎన్నో శాఖలున్నవి. వీరశైవం, కాశ్మీరశైవం, పాశుపతం, సిద్ధాంతము ఇత్యాదివి.



ఆచార్య పదం వివరించే ఒక శ్లోకం ఉన్నది ... "అచినోతిః శాస్త్రార్ధాన్ ఆచారే స్థాపయత్యపి - స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్య ప్రచక్షతే".

ఎవడైతే శాస్త్రార్ధములను చక్కగా విచారిస్తున్నాడో (ఇతరులకు వాటిని బోధిస్తున్నాడని గర్భితం), ఆ ఆచారములను తాను స్వయముగా అనుష్టిస్తున్నాడో, అంతటితో వదలక, ఆ ఆచారములను ఇతరులచే అనుష్టింపచేస్తున్నాడో... అతడే ఆచార్యుడు. ఇతరులకు బోధ చేయడం, తాను స్వయంగా ఆచరించడం. ఈ రెండూ చేసేవాడే నిజమైన ఆచార్యుడు.



మనం ఆచారం, అనుష్టానం అంటూ ఉంటాము. అవి రెండూ పరస్పర సంబంధము కలవి. శాస్త్రోక్తములైన ఆచారములను అనుసరించేవే సంప్రదాయాలు. శాస్త్రములనేవి విధి, నిషేధాలను నిర్ణయించే గ్రంధాలు. సంప్రదాయాలు అనూచానంగా వచ్చే వాడుకలు, ఆచారాలు. వైదిక మతము ఆధారముగా ఏర్పడినవే శాంకర, రామానుజ ఇతర వైదిక సాంప్రదాయాలు. శాస్త్రములు సామాన్యముగా ఉన్నా సాంప్రదాయములు వేరుగా ఉండవచ్చు. ఈ విధంగా ఒక నియమ జీవనం చేస్తూ శాస్త్రోక్తమైన ఆచార అనుష్టానాలను పాటిస్తూ, ఇతరులకు బోధిస్తూ, వారిచే వాటిని అనుష్టింపచేస్తూ, తాను ఇతరులకు ఒరవడిగా ధర్మమూర్తిగా ఉన్నవాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యునికి ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యునికి తన సాంప్రదాయ ధర్మములను బోధించి అనుష్టింపచేయాలి. అతడు విద్వాంసుడిగా ఉండాలి. విద్వత్తు లేకపోతే అతడు ఇతరులకి ఏమి బోధ చేయగలడు? తన అనుచరుల ధర్మ సందేహాలకు అతడు జవాబు చెప్పాలి. తన సాంప్రదాయానికి ప్రతి పక్షంవారికి యుక్తి యుక్తముగా జవాబు చెప్పాలి. అట్టివాడే ఆచార్యుడు అనిపించుకొంటాడు.



ఈ కాలంలో ఆచార్యులు బళ్ళు, కళాశాలలో ఉండే అధ్యాపకులు. వారికి ఆచరణలో కానీ, బోధనలో కానీ ఏ విధమైన ధర్మమూ లేదు. పూర్వకాలంలోనూ కళలకు ఆచార్యులు ఉండే వారు. ద్రోణాచార్య, కృపాచార్యులు ధనుర్వేద ఆచార్యులు. వారు వారి కళలలోనే కాక సాంప్రదాయములోనూ ధర్మములోనూ కుశలులు. వారి యొక్క అనుష్టానాలకే వారు గౌరవింపబడినారు.



2. గురు లక్షణం

ఆచార్యుని సమక్షంలోనే ఉంటూ విద్యాభ్యాసం చేయడం గురుకులవాసం. కానీ దానిని "ఆచార్య-కుల వాసము" అని మనం అనడం లేదు. అందుచేత గురువు-ఆచార్యుడు ఒక్కరే అని ఆర్ధం అవుతుంది. జగద్గురు శంకారాచార్య అని వ్యవహరించినప్పుడు, ఒకే వ్యక్తి గురువుగా, ఆచార్యుడిగా ఉన్నారని అర్ధం.



