Thursday, April 14, 2011

ఎవరాదర్శం?

నా స్నేహితుడు:
ఎవరికి వారు నిజాయితీగా ఉంటే చాలు...అవినీతి ఉండదు అంటున్నారు. అది నిజం కూడా. కానీ, చుట్టూ ఉన్న ప్రజానీకానికి నిజాయితీగా బ్రతికేందుకు కావల్సిన పరిస్థితులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎవరిమీద ఉంది?

ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకుని మీదనా?
లేదా ఆ సమాజం వల్ల బాగుపడి కడుపు నిండిన వాడి మీదనా?
లేక ఇద్దరి మీదనా?
వీరిద్దరూ కాక ఇంకా ఎవరైనా ఉన్నారా?
manohar chenekala -
ఎవరైనా కాదు, ఏదైనా ఉందా అని అడిగితే సరైన సమాధానం దొరుకుతుందేమో! అదే మనస్సాక్షి. ఎన్నుకోబడ్డ నాయకులకి ప్రజా ప్రతినిధులుగా ఉన్నాం. మన భాధ్యత వారికి మంచి జీవితాన్ని అందించడం అన్న భావం ఖచ్చితంగా ఉండాలి.నాయకులంటే ఎవరు? ఒకప్పుడు మనలాగే అమ్మపాలు తాగుతూ, తాతయ్యలూ , అమ్మమ్మలూ చెప్పే కధలు వింటూ పెరిగిన వారే కదా! ఆ సమయంలో ఆత్మసాక్షి అనేది ఒకటుందనీ, అది ఆస్తిక,నాస్తిక వాదానికి అందకుండా మనం తప్పు చేసినప్పుడు , ఒప్పు చేసినప్పుడు మన వెంట వుండి తన అభిప్రాయాన్ని చెప్తుందనీ , దాని నోరు నొక్కెయ్యడం ప్రాణాన్ని అమ్ముకుని శరీరాన్ని బతికించుకోవడంలాంటిదనీ అర్ధం అయ్యేలా చెప్పగలగాలి.అప్పుదు ఆ పిల్లవాడు ఏ పనైనా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు, సరైన నిర్ణయం తీసుకుంటాడు, లేదా తీసుకోవడం నేర్చుకుంటాడు. ఇప్పటికైనా మన పిల్లలను ఆ దిశగా తీర్చిదిద్దుకోవడం మన చేతిలోనే ఉంది.


చట్టానికి దొరకకుండా తప్పించుకోవడమ్ కొంత తెలివైన వాడికి సాధ్యమే, కానీ ఆత్మసాక్షి నుండి తప్పించుకోవడం అనేది అంత సులభంకాదు. అది అలవాటైనవాడు ఎవరికీ భయపడడు, ఎంతటివారి ముందైనా నిర్భయంగా తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతాడు. నిజాయితీ ఒకరకమైన ధైర్యాన్నిస్తుంది.

ఇద్దరు స్నేహితులున్నారనుకోండి. ఒకర దగ్గ్గర చాక్లెట్లు ఉన్నాయి, ఒకరి దగ్గర గోళీలు ఉన్నాయి. ఇద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, గోళీలున్నవాడు ఒక గోళీ దాచుకుని ఇచ్చాడు, చాక్లెట్లు ఉన్నపిల్లవాడు మొత్తం ఇచ్చేసాడనుకోండి. అప్పుడు ఎవరు మనశ్శాంతిగా ఉంటారు. తనని అవతలివాడు మోసం చేసినా మొదటివాడు నిర్భయంగా ఉంటాడు, అనుమానించడు, కానీ రెండవవాడు? తాను మోసం చేసాడు కాబట్టి, అవతలివాడు కూడా తనను మోసం చేసాడేమో అని అనుమానం ఉంటుంది, నిద్ర పట్టదు. మనశ్శాంతి ఉండదు. అది నిజాయితీ ఇచ్చే నిర్భయత్వం.Edit11:10 am


నా స్నేహితుడు:
సరే మనోహర్, నేను మరో విధంగా ఆలోచిస్తా... అప్పుడేమంటావు. నిజాయితీని పక్కన పెట్టి, అవతలోడికి నేను ఒక గోళీ తక్కువిచ్చినా నమ్మేశాడు..వెర్రోడు అనుకుంటా... అదే ఆలోచనలో ఉంటాను. వేరే విధంగా ఆలోచించను. నాదే పై చేయ్యి, నేను పక్కోడిని బురిడీ కొట్టించాను అని ఫీలవుతాను. నా దృష్టిలో అవతలోడు ఎప్పుడూ వేస్ట్ గాడే అనుకుంటాను అనుకో... అప్పుడేమంటావ్... ఈ ప్రపంచంలో మనస్సాక్షికి ఈ విధంగా కూడా సమాధానం చెప్పుకోవడం సాధ్యమే.


సరే, నేను తర్వాతి తరానికి ఈ విధంగా బోధిస్తాను. రావణుడు ఉన్నన్నాళ్ళూ లైఫ్‍ని ఎంజాయ్ చేసుకోని, ఒక్క రామబాణంతో పెద్దగా కష్టంలేకుండా చచ్చాడు. అదే రాముడైతే నిజాయితీ కోసం అడవులకెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు అంటాను. మరి, తర్వాతి తరం ఏ ఆలోచనలో పెరుగుతుంది చెప్పు.

ఏనాటికైనా చచ్చేవాళ్ళమే తప్పో, ఒప్పో ఏదైతేనేం ఉన్నన్నాళ్ళూ లైఫ్‍ను ఎంజాయ్ చేసుకుంటే చాలు అనే ఆలోచనలోకి ప్రజలు మారిపోతే ఎలా ఉంటో ఆలోచించుకో..12:12 pm
manohar chenekala - అదే నేననేది,
"సరే మనోహర్, నేను మరో విధంగా ఆలోచిస్తా... అప్పుడేమంటావు. నిజాయితీని పక్కన పెట్టి, అవతలోడికి నేను ఒక గోళీ తక్కువిచ్చినా నమ్మేశాడు..వెర్రోడు అనుకుంటా.. " అనుకుంటావు, కానీ అవతలివాడు నిన్ను మోసం చెయ్యలేదని నీకు నమ్మకం ఉండదు, ఎవరినీ నమ్మవు, నమ్మలేవు. నిన్నెంతో ఇష్టప్డేవాళ్ళపై కూడా నీకు అనుమానంగానే ఉంటుంది. సంబంధాలు చెడిపోయేదాకా తీసుకెల్తుంది. మనస్సాక్షికి సమధానం చెప్పడం ఆంటే, సంజాయిషీ ఇవ్వడం కాదు, నిజాన్ని బయట ఎవరికీ చెప్పకపోయినా నీకు నువ్వు చెప్పుకోవడం. ఇక రావణుడి గురించి నువ్వు చెప్పింది. నేను చెప్పిందీ అదే. మనం వాళ్ళని ఎలా పోర్ట్రైట్ చేస్తామో మన తర్వాతి తరమూ అలాగే తీసుకుంటుంది. పుడుతూనే ఎవరూ రాముడినీ కానీ , రావణుడిని కానీ ఆదర్శంగా తీసుకోరు. మనం రామారావు సినిమాలు చూపిస్తే వాడికి కచ్చితంగా నువ్వన్న ఫీలింగే కలుగుతుంది. అదే నువ్వు రామాయణాన్ని ఉపాసన చేసిన వాళ్ళ మాటలు చెప్తే వాడికి రావణుడి దౌర్భాగ్యం అర్ధమవుతుంది.
నువ్వన్నావే ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేసాడని, కానీ రామాయణం నిజంగా అర్ధమైతే నువ్వు ఆ మాట చెప్పవు.
ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి తాను రాక్షసుడిని కాబట్టి, ఒక స్త్రీని ఎత్తుకురావడం తనకు ధర్మమే అని సమర్ధించుకున్న వాడు ఏ రకంగా సమాజానికి ధర్మప్రాయుడవుతాడొ నువ్వే చెప్పాలి.
తన తలనే ఆహుతి చేసి బ్రహ్మను మెప్పించిన ఒక గొప్ప తపశ్శాలి, కైలాసాన్ని చెణకబోతే, ఎడమకాలి బొటనవేలితో నొక్కి అణిచివేసాడు ఈశ్వరుడు, అతని సామర్ధ్యం గురించే మాట్లాడుకోవాలి మరి.
ఒక ఆడపిల్లని అల్లరి పెట్టబోతే, "ఇష్టం లేని ఆడదాని జోలికి పోతే పోతావని" బ్రహ్మ గారిచ్చిన శాపాన్ని మరుగున పెట్టి, సీతా నీ అంత నువ్వు నన్ను ప్రేమించాలి అందుకే నేను నిన్ను బలవంతం చెయ్యట్లేదు అని కారుకూతలు కూసిన వాడి సత్యసంధత గురించే మాట్లాడుకోవాలి.
ఒక కోతి తన లంకా పట్టణలోకి వచ్చి అల్లకల్లోలం చేస్తే , ఎలాగోలా పట్టుకొచ్చి సభలో నిలబెడితే , రావణుడికి కోపం బదులు భయం వేసింది. ఇంతకుముందు వాడు చేసిన వెధవపనికి శాపమిచ్చిన నందీశ్వరుడే ఎదురుగా నిలబడ్డాడేమో అని భయపడ్డాడు. హనుమకి శత్రు స్థలం. రావణుడికి స్వస్థలం. అయినా రావణుడు భయపడ్డాడు, హనుమ చెప్పదలచుకున్నది నిర్భయంగా చెప్పారు. ఎందుకు తన ఊరైనా రావణుడు భయపడ్డాడు, ఎందుకు శత్రుస్థలమైనా హనుమ భయపడలేదు, చెప్పు?
నువ్వన్న ఆ ఎంజాయ్‍మెంట్ అనేదాని అర్ధాన్ని మార్చేస్తున్నారు, అది గమనించమంటున్నా, ఎంజాయ్‍మెంట్ అంటే ఏంటి? పక్కవాడి సొమ్ము దోచుకోవడమా, బలహీనులని చంపడమా, ఇష్టమైన వాళ్ళని ఎత్తుకొచ్చెయ్యడమా? వీటిల్లో ఏది ఎంజాయ్‍మెంట్ చెప్పు? రావణుడు చేసిన పనుల్లో ఇవి కాక వేరేమైనా ఉన్నాయా?
రాముడిలా ధర్మం కోసం రాజ్యాన్ని వదులుకున్నాడా? లేదే పైగా తమ్ముడి రాజ్యాన్ని లాక్కున్నాడు.
తనకోసం ప్రాణాలు వదిలిన జటాయువుకి, ఒక తండ్రికి కొడుకు చేసినట్టుగా కర్మకాండ చేసి ఊర్ధ్వలోకాలకు పంపాడు రాముడు. మరి రావణుడు, యుద్ధంలో చనిపోయిన సైనికుల సంఖ్య తెలిస్తే తర్వాతి రోజు యుద్ధానికి భయపడతారని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మొసళ్ళకు ఆహారంగా వేసాడు. ధర్మం చెప్పినందుకు తమ్ముడిని చంపుతానన్నాడు.
బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సంధ్యావందనం చేసి వేదం చదవవలసినవాడు, సీతమ్మ పట్ల కామమోహితుడై సరాసరి అశోకవనానికి వచ్చాడు రావణుడు. అడవిలో ఉన్నా, ఒకరు అడిగేవాడు లేకున్నా, పరంపరానుగంతంగా వస్తున్న ఆచార వ్యవహారాలను స్వచ్చంధంగా పాటించిన వాడు రాముడు.
ఆవేశంతో సుగ్రీవుడు రావణుడి మీదకు ద్వంద్వ యుధ్ధానికి వెల్తే, సుగ్రీవా, నీకేమైనా అయ్యుంటే ఎలా? నువ్వు చనిపోతే నేను ఎవరికోసం పోరాడటం, నా మిత్రుణ్ణి పణంగా పెట్టి నా భార్యను సాధించుకోలేను, నేను యుద్ధమే చెయ్యలేనన్నాడు రాముడు. మరి రావణుడో, వెల్తే నేను చస్తాను, నా తర్వాత నువ్వూ నీ లంకా పట్టణమూ మొత్తం సర్వనాశనమవుతుంది అని మారీచుడు చెప్పినా వినలేదు, వెల్లకపోతే ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. అన్నీ వున్నా ప్రశాంతంగా నిద్రకూడా పోలేకపోయాడు, ఏమీ లేకపోయినా సత్యాన్ని, ధర్మాన్ని తప్పకుండా ప్రయాణించాడు రాముడు,