గురువు అంటే ఏమిటి? గురువు అనగా ఘనమైనది, పెద్దది అని అర్ధం. మహిమ కలవాడని అర్ధం. బ్రహ్మ అంటే కూడా గొప్ప, పెద్ద అని అర్ధం. గురువు దేనిలో పెద్ద?? మీరందరూ నన్ను పెరియావా, పెరియావర్ అని పిలుస్తారు. (ఈ మాటలు పరమాచార్య స్వామి వారు ప్రవచనాంతర్గతముగా భక్తులతో అన్నవి....). నేను దేనిలో పెద్ద? శరీర ప్రమాణంలోనా? నాకు శంకరాచార్యుడు అని పేరు ఉండడం వలన మీరందరూ ఆయన గుణగణములూ, మహత్వమూ నాలో ఉన్నదని ఏమరి, నన్ను పెరియావా అనీ, మహాన్ అనీ పిలుస్తున్నారు.



మొత్తం మీద గురువు అంటే అంతర్గతముగా ఒక ఉత్తమ స్థితిని అందుకొన్నవాడు అని తేలుతోంది. బాహ్యంలో ఒక వ్యక్తి యొక్క నడతా, విద్వతూ అతనిని ఆచార్యునిగా నిర్దేశిస్తుంది. అతని ఆచార అనుష్టానాల వలన, అతని బోధనా చాతుర్యం చేతనూ, అతని శీలసంపద చేతనూ మనం ఒకరిని ఆచార్యునిగా ఎన్నగలము.



ఇక గురువు మాట ఏమిటి? అతను బహిరంగముగా ఏదీ చేయవలసిన అవసరము లేదు. అతనికి శాస్త్ర పరిజ్ఞానమో విద్వత్తో ఉండనక్కర్లేదు. ఆచార్యుని వలె అతను సాంప్రదాయ, ఆచార అనుష్టానాలకు మార్గదర్శిగా ఉండనవసరమూ లేదు. అతను నోరు తెరిచి మాట్లాడవలసిన అవసరమూ లేదు. ఉపదేశాలు ఇవ్వనక్కర్లేదు. ఎంతో మంది మౌనగురువులు, ధ్యాననిష్ఠులు ఉంటారన్న విషయం మనకి తెలిసనదే.



తాను తానుగా ఉంటూ, ఏకాంతంగా పూర్ణత్వం భజిస్తూ, ఎవరైనా ఉంటే అతని ప్రభావం గుర్తించి ప్రజలు అతనిని గురువుగా వరిస్తారు. అంతమాత్రాన అతడు వీరికి శాస్త్రపాఠాలు చెప్పవలసిన అవసరము లేదు. అతనిని గురువుగా వరించిన వారికి అతని అనుగ్రహశక్తియే పనిచేస్తుంది. వీరిని అతడు శిష్యులుగా భావించి కూడా ఉండకపోవచ్చును. కానీ ఆయనను గురువుగా ఏ ఫలాన్ని ఉద్దేశించి ఆశ్రయించారో, ఆ ఫలం వీరికి శులభంగా సిద్ధిస్తున్నది.



ఏ శాస్త్రాచారమూ పాటించని ఇలాంటి గురువులెందరో ఉన్నారు. ఉన్మత్తులవలె, పిశాచముల వలే నిరంకుశులుగా తిరిగిన అత్యాశ్రములు ఎందరో గురువులుగా మన దేశంలో ఉండేవారు. ఈ విధంగా దిగంబరంగా తిరిగిన దత్తాత్రేయులు అవధూత గురువు అని ప్రసిద్ధి పొందారు.