దేన్ని సుఖజీవితం అని బోధిస్తావ్? ఒక్క రామబాణంతో చచ్చాడు అని నువ్వన్నావే, లోకాలని ఏడిపించిన రావణుడు అక్షకుమారుడు చనిపోయిన రోజున ఏడిచింది నీకు తెలుసా, చేతికందొచ్చిన కొడుకు ఇంద్రజిత్ చనిపోయిన రోజున వాడికేమనిపించి ఉంటుందో నీకు తెలుసా, చచ్చిపోయే ముందు కట్టుకున్న భార్య, ఎన్నడూ తనని అధిక్షేపించకుండా అనుగమించిన భార్య వచ్చి "రావణా! నిన్ను చంపింది రాముడనుకుంటున్నావా, నిన్ను చంపింది మితిమీరిన నీ ఇంద్రియ వ్యామోహమే అని దెప్పిపొడిచిననాడు, వాడు ఎంత కుళ్ళి కుళ్ళి ఏడిచి ఉంటాడో ఊహించు, అది చెప్పి చూడు తర్వాతి తరాలకి, అప్పుడు కూడా ఎవరైనా రావణుడే మాకాదర్శం అంటే దండేసి దండం పెడతా నీకూ,వాడికి

Tuesday, April 12, 2011

హనుమద్రక్షాయాగం:



హనుమద్రక్షాయాగం: (2009) మొట్టమొదటిసారి నేను హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం చాలా చిత్రంగా జరిగింది. నా స్నేహితుడొకడు చెన్నై లో ఉండేవాడు. తన బ్లాగులో హనుమద్రక్షాయాగం పోస్టర్ ఉంచాడు. చూసాను, పెద్దగా పట్టించుకోలేదు. నలభైరోజులపాటు, పదకొండు సార్లు చాలీసా పారాయణం చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, ఇంట్లో మా వదిన ఉంటుంది, నలభై రోజులు కంటిన్యుయస్ గా అంటే కుదరదులే అని వదిలేసాను. కానీ ఎక్కడో మనసులో ఒక మూల అవమానంగా ఉండేది. స్వయంగా హనుమే అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నానన్న బాధ ఉండేది. కొన్ని రోజులు పోయాక ఒకసారి ఆ చెన్నై స్నేహితుడికి ఫోన్ చేసాను. ఎలా సాగుతుంది నీ పారాయణం అని అడిగాను. ఏదో సాగుతుంది, హాస్టల్లో కుదరదుకదా, కుదిరినప్పుడు చేస్తున్నా అన్నాడు. దానికి నేనుండి “అలా కాదురా మన్స్ఫూర్తిగా ఆ స్వామి మీద భారం వేసి చెయ్యాలి అని సంకల్పించుకోరా, ఏ అడ్డు రాదు అని చెప్పాను. నువ్వు నేను చేస్తున్నాను అనుకుంటే పూర్తి చేసే బాధ్యత కూడా నీ మీదే పెడతాడు, అలా కాకుండా సంపూర్ణంగా శరణాగతి చేసి చూడు అప్పుడు ఏ అడ్డంకీ ఉండదు”. ఇలా ఒక అరగంట మాట్లాడి ఫోన్ పెట్టేసాను, పెట్టేసాను కానీ ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. శరణాగతి గురించి తనకి చెప్పాను కానీ నాకు ఆ శరణాగతి చేసే బుద్ధి ఉందా అని ఆలోచించాను. ఒకరికి చెప్పే ముందు చేసి ఆచరించాలి కదా అని నా మనసు వెక్కిరించింది. ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని భగవత్కార్యం తప్పించుకుంటున్నానేమో అనిపించింది. సరే అని అప్పుడు తెల్లవారగానే దుర్గేశ్వర గారికి ఫోన్ చేసాను, “స్వామీ మరి సగం దీక్షాసమయం అయిపోయింది, ఇప్పుడు చెయ్యవచ్చా, గోత్రనామాలు పంపమంటారా” అన్నాను. “అయ్యో తప్పకుండా పంపండి, మంచి పనికి ఆలస్యంలేదు, ఇప్పుడైనా మొదలుపెట్టండి, ఏ భయాలు పెట్టుకోకుండా సర్వం ఆ స్వామి మీద పెట్టి మీరు పారాయణ చెయ్యండి, “ అన్నారు.

మొదలుపెట్టాను, పెద్ద పూజ ఏమీ చెయ్యలేదు కానీ రోజూ ధూపం వేసేవాడిని, చాలీసా పారాయణం చేసేవాడిని, అంతే, ప్రదక్షిణలు చెయ్యడం మనవల్ల కాదులే అని చెయ్యలేదు. చాలీసా మాత్రం క్రమం తప్పకుండా ఆ పదిరోజులూ చేసాను. హనుమజ్జయంతికి ఇంకా నాలుగైదు రోజులుందనగా నా స్నేహితుడు ఫోన్ చేసి పూర్ణాహుతికి వెల్దామా అని అడిగాడు, జయంతి మంగళవారం రోజు. శనివారం, ఆదివారం ఉందాములే అని నేనూ వస్తాననీ చెప్పాను, పైగా తనని కూడా కలవచ్చులే, ౨౦౦౬ (2006) లో కాలేజీ అయిపోయిన తర్వాత మూడేళ్ళపాటు మళ్ళీ కలవలేదు. మేమిద్దరము, ఇంకొక నరసరావుపేట అతను ఒకే గదిలో ఉండేవాళ్ళం. చాలా సరదాగా, సన్నిహితంగా ఉండేవాళ్ళం. నాలుగేళ్ళు ఏ పొరపొచ్చాలు లేకుండా గడిపాం. అలాంటిది కాలేజీ తర్వాత మూడు సంవత్సరాలు కలవలేదు. ఎన్నో సార్లు నేను చెన్నై వెల్దామనుకున్నా కుదరలేదు, తను హైద్రాబాద్ కి వద్దామన్నా కుదరలేదు, ఒకట్రెండు సార్లు వచ్చినా కలవడం కుదరలేదు. ఇక మళ్ళీ కలవలేమేమో అని కొద్దిగా భయం వేసింది. కానీ ఈ యాగం ఫలితమా అని ఇప్పుడు కలవబోతున్నా. కొంచెం ఆశ్చర్యమనిపించింది. చదివింది చాలీసా నే కానీ అది సుందరకాండ సదృశమని చాలామంది నమ్మకం, తులసీదాసు వారే ఈ మాట అన్నారని ఎక్కడో విన్నాను. నిజానిజాలు తెలియవు.

సుందరకాండ చదివితే బంధు హిత సమాగమం జరుగుతుందని తెలుసు. కానీ ఇంత సద్యఃఫలితంగా కనపడుతున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాలేదు.ఎలాగైనా యాగానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అప్పటికప్పుడు వినుకొండ కి టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరాను, ఏమీ ప్లానింగ్ లేదు, వెళ్ళిపోయాను. నలభై రోజులూ చేసిన వాళ్ళలో చాలామందికి యాగం లో పాల్గొనే అదృష్టం దొరకదు/నిజానికి దొరకలేదని చెప్పాలి. అలాంటిది నేను చేసినది పాక్షికంగానే ఐనా స్వామి రప్పించుకుంటున్నారు అని ఒక పక్కన ఉన్నా, మరో పక్క ఎవరూ తెలియదు అక్కడ, నేను చేస్తున్నది కరెక్టేనా ముక్కూ, ముఖం తెలియని ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వెల్తున్నానపించింది (అప్పటికి మాస్టరుగారు నాకు పెద్దగా తెలియదు). అటు చెన్నై నుండి నా స్నేహితుడు కూడా బయలుదేరానని ఫోన్ చేసాడు. అంతే! ఇక ఏ సందేహం పెట్టుకోకుండా బయలుదేరమని స్వామి చెప్పినట్టనిపించింది. ఏదైతే అదే అవుతుంది పైన ఆ స్వామే ఉన్నారని బయలుదేరాను. ఆ స్వామి చెయ్యలేనిదేముంది, ఇక పీఠం గురించి నేను ఊహించింది వేరు, ఏదో చిన్న గుడి, ఒక యాగ శాల ఉంటుందేమో అనుకున్నాను.(అప్పటికి నాకు పీఠం గురించిన వివరాలు పెద్దగా తెలియవు. ) ఆ స్వామిని చూడచ్చు, నా స్నేహితుడిని కలుస్తున్నానన్న అనందంలోఉండగానే తెల్లవారుఝామున వినుకొండలో దిగాను. అక్కడినుండి ఉల్లగల్లు దరిశి బస్సు ఎక్కి రవ్వవరం అని చెప్పాను. ఏ స్టాప్ వచ్చినా ఇదేనా రవ్వవరం అని అడగడం, వాళ్ళు కాదు బాబూ, వస్తే చెప్తాములే అని అనడమూ, ఇలా ఒక అరగంట గడిచేలోపు కుడివైపు ఆంజనేయస్వామి కనపడ్డారు. మూడు నాలుగు అడుగుల మూర్తి రూపంలో ఉన్నారు.