ఒక మార్గాన్ని అనుసరించి పోయేవాడు ఆచార్యుడు. ఒక శాస్త్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ, అతడు శాస్త్ర నిష్ణాతగా ఉండడమే కాక, శాస్త్ర విధులను తాను అనుష్టిస్తూ ఇతరులకు బోధచేస్తూ, వారిచేత వానిని అనుష్టింపచేస్తూ

విధివిధానముగా మార్గదర్శకముగా ఉండేవాడే ఆచార్యుడు. గురువు అట్లా కాదు. అతనిని మహాత్ముడు అంటారు, అతని ఆత్మానుభవం కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉండడం చేతనే అతనిని ప్రజలు గురువుగా వరిస్తున్నారు. వారికి శీలానుష్టానాల అవసరం లేదు. వారికి శాస్త్ర విజ్ఞానం ఉండాలన్న నియమం లేదు. వారు జ్ఞానులు, వారెప్పుడూ బ్రహ్మ నిష్టలో ఉండేవారు. వారెప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలో ఉండే ఆనందోన్మత్తులగానో, చిత్తవృత్తుల నిరోధంతో సమాధి స్థితిలో ఉండే యోగులగానో ఉంటారు.



ఒక గురువు స్వయంగా "గురుత్వం" ఒప్పుకోకపోయినా, "నేను నీ శిష్యుడను" అని అతనిని ఆశ్రయించిన వాని మధ్యా, అయిష్టుడైన ఆ గురువు మధ్యా ఒక సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం అతని అనుగ్రహం వల్లనే. గురువు అంటే ఘనమైన వాడు అని చెప్పాము. ఒకరికి అంతరంగిక ఘనత ఉంటుంది. కానీ అతనికి బహిర్ప్రపంచముపైన ఏ కోరికా లేకపోవచ్చు. అతనికి అతని ఆత్మానుభూతిలోనే నిష్ట, అతడు గురువుగా చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు. 'గు' అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం. గురువు అంటే చీకట్లను పారద్రోలేవారు. అజ్ఞాన నివర్తకుడు. దేశ శబ్దానికి ప్రకాశరూపి అని అర్ధం. "తమసోమాజ్యోర్గమయ". మనం అంధకారంలోంచి ప్రకాశంలోకి రావాలి. తమస్ అంటే చీకటి, జ్యోతిస్ అంటే వెలుతురు. అజ్ఞానం అంటే చీకటి, వెలుతురు (జ్ఞానం) ప్రకాశిస్తే కానీ చీకటి పోదు. ఒక విషయాన్ని గురువు బోధిస్తాడు. శిష్యుడు తన బుద్ధిచేత దానిని గ్రహిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న శిష్యునికి జ్ఞానబోధ చేయగలిగినది ప్రకాశరూపియైన గురువు ఒక్కడే.



ఒక మహాత్ముడుంటాడు, అతనికి శాస్త్ర విజ్ఞానం లేదు, అతని అనుష్టానమూ శాస్త్రీయము కాదు. శాస్త్రబోధ అతనికి కానిపని. అయినపటికి అతనిని ఎవరైనా 'గురువు'గా ఆశ్రయిస్తే, అతను ఆశ్రయితుడి అంతర్ధ్వాంతాన్ని అనయాసంగా పోగొట్టగలడు. అతని అనుగ్రహం చేత అనధీతమైన శాస్త్రాలన్నీ ఆశ్రితునికి అవగతాలౌతాయి.



గురువంటే చీకటిని పోగొట్టేవాడు. అతని ఆత్మశక్తి బహిర్ముఖంగా పనిచేస్తుంది. అతను వాగ్రూపముగా వరదానము చేయడంలేదు. మార్గదర్శకముగా ఉండాలన్న కోరికా అతనికి లేదు. అనుగ్రహం చేద్దామన్న ఇఛ్చయూ లేదు. కేవలం ఈశ్వర శక్తి, శిష్యుని గురుభక్తి మెఱుపువలే వరప్రదానం చేస్తుంది. అతను అల్పమైన ప్రాపంచిక విషయాభిలాయగానైనా ఉండవచ్చు. లేదా అతడు బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి అయినా ఉండవచ్చు.