పక్కనే ఏదో బోర్డ్ మీద రవ్వవరం అని చూసాను, వెంటనే దిగాను. సరాసరి ఆంజనేయస్వామి కనపడిన దగ్గరికి వెళ్ళాను. అడిగాను ఇక్కడ దుర్గేశ్వర గారని జగన్మాత పీఠం అని . వారుండి ఇక్కడకాదు, ముందే దిగాలి కదా అన్నారు, ఏదో అపశకునంలా అనిపించింది. వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉన్నారు వెళ్ళండి అని వాళ్ళ ఇంటికి పంపారు. ఆయన నన్ను పీఠం దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి నేనూహించుకున్న దానికి అక్కడ కనపడుతున్న పీఠానికి నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. నమ్మలేకపోయాను. పచ్చటి పంట పొలాల మధ్యలో, అడపా దడపా రోడ్డున వచ్చిపోయే వాహనాలు తప్ప మరే గోలా లేని ప్రశాంతమైన వాతావరణంలో, చుట్టూ అరటిచెట్లూ, పూలచెట్లూ, మామిడిచెట్లూ, ఇలా రకరకాల చెట్లతో చాలా అందంగా ఉంది ఆ స్థలం. ఇక హనుమ మూర్తి అయితే సాక్షాత్తూ పరాశరసంహితలో ఎలాగైతే అరటిచెట్ల మధ్యలో ఉపాసించాలన్నారో , అలాగే చుట్టూ అరటిచెట్లూ, మధ్యలో ఆకాశాన్నంటేలా ఉన్న హనుమ , పాదాల దగ్గర, అభిషేకాదులకోసం మరో చిన్న మూర్తి కొలువై ఉన్నారు. అరటి తోటలో స్వామిని ఉపాసన చెయ్యాలి అని మొదటిసారి విన్నప్పుడు , ఎవరికి కుదురుతుంది ఇల చెయ్యడం అని అనుకున్నాను. కానీ “సకలప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతియై యుండు సూక్ష్మకళుండచ్యుతుడయ్యెడన్ విరటజా గర్భంబు దా జక్ర హస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్ధియై యడ్డమై ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్” అని పోతన గారిచే కీర్తించబడ్డ స్వామి కదా ఆయన, నా మనసులోని విషయం తెలుసుకొని ఇలా చూపించారేమో అని అనిపించింది.







(మిగతాది మరికొద్దిసేపట్లో)

Tuesday, March 1, 2011

వివేకానందుడికి కూడా మతం రంగు పులుముతున్నారు.

జై శీరామ్,
శ్రీరామదూతం శిరసా నమామి!

హైదరాబాద్, ఫిబ్రవరి 27 : ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీఓ నంబర్ 16
ద్వారా స్వామి వివేకానంద జీవితం, బోధనలను ఉపవాచకంగా ప్రవేశపెట్టాలని
ఆదేశించడం సరైన చర్య కాదని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
ఎన్.నారాయణ, ఐ.వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. దానివల్ల ఒక మత సారాన్ని
విద్యార్థులపై రుద్దినట్లవుతుందని తెలిపారు.
-----------------------------------------------------------------------------------
ఆఖరికి వివేకానందుల మీద పడ్డారు. వారి మాటలు మత ప్రచారాలా? వారి మాటలు,జీవిత విశేషాలు తెలిపే వివరాలు పిల్లలకు పాఠ్యాంశాలుగా ఉంచడం భావ్యం కాదా, భగవంతుడా! ఎటుపోతుంది నా దేశం. ఆయన ఏనాడూ అదిస్తాము మా మతంలో చేరండి, ఇదిస్తాము మా మతంలో చేరండి అని అనలేదే.ఆత్మోద్ధరణ లేని మతాచారం నిన్ను మరింత కూలదోస్తుంది అని చెప్పారు. మతాచారాలు పాటించేవారి కన్నా తమ మీద తమకు నమ్మకమున్న వారినే ఈ దేశానికి పునాదులుగా, భావితరాలకు దిశానిర్దేశం చెయ్యగల మార్గదర్శకులుగా ఆయన భావించారు.
వివేకానందుల వారి జీవితం ఒక అన్వేషణ.సత్యం కోసం,తనను తాను తెలుసుకోవడం కోసం, తనేంటో తెలుపగల గురువు కోసం చేసిన నిరంతర అన్వేషణ.అందులో ఎంతటివారినైనా ప్రశ్నించగల ధైర్యం ఉంది, గుడ్డిగా నమ్మకపోవడం అన్న ఆత్మస్థైర్యం ఉంది. వివేకానందుడి పుట్టినరోజు మాత్రం యువజన దినోత్సవంగా జరుపుతారట, కానీ ఆయన బోధనలు మాత్రం యువతరానికి మార్గదర్శకం కావట. రెండింటికీ ఏమన్నా పొంతన ఉందా?
ఆయన మహోన్నత వ్యక్తిత్వం చదివే వ్యక్తికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోగల ఆలోచనని ప్రచోదనం అయ్యేలా చెయ్యగలదు. ఒక గమ్యాన్ని చేరుకునే పధకరచన చేసుకునేలా ప్రేరేపించగలదు.అలాంటి వ్యక్తి గురించి చెప్పడం మతసారాన్ని పిల్లమీద రుద్దడం అవుతుందా? అలాంటి ఆయన్ని మతప్రచారకుడిగా మార్చే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?
మీరూ మీ ప్రతిస్పందనని utf వాళ్ళకి ( ఈ మెయిల్ ఐడి ద్వారా aputf2000@yahoo.com)తెలియచెయ్యండి, కనీసం అలా అన్నా వివేకానందుడి గొప్పతనానికి మచ్చ తెచ్చే, భావితరాలను వివేకానందుడి లాంటి గొప్ప స్ఫూర్తిదాతను మరిచిపోయేలా చేసే ఈ ప్రయత్నాన్ని అడ్డుకుందాం. ఇది మతాల సమస్య కాదు, పిల్లలకు పనికొచ్చేవాటిని కూడా మతం పేరుతో దూరం చేస్తున్నారు.మతాలకతీతంగా దీన్ని ఖండించాలి..

Thursday, February 3, 2011

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు



ముందు ఇది చదవండి
http://durgeswara.blogspot.com/2011/02/blog-post_02.html
తర్వాత...
న్యాయ మార్గంలో నడిచే వాళ్ళందరికీ శుభం కలగాలి అని చెప్పే శ్లోకం అర్ధాన్ని ఇలా విరిచి కూడా చెప్పొచ్చని ఇవ్వాలే తెలిసింది. నవ్వాలో ఏడవాలో కూడా తెలియడంలేదు. దాని తర్వాత పదం "లోకాస్సమస్తా స్సుఖినోభవంతు" దీనర్దం ఏమిటో వారికే తెలియాలి. కేవలం ఆవులను,బ్రాహ్మణులను మాత్రమే పట్టించుకునే వారైతే ఈ లోకం మాత్రమే కాకుండా సమస్త లోకాల శుభాలను కూడా కోరుకోవాల్సిన అవసరం ఏముంది. అదే కాదు, నేను చేసే ఈ కార్యం వల్ల వానలు పడాలనీ , పృధ్వీ తలమంతా సస్యశ్యామలంగా ఉండాలని,దేశం క్షోభరహితంగా ఉండాలనీ చెప్పినది కనపడదేమో. బ్రాహ్మణులు నిర్భయంగా ఉండాలని చెప్పడం, లోకానికి హితవు చెప్పేవారు స్వతంత్రంగా ఉండవలసిన అవసరం గురించి చెప్పడం కాదా? ఈనాడు మన కోర్టులకున్న స్వయం ప్రతిపత్తి అనాడు వారికుండవలసిన అవసరం గురించి చెప్పడమే అది. ఎందుకంటే లోకానికి వారు రుగ్మతలనుండి కాపాడే వైద్యులు,మంత్రాంగాన్ని నడిపించే ప్రధానులు,మెరుగైన తరాన్ని తయారుచేసే ఉపాధ్యాయులు. అలాంటి వారు ఎవరో ఒకరి ప్రాబల్యానికి లొంగిపోతే ఆ సమాజం పాడైపోతుంది, అందుకే వారు నిర్భయంగా ఉండాలని చెప్పడం. ఇక శుభం ఆవులకూ, బ్రాహ్మణులకూ మాత్రమేనా అని అడిగితే నాకు ఒక శ్లోకం గుర్తు వస్తోంది.
రోజూ ఆదిత్య హృదయం చివరలో పారాయణసమాపన క్రియలో పటించే శ్లోకం.
"అపుత్రాః సంతు పుత్రిణః, పుత్రిణః సంతు పౌత్రిణః!
అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాం శతం.!!"
ఇక దీని అర్ధం చెప్పవలసిన ఆవసరం కూడా లేదు.
నా ఇంట్లో నేను పూజ చేసుకుని లోకంలో పిల్లలు లేని వాల్లందరికీ పిల్లలు కలగాలి, పిల్లలున్న వాళ్ళకి మనవళ్ళు,మనవరాళ్ళు కలగాలి, అందరూ నిండు నూరేళ్ళూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకోవడానికి నాకేమవసరం, కానీ అలాగే ప్రార్ధిస్తాం, ఎందుకంటే నా ధర్మం అందరి గురించి ఆలోచించమని చెప్పింది, సైన్స్ లో chaos theory అనేది ఒకటుంది. ప్రకృతి లో జరిగే ప్రతి చిన్న మార్పు, మరొక మార్పుకి కారణభూతం అవుతుంది అని. రీసెంట్ గా జరిపిన పరిశోధనలలో ఆలోచనకి కూడా శక్తి ఉంటుంది అని ఋజువు చెయ్యడం జరిగింది. (రెండు చెట్లు మొలకెత్తే దశలో ఉన్నప్పుడు ఒక చెట్టుని మంచి మాటలతో, మరొక చెట్టుని తిట్లతో పెంచినప్పుడు రెండు చెట్లు రెండు రకాలుగా పెరిగాయు. )మరి అలాంటిది మనం రోజూ అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటే అది ప్రకృతిని అలా శాసించదా? అలా జరిగేలా ప్రకృతిని నిభంధించదా? అదే సనాతనధర్మం లో గొప్పదనం. తోటివారి పతనాన్నో,లేక వారి బలహీనతల మీదనో జీవితాన్ని నిర్మించుకోవడాన్ని ఈ ధర్మం ఎన్నటికీ ఒప్పుకోదు, ఈ ధర్మాచరణలో మనకు అడుగడుగడుగునా మార్గదర్శకంగా నిలిచే బ్రాహ్మణులని స్వయం ప్రతిపత్తితో, నిర్భయంగా ఉండాలని కోరుకోవడం మన కర్తవ్యం కాదా? మనం ఒక పూజ ఇంట్లో చేస్తే మనకు తెలిసిన వారు, మన క్షేమం కోరేవారు బాగుండాలని కోరుకుంటాము, అలాంటిది లోకం క్షేమం కోరే బ్రాహ్మణుడు, లోక క్షేమం కోసం పాలిచ్చే ఆవులు బాగుండాలని కోరుకోవడం కుల పక్షపాతమో, ఇంకోటో ఎలా అవుతుందో నాకు అర్ధం కావడంలేదు. వాళ్ళు బాగుంటే లోకం బాగుంటుంది అని పెద్దల ఉద్దేశ్యం. అర్ధం చేసుకునే దృష్టికోణం బట్టి ఉంటుంది. మన దృష్టికోణం ఆ వైపుకి పోకుండా ఉండేందుకు మీడియా,కలిశక్తులూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీటికి ఎదురీదాల్సిన అవసరం మనదే. మంచిమనసుతో చూసినప్పుడు అన్నీ మంచిగానే కనపడతాయి.

Sunday, January 30, 2011

ch creations

జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!



@సిహెచ్ క్రియేషన్స్...

ఎలా ఉంది?

Friday, December 17, 2010

ఆవును చూడరా,బొల్లావును చూడరా!


కాటమరాజుని కరుణించినాతల్లి!
కష్టాలు కడతేర్చు ఓ కల్పవల్లీ!!