ఒక కర్తవ్యం జరగాలంటే గురు-శిష్య సంబంధం ఉండాలి. ఇంట్లో దీపం వెలిగించాలంటే, విద్యుఛ్చక్తికీ దీపానికీ మధ్య లంకె ఉండాలి. ఆ లంకె తంతి ద్వారా ఏర్పడుతుంది. జలాశయాలనుంచి ఇంట్లో కొళాయిలోకి నీళ్ళు రావాలంటే, పెద్దజలాశయము నుండి నగరానికి మధ్య పైపులు వేయాలి. అప్పుడే కొళాయి నుంచి నీళ్ళు రాగలవు. గురువు వాగ్రూపముగా ఉపదేశము చేస్తూ ఉంటే, గురుశిష్యుల మధ్య సంబంధం గురువు వాక్కులే. లేదా గురువు జీవితములోని ఆచార వ్యవహారాలే శిష్యుడికి ఉపదేశ ప్రాయముగా ఉంటాయి. గురువు మౌనముగా ఉంటూ ఒక సంకల్పము చేస్తే, అదే శిష్యునికి ఉపదేశమవుతుంది. గురువు ఉపన్యాసాల చేతనే ఉపదేశం చేయాలన్న నియమమేమీ లేదు. ఆయన జీవితమే ఒక పెద్ద ఉపదేశం. ఉపదేశ విధానము స్థూలమే కాదు, సూక్ష్మము కూడా.



ఒక గురువు వాగ్రూపముగానూ, తన ఆచార, అనుష్టానము చేతనూ శిష్యునికి బోధిస్తే, అతనిని ఆచార్యుడని అంటారు. ఒకడు ఉపదేశమూ చేయకపోవచ్చు. మార్గదర్శకంగా ఉండకుండా పోవచ్చు. కానీ అతని అనుగ్రహమే గురుశిష్యుల మధ్య ఏర్పడిన అవ్యక్త సంబంధమని ఇదివరకే చెప్పాను.. (పరమాచార్య వారి మాటగా దీనిని చదవగలరు..). ఆ అనుగ్రహమే అతడిచ్చే ఉపదేశము.



ఇట్లా ఉండే గురువులలో కొందరూ ఆచార్యులుగా ఉండడమూ కద్దు. శిష్యులకు బోధిస్తూ, శాస్త్రానుష్టానాలను స్వయంగా ఆచరిస్తూ అంతరంగములో సమాధి అవస్థలో ఉండగల గురువులూ ఉన్నారు. శంకర భగవత్పాదులు ఇటువంటి గురువులు. ఇతర సాంప్రదాయలలోనూ ఒకే వ్యక్తి గురువుగా ఆచార్యునిగా ఉన్నవారు ఉన్నారు.



పూర్వకాలములోని విద్యాగురువులు గొప్ప శీలమూ నిష్టా కలిగినవారు. ఆత్మానుభూతి కానీ, సమాధి అవస్థ కానీ వారు ఎరుగకపోవచ్చును. కానీ ఆచార అనుష్టానాల బలం చేత వారు గురుకులములను నడుపుతూ శిష్యకోటికి విద్యాదానం చేసేవారు. మరికొందరు స్వయంగానో, లేక శాస్త్ర సమ్మతమైన దానినో ఆశ్రితులకు ఉపదేశం చేసేవారు ఉండేవారు. అట్లు ఉపదేశం చేసిన వారి జీవిత కాలంలో వారి బోధనా విధానం శాస్త్ర విధానంగా పరిగణింపబడకపోయినా వారి అనంతరం వారి విధానం, వారి పేరిట చెలామణీ అయి వ్యాప్తి చెందేది. అట్టి గురువులు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని అందుకున్నవారే. ఏ విధానానికి సంబంధించని గురువులూ ఎంతో మంది ఉన్నారు.



(సశేషం...)



సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.   by  మోహన్ కిషోర్ నెమ్మలూరి

Monday, January 14, 2013

బాహ్యాంతరాలు


జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

తన కాంత తనువు  జేరి సుఖియింప, 
మనము బొదలుచుండె ముక్తికాంత కౌగిలి జేరుటెప్పుడని,

ధన సంచయము సాధించు వశమున దిరుగుచుండ, 
మనము దూరుచుండె కరచరణముల నేల కోవెలకెప్పుడు తిరుగవని,

ధారాపుత్రాదుల సుఖము చూసి సంతసించుచుండ, 
మనము గేళి చేసె చూడవలసినది  ఎద్దియో తెలుసునా అని,

వ్యర్ధ భాషణముల కర్ణేంద్రియములు వినియోగింపుచుండ, 
మనము మరియొకమారు తట్టె ఏల వినెదవీ వ్యర్ధార్ధములన్నియు యని,

కూడని మాటలు కూయుచుండ, 
మనము తల్లడిల్లె ఏలడీతడు శ్రీహరి నామము పల్కడని,

అంతరమొప్పదు బాహ్యమందు జీవితము వ్యర్ధమగుచున్నదని,
బాహ్యము పడనీయదు అంతర్ముఖాలోచనను,

స్వామీ నీయందు నిశ్చలచిత్తముంచుదుమన్న, బాహ్యములు లాగుచున్నవి.
సరి పో బాహ్యము చూచుదుమన్న అంతరము నిత్యసంఘర్షణము గావించుచుండె,

ఇచటికి గాక మరినచటికి గాక నడుమ చెడిపోదునేమో, 
నీ పాదద్వయము నా మదినుంచి ఈ బాహ్యాంతర సంఘర్షణ రూపుమాపి స్వామీ,
నన్ నీ పాదాశ్రయుం జేయవే!!!!

తోచిన తలపుల శ్రీహరి తోడుచేసి రాసితినిదినంతియే గాని,
 మరియేమిగాదు, భావదోషమైన, అర్ధదోషమైన పిన్నచేష్టలంచు పెద్దలు మన్నించగలరు.

Friday, December 28, 2012

చందమామ రావే - ఇంకా ఎవరైనా పాడుతున్నారా?

ఈ రోజు పౌర్ణమి.ఎందుకో ఈ మధ్య పౌర్ణమి అంటే కొంచెం దిగులుగా ఉంటుంది. "చంద్రమా మనసో జాతః" అని ఎందుకన్నారో కానీ, రేపటినుండి ఆకాశంలో చంద్రుడు ఆలస్యంగా వస్తాడని బాధ. నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేసరికి అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చే నా కూతురుకి ఇప్పుడు ఏ చందమామని చూపించి "చందమామ రావే" అని పాటపాడాలి? ప్రతిరోజూ ఒకే టైమ్ కి చందమామ ని పరిశీలిస్తూ ఉంటాము నేను, మైథిలీ. విదియ రోజు ఏడింటికి పడమర దిక్కున చివరి మెట్టు మీద ఉన్నట్టు కనపడే ఆయన రోజులు గడిచే కొద్దీ నడినెత్తి మీదికి వస్తాడు, పౌర్ణమికి తూర్పుకి తిరుగుతాడు. అప్పుడు పైన స్లాబ్ అడ్డు వస్తుంది కదా, అప్పుడు మైథిలి చందమామని వెతకడానికి పడే పాట్లు చూడాలి. అటు తిరిగి,ఇటు తిరిగి, ఆ చివరికి పోయి, ఈ చివరికి పోయి, మెట్లు ఎక్కి, దిగి, చివరికి మెట్లు పైదాక ఎక్కి చూస్తే కనపడతాడు. అప్పుడు ఆ పసిపిల్ల ముఖంలో కనపడే ఆనందం ఎంత హాయిగా ఉంటుందో. నిండా పదహారు నెలలు లేవు, ఏమర్ధమవుతుందో, ఏమనిపిస్తుందో మరి చందమామని చూస్తే. మనవరకు ఎందుకు సుందరకాండలో ఆ స్వామికే ఉత్తేజాన్నిచ్చి, సాచిర్యం చేసాడాయన. 