అన్న అయితమరాజుని ఆదుకొనియెడి తల్లి!
అపురూపగని వమ్మ ఆనందవల్లీ!!

సాగిలపడి నీకు దండాలు పెట్టేము!
బొల్లావువై నీవుండ మాకేటి బెంగ!!

హారతూలిచ్చేము,పూజలూ చేసేము!
దయతోడ మమ్ములను చూడమ్మ చల్లంగ!!

చెనికల వారిల్ల వెలసియున్నావమ్మ!
చేటురాకుండాను కాపాడవమ్మ!!

మాతల్లితండ్రులను గాచితివి కరుణతోడ!
నీ బిడ్డలమమ్మ చూడమ్మ దయతోడ!!

నిన్ను కొలిచేటికి చేరినామమ్మ!
తప్పులెంచక మమ్ము కరుణించవమ్మ!!

నీ పూజలు చేసేము,నియతి తప్పకుండానూ
నీ సేవలూ చేసేము, నియమమ్ముగానూ
నీ పాదాలు పట్టేము, నమ్మకముగానూ
నిన్ను కొలుచుకు బతికేము, నీవే మా దిక్కంటూ......

యాదవుల వంశ చరిత్రలో బొల్లావుది ఒక విశిష్ట స్థానం. ఆ ఆవు పాలతో తయారు చేసిన పదార్ధం ఎప్పటికీ చెడిపోదు.
ఆ ఆవు పరాక్రమం ముందు ఎంతటి వారైనా నిలవలేరు, కాబట్టే

ద్వాపరమందు కృష్ణునిగ దానవవైరి జనించి తెల్పె పెన్
పాపము పెచ్చుమీరి క్షితిభారము మిక్కుటమైన ధర్మ సం
స్థాపన చేయగా తరచు తానె జనింతునటంచు ,కాన మా
గోపకులాన నొక గోవుయై పుట్టె లోకులు బొల్లియావనన్!

అంటూ కాటమరాజు కీర్తించాడు.
ఇప్పటికీ ఎప్పుడు కొలుపులు చేసినా బొల్లావులను తీసుకెళ్ళి స్నానం చేయించి పూజలు చేయించి మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు.
శివకాళ్ళందరూ బొల్లావు మూర్తులని, వృషభమూర్తులని తీసుకుని ఆనంద పరవశంతో నృత్యం చేస్తుంటే సాక్షాత్తూ విష్ణుమూర్తి ముందు పరమశివుడు తాండవం చేస్తున్నట్టుంటుంది.

అలా ఒకనాడు బస్సులో కూర్చుని, ఆరుద్ర గారు రాసిన కాటమరాజు కధ నాటకం నెమరువేసుకుంటుండగా మనసులో మెదలిన పాట ఇది. అప్పుడో చరణం, అప్పుడో చరణం కూడుకుంటూ ఇలా రాసాను. మొన్న కొలుపుల్లో పాడదామనుకున్నాను, కానీ నేను రాసుకున్నట్టు కానీ,రాయగలననీ కానీ మా నాన్నగారికి, మా అన్నయ్యకి తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ రాలేదు. అంచేత నేనే మనసా ఆ బొల్లావు మూర్తి దగ్గర కూర్చుని పాడుకున్నాను. ఇంకెవరైనా కాటమరాజు మీద, బొల్లావు మీద ఆసక్తి కలవారు ఉంటారేమో ,వారికి నచ్చుతుందేమో అని ఇక్కడ ప్రచురిస్తున్నాను.

Friday, November 26, 2010

ధార్మిక వివక్ష! - మొహమ్మద్ ఇర్ఫాన్

గల్ఫ్‌లోని అన్ని దేశాలు పూర్తిగా ఇస్లామిక్ రాజ్యా లు కాగా అందులో కొన్ని కఠోర మత నిబంధనలు పాటిస్తుండ గా మరికొన్ని ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఇస్లామిక్ దేశమైనప్పటికీ మొత్తం గల్ఫ్‌లో కువైట్ ఒక అభ్యుదయ భావాలు కలిగిన దేశంగా పేరొందినా ఈ దీపావళి సందర్భం గా కువైట్ పోలీసులు ప్రవర్తించిన అమానుష చర్య అనేక ప్రశ్నలను సంధించింది.

ఒమాన్‌లోని, యుఎఇ(దుబాయి)లోని మందిరాలు మినహా గల్ఫ్‌లో ఎక్కడ కూడా హిందువుల ఆలయాలు లేవు. ఒక గుజరాతీయ సింధీ వ్యక్తి నిర్వహణలో ఉన్న దుబాయిలోని ఇరుకయిన మందిరాన్ని విస్తరించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇక విశాల సౌదీ అరేబియాలో కనీసం దేవుళ్ల చిత్రపటాలను కూడా తీసుకరావడం కూడా నిషే ధం. ఈ పరిస్థితులలో హిందూ ధార్మిక అభిరుచి కలిగిన కొందరు ఇళ్లలో గోప్యంగా సామూహిక ప్రార్థనలు జరుపుకోవడం మినహా మరే మార్గం లేదు.

కొన్నాళ్ల క్రితం దుబాయిలోని జుమేరియాలో గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించిన కొంత మంది యువకులను దుబాయి పోలీసులు అదుపులోకి తీసుకుని హెచ్చరించి వదిలిపెట్టారు. ప్రపంచంలోని ఎత్తయిన భవనాలలో ఒకటైన బుర్జ్ అల్ ఖలీఫా పైకప్పుపై బతుకమ్మ ఆడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రయత్నించారు. ధార్మిక కారణాల వల్ల కుదరలేదు. అందుకే హిందూ పండుగలను ఒక సాంఘిక లేదా సాంస్కృతిక కార్యక్రమంగా జరుపుకోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయిలో దసరాకు ముందు జరుపుకునే దాండియా ఉత్సవాలు ప్రముఖమైనవి. అయితే అందులో కేవలం సంపన్న వర్గాలు మాత్రమే పాల్గొంటారు.