చెయ్యెత్తి చందమామని పిలిచినా, చేతిలో ఏమన్నా ఉంటే చందమామకి పెట్టమంటే చెయ్యి సాగదీసినా , దా దా అని చందమామని పిలిచినా, చందమామకి టాటా చెప్పమంటే చెయ్యి పదహారు వంకలు తిప్పి టాటా చెప్పినా పసిపిల్లలకే చెల్లు. అందుకేనేమో మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని దేవుడితో  పోల్చారు పెద్దలు. సనక సనందాదులు, ప్రహ్లాదుడు ఐదేళ్ళవారు. మీరు పసిపిల్లలలాగునైతేనే దేవునిరాజ్యంలోకి ప్రవేశించగలరు అన్నది బైబిల్. ఒక్కసారి బయటికి వచ్చి మీ కుటుంబంతో సాయంత్రం పూట డాబా మీద కూర్చుని పున్నమి చంద్రుని వెన్నెలలని అనుభవించండి. వేలరూపాయలు తగలేసి వెలిగించే డిస్కో లైట్లు వాటిముందు దిగదుడుపే.

ఎప్పుడైనా సాయంత్రం పూట రోడ్డుమీద నడుస్తూ ఉంటే తల పైకెత్తి చందమామని చూస్తూనో, లేకుంటే వెతుకుతూనో ఉంటుంది. ఉంటే మొహం వెలిగిపోతుంది. లేకుంటే చిన్నగా అయిపోతుంది. అలా తల పైకెత్తి చందమామని వెతుకుతుంటే  సుందరకాండలో స్వామి సముద్రాన్ని దాటడానికి గరుత్మంతుడిని తలచుకుని తల పైకెత్తి నిలుచున్న సన్నివేశం గుర్తు వస్తుంది.

అందుకే పౌర్ణమి అంటే నాకు దిగులు. రేపటినుండి చందమామ కనపడక మొత్తం వెతికొచ్చి చేతులు తిప్పుతూ "పొయ్,పొయ్" అని చెప్తుంది? (తన బాషలో పోయింది  అని). ఏం చెయ్యాలి?

Saturday, September 15, 2012

మరువబోకు మానవుడా మమత వీడరా

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
రామాయణంలో చాలాసార్లు, వాల్మీకి మహర్షులు జంతువులతో పోలిక చెప్పారు.సింహ మధ్య అనీ, శార్దూల విక్రముడనీ ఇలా. కొన్ని విచిత్రమైన పోలికలు ఈ రోజు.
సుందరకాండలో స్వామి లంకాప్రవేశం చేసేముందు తన శరీరప్రమాణాన్ని చాలా తగ్గించారు. ఎంత అంటే పిల్లిపిల్ల అంతగా తగ్గించారు. ఇంతవరకూ చెప్పి ఊరుకోలేదు మహర్షి. "భభూవాద్భుత దర్శనః" అని విడిచిపెట్టారు. దర్శన సామర్ధ్యం చాలాబాగా ఉన్న పిల్లి ప్రమాణానికి తన శరీరాన్ని తగ్గించారు అని చెప్పి మెలిక పెట్టారు. ఇంతేనా ఈ మాటకర్ధం? కాదన్నారు పెద్దలు. గురువుగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు, రామాయణాన్ని రకరకాల కోణాల్లోనుండి అర్ధం చేసుకోవచ్చు అని. అప్పలాచార్య స్వామి వారు కూడా రామాయణాన్ని కావ్యంగా, కధగా, తత్వశాస్త్రంగా మూడురకాలుగా చూడవచ్చు, చూడాలి అని చెప్పేవారు.
 అలా చూస్తే, అప్పుడు అద్భుతం అనేమాట కీలకమౌతుంది. అధ్బుతం అనేమాటకి  భగవంతుడు అని అర్ధం ఉన్నదని శ్రీభాష్యం వారు ఒకసారి చెప్పారు. అలాంటి అధ్బుతమైన దాన్ని దర్శించడానికి వెళ్తున్నాడు అని చెప్పకనే చెప్తున్నారు. ఇక అలాంటి అద్భుతాన్ని చూడడం సాధ్యమయ్యేది, మనలని మనం తగ్గించుకున్నప్పుడే. నేను అనే భావనని తగ్గించుకుంటేనే. నిన్ను నువ్వు తగ్గించుకుంటే తరుగు లేని అద్భుతాన్ని దర్శించడానికి అర్హతని సంపాదించుకున్నట్టే అని సుందరకాండ సందేశం.

బైబిల్ లో ఒకమాట ఉంటుంది, "తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును"  ఇదే స్వామి సుందరకాండలో చేసి చూపించారు, వాల్మీకి రాసి చూపించారు. ఆత్మ దర్శనానికి వెళ్ళేవాడు దేహాభిమానాన్ని ఎంత తగ్గించుకోవాలో చెప్పే శ్లోకం ఇది.
సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః!
పృషదంశక మాత్రస్సన్ భభూవాద్భుత దర్శనః!!
ఇక రాత్రి అనేదాని గురించి గీతాచార్యులు చెప్పేవారు ఉన్నారు. మాములు వారికి పగలు, జ్ఞానికి రాత్రి, మాములు వారికి రాత్రి జ్ఞానికి పగలు. బాహ్యార్ధంగా చూస్తే మామూలు జనాలు నిద్రించేటప్పుడు జ్ఞాని మేల్కొని ఉంటాడు అని అర్ధం వస్తుంది. కానీ అంతరార్ధం కోసం పెద్దలు చెప్పిన వ్యాఖ్యానాలు చూస్తే మరో విషయం తెలుస్తుంది. మామూలు మనిషి పగటిపూట వేటిని చూసి ఆనందపడతాడో వాటిని జ్ఞాని పట్టించుకోడు, మామూలు మనిషి పట్టించుకోని భగవంతుని మాత్రం జ్ఞాని ఎప్పుడూ దర్శిస్తూ ఉంటాడు.
ఇలా చాలా ఉన్నాయి. అసలు ప్రకృతిలో ప్రతి వస్తువు, ప్రతి జంతువు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. మనం తెలుసుకోగలమో లేదో అని ఋషులు సరళం గా వాటిని కావ్యాలుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా ఇచ్చారు. ఇవి కూడా అర్ధం చేసుకోలేకపోతే అని రామనామాన్ని ఇచ్చారు. రామ రామ రామ అని జపిస్తుంటే ప్రకృతి మాయ పొరలు పొరలుగా విడిపోతుంది. అన్నీ వాటంతటే అవే ద్యోతకమవుతాయి. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే, భక్తుడు అప్రయత్నంగా, భగవంతుని విభూతిగా దేన్నైనా అర్ధం చేసుకోగలడు.  ఉదాహరణకి ఒక చీమ చూడండి. ఎన్ని సార్లు కిందపడ్డా తన గమ్యం చేరేవరకూ వదలదు. పొద్దున్నుండీ, సాయంత్రం దాకా అయినా ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనకేదన్నా దొరికితే అందరికీ చెప్పి అందరినీ తీసుకొస్తుంది. మొత్తం నాకే అని ఊరుకోదు. సద్గురువులు కూడా అంతే. తాము కష్టపడి సాధించిన జ్ఞానాన్ని దాచుకోరు. అర్హుడైన శిష్యుడు దొరికితే ఆ అమృతవాణి  గంగా ప్రవాహంలా వెలివడి లోకాన్ని ఉద్ధరిస్తుంది. 
ఒక శక్తి ప్రయోగం నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక పదిలక్షలసార్లు రామనామజపం చేస్తే ఏ శక్తి నైనా ఎదుర్కోవచ్చు. రామనామం, మనసుని ప్రశాంతం చేస్తుంది. తమస్సుతో నిండి ఉండే మనస్సనే నది, స్వచ్చంగా ఎలా వాల్మీకి కి దర్శనమిచ్చిందో అలా మన మనస్సే మనకు అద్దమై మనమేంటో చూపిస్తుంది. లోకమేంటో చూపిస్తుంది. లోకంలో సాధించాల్సింది ఏమిటో చూపిస్తుంది. ఎలా సాధించాలో చూపిస్తుంది.ఏది అడ్డమో చూపిస్తుంది. నిజానికి పంచాంగ చూడటంలో కూడా అర్ధం ఇదేనని పెద్దలు చెప్పారు. నేనెవరిని, ఎవరికి చెందినవాడిని, ఏమి సాధించాలి, ఎలా సాధించాలి, ఏమిటి అడ్డు అనే ఐదింటిని గురించి నిత్యం ఆలోచించమని పంచాంగం చెప్తుందట. మనం కూడా ఆ ఆలోచనని పెంచుకుని రామనామాన్ని మనసులో నింపుకుని జీవన్ముక్తులౌదాము.