ఈ ఏడాది నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రఖ్యాత క్లబ్ యజమాని గుజరాతీ వ్యాపారస్తులతో కలిసి దాండియాను భారీ వ్యయంతో కూడిన ఉత్సవంగా మార్చారు. కువైట్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు చేసే సంప న్న ప్రవాస భారతీయులు నివసించే సాల్మీయాలోని టైటానిక్ నివాస సముదాయంలో గత కొద్ది కాలంగా దీపావళి పండుగను ఆర్భాటంగా, ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. మొత్తం కువైట్‌లో ఈ ఒక్క ప్రదేశమే సురక్షితం కావడంతో రానురాను దీని ప్రాధాన్యం పెరిగి అనేక భారతీయ కుటుంబాలు టైటానిక్ నివాస సముదాయానికి వచ్చి టపాకాయలు కాల్చడం, పిల్లలతో ఆనందం పొందుతున్నారు.

ప్రతిసారి అలా సంప న్న భారతీయులు టైటానిక్ కాంప్లెక్స్‌లో టపాకాయలు కాల్చుతూ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. దీనికి ప్రత్యేకంగా అధికారుల నుంచి అనుమతి కూడా ఉంది. రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాన్ని ముగించాలనే షరతుతో అనుమతి ఇచ్చారు. ఈ రకంగా అన్యమతస్తులు పండుగను నిర్వహించుకోవడం కొంతమంది కువైట్ జాతీయులకు మింగుడుపడలేదు. అందుకే ఈసారి దాన్ని ఎలాగై నా భగ్నం చేయాలనే పథకం రచించారు.

ఈ మేరకు అనుమతి లేకుండా బాణాసంచా పేల్చుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాయుధ పోలీసు బలగాలు వచ్చి దీపావళి జరుపుకుంటున్న 18 మందిని అరెస్టు చేశారు. 22 నిమిషాల గడువు ముగిసిన తర్వాత అంటే రాత్రి 9 గంటల 22 నిమిషాలకు పోలీసులు టైటానిక్ సముదాయంపై దాడి చేశారు. ఉగ్రవాదుల దాడులకు వెళ్లినట్టుగా 16 ప్రత్యేక వాహనాలలో వచ్చిన స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు పెద్ద తోపులాట తర్వాత భవన సముదాయంలోకి ప్రవేశించారు. అరెస్టు అయిన వారిలో అయిదుగురిని మరుసటి రోజు విడుదల చేయగా, మిగిలిన వారిని నాలుగు రోజుల తర్వాత విడుదల చేశారు. ఈ సంఘటన కువైట్‌లో పెద్ద దుమారం రేపింది.

భారతీయ ఎంబసీ తీరుపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఎంబసీ దీనిపై నోరు విప్పలేదు. కువైట్ జనాభాలో విదేశీయులు మెజారిటీ సంఖ్యలో ఉండగా అందులో భారతీయులు అగ్రగణ్యులు కాగా, అందులో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. అయినా ప్రభుత్వ తీరు సమంజసంగా లేదు. అంతకు ముందు కువైట్‌లోని ఒక స్టేడియంలో శ్రీలంకకు చెందిన సింహాళీయులు తమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీనికి కువైట్ ప్రభుత్వం అనుమతించింది కూడా.

సభలో శ్రీలంక రాయబారితో సహా ఆ దేశానికి చెందిన అనేకమంది ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు వేదికపై ఉండగా ఒక్కసారిగా పోలీసులు స్టేడియంలోకి ప్రవేశించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమ నిర్వహణకు తమకు అనుమతి ఉందని చెప్పినా శుక్రవారం నమాజు సమయంలో లౌడు స్పీక ర్ల ద్వారా పాటలు పాడడం భావ్యం కాదంటూ మొత్తం కార్యక్రమాన్ని ముగించారు. దీంతో వేలాది మంది నిరాశతో వెనక్కి మళ్లారు. 2003లో కువైట్‌లో భారతీయ రాయబారిగా వచ్చిన స్వష్ పవన్ సింగ్ స్థానికంగా ఉన్న ఒక గురుద్వారకు వెళ్లిన కొద్ది రోజులకు అక్రమంగా అనుమతి లేకుండా దాన్ని నిర్మించారని కువైట్ అధికారులు దాన్ని కూలగొట్టారు.

ముస్లింలలో షియా వర్గానికి చెందిన బోహ్రా తెగకు చెందిన ప్రవాస భారతీయులు, పాకిస్థానీలకోసం మసీదు నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కువైట్ మంత్రి తన పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. క్రైస్తవ మతానికి సంబంధించి కొన్ని చర్చీలు ఉన్నప్పటికీ దాన్ని విస్తరించడానికి కూడా స్థానికుల నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొత్తం గల్ఫ్ కూటమిలో కువైట్ ప్రగతిశీల, స్వేచ్ఛా వాతావరణం కలిగిన దేశం గా పేరొందింది.

దుబాయి కంటే కూడా కువైట్‌లో స్వేచ్ఛ ఎక్కువ అని పేరున్నా, ఇస్లామేతర ధార్మిక విషయాలకు సంబంధించిన ఈ సంఘటనలు చూస్తే బాధ కలుగుతుంది. ఆర్థికంగా, మౌలిక వసతుల కల్పన విషయంలో గల్ఫ్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ ధార్మిక విషయాలలో మాత్రం ఇంకా ఇస్లామిక్ మత ఛాందవాదం ముసుగులో ఉంది.

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)