నా భార్యకి పండరి భజన నేర్పిన గురువులు పల్లా వెంకటేశ్వర్లు గారు పాడిన ఒక పాట.
మరువబోకు మానవుడా మమత వీడరా!(౩)
ఆ మమత వీడి రామనామ స్మరణ చేయరా!
స్వామి స్మరణ చేయరా,స్వామి స్మరణ చేయరా

రామనామ స్మరణ చేసి ఆత్మసుఖము పొందరా!
ఆత్మసుఖము కన్న మరి పుణ్యమే లేదురా!!

మానవధర్మమ్ము వదిలి దానవుడవు కాకురా!
మాయకు లోబడితె నీవు మానవుడవు కావురా!!

ఒహో!! ఉన్నదానితోనే నీవు తృప్తి పొంది సుఖపడరా!
తృప్తి లేని మానవుడా, భస్మమై పోదువురా!!

అయ్యో!! నాది నీది యనే మూఢ తత్వము విడనాడరా!
వెదకి చూడ జగతిలోన ఏది నీది కాదురా!!


మరువబోకు మానవుడా మమత వీడరా!
ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!

అయ్యో!! అప్పుడిప్పుడనగరాదు ఎప్పుడు ఏ వేళలో !
ఓ! తనువు వెళ్ళె వేళలోన దగ్గరెవ్వరుండరురా!!

అయ్యో!! ఆలుబిడ్డలన్నదమ్ములు, వెంట ఎవరు రారురా!(౨)
వదలలేక వచ్చినా వల్లకాటివరకేరా!!


మరువబోకు మానవుడా మమత వీడరా!
ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!

చుట్టు నాల్గు గోడలలో ఇమిడి ఉన్న పుట్టరా!
పుట్టలోన తాచుపాము బుసలు కొట్టుచుండురా!!

అయ్యో!! కట్టెలే చుట్టాలురా, కాష్టమే ఇల్లురా!

ఓహో!! కట్టెలే చుట్టాలురా, కాష్టమే ఇల్లురా!
 అగ్నిదేవుడే మనకు ఆత్మబంధుడురా!!

హరేరామ హరేరామ హరేరామ యనరా!
హరేరామ యనినంతనే హరియించును పాపములు!!


మరువబోకు మానవుడా మమత వీడరా!

ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!!
స్వామి స్మరణ చేయరా,స్వామి స్మరణ చేయరా !!


సర్వం శ్రీ సీతారామ చంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణ మస్తు..